సొంత గూటికి డీఎస్‌! | TRS MP D Srinivas To Rejoin Congress Party  | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 5 2018 1:21 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

TRS MP D Srinivas To Rejoin Congress Party  - Sakshi

డీఎస్‌

సాక్షి, నిజమాబాద్‌: ‘నేను రాజీనామ చేయను.. దయచేసి నన్ను సస్పెండ్‌ చేయండి. లేకుంటే తీర్మానం వెనక్కి పంపండి’అని మంగళవారం అల్టిమేటం జారీ చేసిన టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ మరుసటి రోజే మళ్లీ సొంత గూటికే చేరుతున్నారనే ప్రచారం జోరు అందుకుంది. త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సోనియాలను డీఎస్‌ కలవనున్నారని, ఆయన చేరికకు అధిష్టానం కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 11న సోనియా, రాహుల్‌ సమక్షంలో ఎమ్మెల్సీ భూపతి రెడ్డితో పాటు డీఎస్‌ కాంగ్రెస్‌లో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది.

ఈ వార్తాల్లో వాస్తవం లేదు: డీఎస్‌
తను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని డీఎస్‌ తెలిపారు. మీడియాకు అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదని, తను తీసుకునే నిర్ణయం తన వ్యక్తిగతమన్నారు. పార్టీ మార్పుపై వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలే అని కొట్టి పారేశారు. తనకు టీఆర్‌ఎస్‌ అధిష్టానం నుంచి సమాధానం కావాలని, నిన్న అన్ని విషయాలు చెప్పానన్నారు. తనడిగిన ప్రతి ప్రశ్నకు టీఆర్‌ఎస్‌ స్పష్టతను ఇవ్వాలన్నారు. కొందరు టీఆర్‌ఎస్‌ నేతలు చేసిన వ్యాఖ్యలపై తను స్పందించనన్నారు.

డీఎస్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఎంపీ కవితతో పాటు పార్టీ జిల్లా ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన మంగళవారం స్పందిస్తూ మనసులో ఏదో పెట్టుకుని.. నిరాధారమైన ఆరోపణలతో తనను రాజకీయంగా దెబ్బతీయడమే కాకుండా, తన కుటుంబాన్ని రోడ్డుకు ఈడ్చారని డీఎస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. లేనిపోనివి కల్పించి.. అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి తన కుమారుడు సంజయ్‌పై కేసు పెట్టించారన్నారు. తన రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్‌ బీజేపీలో చేరడం అతని స్వీయ నిర్ణయమని చెప్పారు. ఇందులో తన ప్రమేయం లేదన్నారు.

అర్వింద్‌ బీజేపీలోకి వెళుతున్నారనే విషయం ముందుగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రెండు సార్లు వివరించానని, ఆయన సీరియస్‌గా తీసుకోలేదని స్పష్టం చేశారు. తన యాభై ఏళ్ల రాజకీయ జీవితంలో క్రమశిక్షణకు మారుపేరుగా బతికానని చెప్పుకొచ్చా రు. ఎంపీ కవిత, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తనపై లేనిపోని అభండాలు వేసి పార్టీ వ్యతిరేకిగా ముద్రవేసి పార్టీ నుంచి బహిష్కరించాలని తీర్మానం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన విషయంలో సీఎం కేసీఆర్‌ స్పందించని పక్షంలో సరైన సమయంలో.. సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటానన్న డీఎస్‌ కాంగ్రెస్‌లో చేరికకు మార్గం సుగమం చేసుకోని ఇలా మాట్లాడారని ప్రచారం జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement