సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌లోని అసంతృప్తి వ్యవహారాలపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఎన్నికల తరుణంలో పలువురు చట్టసభల సభ్యులు, నియోజకవర్గ స్థాయి నేతలు పార్టీకి దూరమవుతున్న తీరును పరిశీలిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోవడంతో పార్టీకి దూరమైన వారిని మినహాయిస్తూ.. ఇతర నేతలు వేరే పార్టీలో చేరడానికి గల కారణాలను విశ్లేషిస్తోంది. కచ్చితంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తుందనే పరిస్థితుల్లోనూ పలువురు నేతలు పార్టీ వీడుతుండడానికి కారణాలు ఏమిటనే కోణంలో వివరాలను సేకరిస్తోంది. రాష్ట్రంలోని పలువురు టీఆర్‌ఎస్ ముఖ్యులు శనివారం రాహుల్‌గాంధీ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్, ఎమ్మెల్సీ రాములునాయక్, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి వీరిలో ఉన్నారు.
కఠిన వైఖరే...
టీఆర్‌ఎస్‌లోనే ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి విషయంలో కఠినంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తుందని, అందరికీ మంచి అవకాశాలు ఉంటాయని చెప్పినా కొందరు ఉద్దేశపూర్వకంగా పార్టీకి నష్టం చేస్తున్న సమాచారం అధిష్టానానికి చేరింది. ఇలాంటివారిని ముందుగానే గుర్తించి సస్పెండ్ చేస్తోంది. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని సస్పెండ్ చేస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు నర్సారెడ్డిని టీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన జారీ చేసింది.
ఇదే తరహాలో ఎమ్మెల్సీ రాములునాయక్‌ను సైతం గతంలో సస్పెండ్ చేసింది. ఇలాంటి నేతలు ఇంకా ఎవరైనా ఉన్నారా అని ఆరా తీస్తోంది. నియోజకవర్గాల వారీగా పరిశీలించి ఇలాంటి నేతల జాబితా రూపొందిస్తోంది. పార్టీకి నష్టం చేస్తున్న నేతలపై చర్యల విషయంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వేచిచూసే ధోరణితోనే ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వరకు పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు. అయితే టీఆర్‌ఎస్ అధిష్టానం నిర్ణయాలు సంగతి ఎలా ఉన్నా ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ పలువురు నేతలు పార్టీకి దూరమవుతున్నారు. అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం రానివారితోపాటు పలువురు నేతలు టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి ఇతర పార్టీల్లో చేరుతున్నారు.
- నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌గౌడ్ కూడా కాంగ్రెస్‌లో చేరారు. టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కొన్ని నెలలుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన శనివారం రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు.
- టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సొంత జిల్లాలోనూ కీలక నేతలు టీఆర్‌ఎస్‌ను వీడారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితోపాటు నారాయణఖేడ్ టికెట్ విషయంలో ఎమ్మెల్సీ రాములునాయక్‌ను టీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. వీరిద్దరూ శనివారం రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్నారు. అంధోల్ తాజా మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ టీఆర్‌ఎస్‌ను వీడి ఇదే సెగ్మెం ట్‌లో బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నారు.
- వరంగల్ ఉమ్మడి జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ కాంగ్రెస్‌లో చేరారు. పరకాల అసెంబ్లీ స్థానంలో సురేఖ ప్రచారం మొదలుపెట్టారు. పరకాల, భూపాలపల్లి, వరంగల్ తూర్పు సెగ్మెంట్లలో వీరి ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
- ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన జువ్వాడి నర్సింగరావు సోదరులు కాంగ్రెస్‌లో చేరారు. గత ఎన్నికల్లో కోరుట్ల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నర్సింగరావు రెండోస్థానంలో నిలిచారు. మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు వారసులుగా కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాలలో కాంగ్రెస్‌కు అనుకూల పరిస్థితులు ఉండేలా వీరు ప్రభావం చూపుతారని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.
- ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జెడ్పీ చైర్మన్ ఎన్.బాలునాయక్ కాంగ్రెస్‌లో చేరారు. దేవరకొండలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో మిర్యాలగూడ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి 3 రోజుల క్రితం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాజీ ఎంపీ రమేశ్‌రాథోడ్ టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అబ్బయ్య గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరుఫున ఇల్లందులో పోటీ చేసి ఓడిపోయారు.
- ఉమ్మడి రంగారెడ్డిలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. రత్నం గత ఎన్నికలలో చేవెళ్ల టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని నారాయణపేట నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కె.శివకుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment