‘ప్రగతి నివేదన’ అట్టర్‌ ఫ్లాప్‌ షో | TRS meeting was an utter flop | Sakshi
Sakshi News home page

‘ప్రగతి నివేదన’ అట్టర్‌ ఫ్లాప్‌ షో

Published Mon, Sep 3 2018 2:40 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

TRS meeting was an utter flop  - Sakshi

ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఉత్తమ్‌. చిత్రంలో పొన్నాల, భట్టి, వీహెచ్, షబ్బీర్‌æఅలీ

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రగతి నివేదన సభ ‘అట్టర్‌ ఫ్లాప్‌ షో’అని కాంగ్రెస్‌ పార్టీ అభివర్ణించింది. అది ప్రగతి నివేదన కాదని, జనావేదన సభగా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నిండుసభలో సీఎం కేసీఆర్‌ దొంగ మాటలు మాట్లాడారని విమర్శించారు. ఆదివారం రాత్రి తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సభతో కేసీఆర్‌ తన ధనబల ప్రదర్శన చేశారని, కేసీఆర్‌ అవినీతిని ప్రపంచం నివ్వెరపోయేలా గమనించిందన్నారు. ప్రగతి నివేదన పేరుతో రూ.300 కోట్ల అవినీతి సొమ్ము ఖర్చు పెట్టారని ఆరోపించారు. సభలో కేసీఆర్‌ ప్రసంగం తుస్సుమనిపించిందని ఎద్దేవా చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకుండా బెదిరించి ప్రైవేటు స్కూళ్లు, కళాశాలల బస్సులను చట్టవిరుద్ధంగా తీసుకున్నారని, ఎవడబ్బ సొమ్మని ఆర్టీసీ బస్సులు వాడుకున్నారని ఆ యన ప్రశ్నించారు. కేసీఆర్‌ సీఎం అయ్యాక ఒక్క విద్యు త్‌ ప్రాజెక్టయినా మొదలుపెట్టారా..? అని నిలదీశారు. మిషన్‌ భగీరథ ద్వారా 10 శాతం ఇండ్లకు కూడా నీళ్లివ్వ లేదని, చెప్పిన సమయానికి నీళ్లివ్వడంలో కేసీఆర్‌ విఫ లమయ్యారన్నారు. అది మిషన్‌ భగీరథ కాదని, కమీషన్‌ భగీరథ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ ప్రసంగం లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు, ముస్లిం, గిరిజన రిజర్వేషన్లు, దళితులకు మూడెకరాల భూమి ప్రస్తావనే లేదన్నారు. కేసీఆర్‌కు నిబద్ధత లేదని విమర్శించారు.  

ఆత్మహత్యల్లో రాష్ట్రం నంబర్‌ వన్‌
కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చాక రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం నంబర్‌ 1 అయిందని, రాష్ట్ర ప్రజలను మందులో ముంచడం, అవినీతిలో నంబర్‌ వన్‌ అయిందని ఉత్తమ్‌ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక నాలుగు వేల చిన్న తరహా పరిశ్రమలు మూతపడ్డాయని పేర్కొ న్నారు. నిరుద్యోగులను తప్పుదోవ పట్టించే విధంగా కేసీఆర్‌ ప్రసంగం సాగిందని విమర్శించారు. ఢిల్లీకి తాము చెంచాలం కాదని, కేసీఆర్‌ ప్రధాని నరేంద్ర మోదీకి చెంచా అని, ఆయనకు ఏజెంట్‌గా పనిచేస్తున్నారని అన్నారు. ‘కేసీఆర్‌ హఠావో... తెలంగాణ బచావో’నినాదంతో కాంగ్రెస్‌ పార్టీ ముందుకెళ్తుందని ఉత్తమ్‌ చెప్పారు.

పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ అది ప్రగతి నివేదన సభ కాదని, ముక్క, చుక్క, లెక్క సభలా సాగిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల హామీల మీద, మాట నిలబెట్టుకోవడం మీద, తెలంగాణ ప్రగతి మీద కేసీఆర్‌ చర్చకు వస్తే తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అది ప్రగతి నివేదన కాదని, జనావేదన అని, చెప్పుకోవడానికి ఏమీలేక పేలవంగా మారిందన్నారు. సమావేశంలో మండలిలో విపక్ష నేత షబ్బీర్‌ అలీ, పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, కేంద్ర మాజీమంత్రి బలరాం నాయక్, ఏఐసీసీ కార్యదర్శి ఎస్‌.సంపత్, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి పాల్గొన్నారు.   


నివేదనపై కాంగ్రెస్‌ నేతల నజర్‌
శనివారం రాత్రే సమావేశమైనటీపీసీసీ ముఖ్యులు
సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ నిర్వహించిన ప్రగతి నివేదన సభను ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ నిశితంగా గమనించింది. భారీ జనసమీకరణ లక్ష్యంగా నిర్వహించిన సభలో టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంచలన ప్రకటనలు చేస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందనే దానిపై ఆ పార్టీ ముఖ్యులు ఆరా తీశారు. ఆదివారం ఉదయం నుంచే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మొదలు.. రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు, క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు ప్రగతి నివేదన సభ పరిణామాలను గమనిస్తూ వచ్చారు. సభకు కార్యకర్తలను ఎలా తరలిస్తున్నారు? ఏ నాయకుడి ఆధ్వర్యంలో, ఏ నియోజకవర్గం నుంచి ఎంత మంది వెళ్లారనే లెక్కలు కట్టుకున్నారు.

మరోవైపు హైదరాబాద్‌లో మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి నివాసంలో కాంగ్రెస్‌ ముఖ్య నేతలు శనివారం రాత్రే సమావేశమయ్యారు. సమావేశానికి ఉత్తమ్, సీఎల్పీ నేత జానారెడ్డి, మండలిలో విపక్ష నేత షబ్బీర్‌ అలీ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.  కేసీఆర్‌ అనుసరించే వ్యూహంతోపాటు చేయనున్న ప్రకటనల ఆధారంగా ఎలాంటి నిర్ణయం తీసుకునేందుకైనా వెనుకాడవద్దని, అవసరమైతే ఎన్నికలకు యుద్ధప్రాతిపదికన సిద్ధమవ్వాలని నిర్ణయించుకున్నారు.   పార్టీలో చేరాల్సిన ముఖ్య నేతలను వెంటనే చేర్చుకోవాలని నిర్ణయించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement