మాట్లాడుతున్న మంత్రి దయాకర్‌రావు, పక్కన ఎమ్మెల్యే రమేష్
సాక్షి ప్రతినిధి, వరంగల్: అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువైన టీఆర్‌ఎస్ పార్టీ, కేసీఆర్ నాయకత్వంపై మరోసారి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు తమ సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించారని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కాంగ్రెస్, విపక్షాలు ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా... ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్‌ఎస్ ప్రభంజనం కొనసాగిందని, ప్రజలంతా టీఆర్‌ఎస్ వెంటే ఉన్నారనడానికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో మరోసారి రుజువైందని తెలిపారు. హన్మకొండలోని తన నివాసంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. పరిషత్ ఎన్నికల పలితాల్లో కారు స్పీడును ఏ పార్టీ అందుకోలేకపోయిందని.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వచ్చిన ఈ ఫలితాలు చరిత్రలో రికార్డుగా నమోదు కానున్నాయని మంత్రి దయాకర్‌రావు పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ పాలనపై నమ్మకంతో రాష్ట్ర ప్రజలంతా టీఆర్‌ఎస్ వెంటే ఉన్నారని అన్నారు. వరుస విజయాలను అందిస్తున్న రాష్ట్ర ప్రజలు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఓటర్లు, ఈ విజయ పరంపరలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ మంత్రి కతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నూతనంగా ఏర్పడిన ఆరు జిల్లాల్లో మొత్తం 70 జెడ్పీటీసీ స్థానాలకు గాను 62 టీఆర్‌ఎస్ గెలువడం సామాన్యమైన విషయం కాదన్నారు. ఆరు జిల్లాల్లోని 70 మండలాల్లో 781 ఎంపీటీసీలకు గాను 541 ఎంపీటీసీలను టిఆర్‌ఎస్ కైవసం చేసుకోగా.. మరో 50 మందికి పైగా టీఆర్‌ఎస్ అభిమానులే గెలిచారని వెల్లడించారు.
తద్వారా ఆరు జిల్లా పరిషత్‌లతో పాటు 60కి పైగా మండల పరిషత్‌లపై గులాబీ జెండా ఎగురవేయబోతున్నామని మంత్రి దయాకర్‌రావు పేర్కొన్నారు. ప్రజలు అందించిన ఈ విజయాలతో తమ బాధ్యత ఇంకా పెరిగిందని, రాష్ట్రాన్ని అభివృద్ది చేయడమే లక్ష్యంగా ఆ పనిలో నిమగ్నమవుతామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇటీవల కొన్ని సీట్లు రావడంతో సంబర పడుతున్నాయని.. జాతీయ పార్టీల వల్ల కొంత అయోమయం నెలకొన్నా పరిషత్ ఎన్నికల్లో ఆ పార్టీలు కనుమరుగయ్యాయని అన్నారు. కాగా, ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ ఘన విజయంతో గులాబీ శ్రేణులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలసి మిఠాయిలు పంచి, టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి.. జెడ్పీటీసీ, ఎంపీటీసీలను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్, సాంబారి సమ్మారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment