విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఉత్తమ్. చిత్రంలో పొన్నం తదితరులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి కరోనా ముప్పు రావడానికి కారణం కేసీఆర్ అసమర్థతే అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం కోవిడ్ నియంత్రణలో ఘోరంగా విఫలమైందని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం గాంధీభవన్‌లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ప్రధాన కార్యదర్శులు మహేశ్‌కుమార్ గౌడ్, బొల్లు కిషన్‌లతో కలిసి ఉత్తమ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కరోనా వైరస్ రాష్ట్రంలోకి వచ్చిన మూడు నెలల తరువాత కూడా ఒక్క బెడ్ అందుబాటులో లేకపోవడం సిగ్గుపడాల్సిన విషయమన్నారు.
కేసీఆర్ సమర్ధత ఏంటో ప్రజలందరూ తెలుసుకున్నారని, రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజలకు ఒక్క కోవిడ్ హాస్పిటల్ మాత్రమే పనిచేస్తుందా అని ఎద్దేవా చేశారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కి కేంద్రం రూ. 50 లక్షలు నష్టపరిహారం ప్రకటిస్తే రాష్ట్రం అమల్లోకి తేలేదని అన్నారు. కేంద్రంతో సహా రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, కోవిడ్ బారిన పడిన పేద కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి వచ్చే కేంద్ర బృందాన్ని కలిసి కరోనాపై నివేదిక ఇస్తామని చెప్పారు.
పీవీ కాంగ్రెస్‌కు గర్వకారణం
దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. పీవీ దేశాన్ని గొప్పగా నడిపించిన తీరును కాంగ్రెస్ నేతలుగా తాము గర్వంగా చెప్పుకుంటామని, ఆయన గురించి ఎవరు గొప్పగా చెప్పినా స్వాగతిస్తామన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏడాది పొడవునా పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని ఉత్తమ్ చెప్పారు. కాంగ్రెస్ పీవీని గౌరవించి పదవులు ఇచ్చిందని, తెలంగాణ ముద్దు బిడ్డ పీవీని పార్టీ చిరస్థాయిగా గుర్తు పెట్టుకుంటుందన్నారు.
కరోనా కష్ట కాలంలో ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం మోపినందున జూలై 3న నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు చేస్తామన్నారు. తెల్ల రేషన్‌కార్డ్ ఉన్న ప్రతి కుటుంబానికి విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ మాట్లాడుతూ.. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలపై పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ కేంద్రం భారం మోపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో పెట్రోల్, డీజిల్ ధరల పేరుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈ రోజు చేస్తోంది ఏంటని ప్రశ్నించారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినా, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గ డం లేదని, 2014 నుంచి ఇప్పటివరకు 200 శాతం టాక్స్‌లు పెంచారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment