ఆయన రెచ్చగొట్టేలా మాట్లాడారు.. ఊరుకోం.. | TRS Leader Vinod Kumar Comments On Amit Shah | Sakshi
Sakshi News home page

అమిత్ షా రెచ్చగొట్టేలా మాట్లాడారు.. ఊరుకోం..

Published Mon, Jul 8 2019 11:52 AM | Last Updated on Mon, Jul 8 2019 1:57 PM

TRS Leader Vinod Kumar Comments On Amit Shah - Sakshi

సాక్షి, కరీంనగర్‌ : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాపై టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌ మండిపడ్డారు. కేంద్ర హోంశాఖ మంత్రి పదవిలో ఉన్న అమిత్ షా హైదరాబాద్‌లో ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారని, బెంగాల్‌లాగా తెలంగాణ కావాలని కోరుకోవడమంటే హింసను ప్రేరేపించడమేనని వ్యాఖ్యానించారు. హోం మంత్రి అంతర్గత భద్రతను కాపాడేలా మాట్లాడాలని సూచించారు. బెంగాల్ తరహా రాజకీయ హింసను ప్రోత్సహిస్తే చూస్తూ ఊరుకోమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ హింసకు తావు లేకుండా తెలంగాణ ఉద్యమం నడిపించి రాష్ట్రం సాధించాం. తెలంగాణలో అలజడి సృష్టించాలని చూస్తే.. రాష్ట్రం సాధించిన పార్టీగా మేం చూస్తూ ఊరుకోం. శాంతి ఉన్నచోటనే అభివృద్ధి ఉంటుంది. పోలీసు మంత్రిగా ఉన్న అమిత్ షా ఇక్కడి పోలీసులకు పని కల్పించాలనుకుంటున్నారా?. వీధి పోరాటాలు చేస్తాననడం ఆయన స్థాయికి తగదు. 15 రోజులకో మంత్రిని పంపిస్తాననడం ఆహ్వానిస్తున్నాం. ముందుగా జల మంత్రి షకావత్‌ను పంపించి మా ప్రాజెక్టులు చూసి నిధులివ్వమనండి. తర్వాత గడ్కరీని పంపి జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయమనండి.

పీయూస్ గోయల్‌ను పంపించి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేయమనండి. తెలంగాణకు కావాల్సిన అవసరాలు తీర్చండి. మేము  మంత్రులకు ఏడాదికి సరిపడా అజెండా ఇస్తాం. కానీ అమిత్ షా అజెండా మాత్రం తెలంగాణ వ్యతిరేక అజెండా. మీ పార్టీని విస్తరించుకుంటే విస్తరించుకోండి. శాంతికి విఘాతం కలిగించకండి. వీధి పోరాటాలు కాదు సైద్ధాంతిక పోరాటం చేద్దాం. రైల్వే గురించి బడ్జెట్లో చర్చనే లేదు. ప్రత్యేక రైల్వే బడ్జెట్ పెట్టాలి. కొత్తపల్లి - మనోహరాబాద్ రైల్వే లైన్‌ను నిర్వీర్యం చేయడానికి బీజేపీ కుట్ర చేస్తోంది. ఈ సారి ఈ లైన్‌కు తక్కువ నిధులిచ్చారు.  రైతుబంధు, మిషన్ భగీరథను బీజేపీ కాపీ కొట్టింది. 40 లక్షల మందికి మేము ఫించన్లు ఇస్తున్నాం. మీరిచ్చేవెన్నో చెప్పాలి. బీజేపీ కుట్రలను తిప్పికొడతాం. తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు రాకుండా కేసీఆర్ అడ్డుపడుతున్నారంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదం. ప్రాణహిత చేవెళ్ల తెచ్చిననాడు అధికారంలో ఉన్న మీరు జాతీయ హోదా ఎందుకీయలేదు?. ఈ రాష్ట్రానికి బీజేపీ, కాంగ్రెస్ పనికి రాని పార్టీలు. సభ్యత్వ నమోదులో ఊరూరా ఈ పార్టీల తీరును ప్రజలకు వివరిస్తాం. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన 2001లో పుట్టిన వారందరికి ఇప్పుడు ఓటు హక్కు రాబోతోంది. అలాంటి వాళ్లకు సభ్యత్వంలో ప్రియార్టీ ఇస్తా’’మన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement