సాక్షి, హైదరాబాద్: పది రోజులుగా తెలంగాణ రాజకీయ క్షేత్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే.. లోక్‌సభ ఎన్నికలకు ముందే 16సీట్లలో విజయంపై మరింత స్పష్టత సాధించే దిశగా అధికార టీఆర్‌ఎస్ దూసుకెళ్తోందని స్పష్టమవుతోంది. ఆపరేషన్ ఆకర్ష్‌తో కాంగ్రెస్‌కు రోజుకో షాక్ ఎదురవుతుండడంతో.. ప్రత్యర్థుల్లేకుండా టీఆర్‌ఎస్ వ్యూహాలు రూపొందిస్తోంది. ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే నాటికి రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు ఇలాగుంటే.. ఎన్నికల సమయానికల్లా ప్రతిపక్ష కాంగ్రెస్‌ను మరింత దెబ్బగొట్టేలా గులాబీ పార్టీ ముందుకెళ్తోంది.
కారు జోరు ఖరారే!
అధికార టీఆర్‌ఎస్ ఉన్న పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు ఆ పార్టీకి నల్లేరు మీద నడకగానే కనిపిస్తున్నాయి. ఉత్తర తెలంగాణలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో ఏకఛత్రాధిపత్యానికి తోడు దక్షిణ తెలంగాణలోనూ ఎదురులేని విధంగా రోజురోజుకూ రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ప్రస్తుతం పార్టీకి ఉన్న 90 మంది ఎమ్మెల్యేలకు తోడు మరో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జతకావడం, అడిగిందే తడవుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కారెక్కేందుకు ఉత్సాహం చూపిçస్తుండడంతో క్షేత్రస్థాయిలో గులాబీ పార్టీలో జోష్ కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికలు ముగిసి లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎక్కడా కాంగ్రెస్ పార్టీని కోలుకోనీయకుండా.. కేసీఆర్ విసురుతున్న రాజకీయ పాచికలు గులాబీ సైన్యానికి మరింత ఊపు తెచ్చి పెడుతున్నాయి.
రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం రోజు నుంచి మంత్రివర్గ విస్తరణ, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ల ఎన్నిక, ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదుగురిని గెలిపించుకునేందుకు ఆయన పన్నిన వ్యూహాలు పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠను, ఉత్సాహాన్ని నింపాయి. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హుషారుగా ఎన్నికల కదనరంగంలోకి దూకి పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. కరీంనగర్ నుంచి ప్రారంభమైన కేటీఆర్ ఎన్నికల నగారా ఇప్పటికే మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో పూర్తయింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో గులాబీ జోరును అడ్డుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికీ సాధ్యం కాదనే అభిప్రాయం బలపడుతోంది.
ఫిరాయింపులతో బేజారు..
అధికార టీఆర్‌ఎస్ పరిస్థితి ఇలాఉంటే.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కచ్చితంగా అందుకు భిన్నంగా కనిపిస్తోంది. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా జారిపోతుండడం ఆ పార్టీ నేతలను, కార్యకర్తలను నిరాశ నిస్పృహల్లో ముంచెత్తుతోంది. మొత్తం 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందగా ఇప్పటికే ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్యలు పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. వీరికి తోడు ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ కూడా కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకుని కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెపుతున్నట్టు ఆదివారం సాయంత్రం లేఖ విడుదల చేశారు.
అదే రోజు ఉదయం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ నివాసంలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డిలు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయ్యారు. వీరి మధ్య రాజకీయ అవగాహన కుదిరినట్టు తెలుస్తోంది. దీంతో సబిత కూడా తన అనుచరులతో సోమవారం సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం తర్వాత ఆమె కాంగ్రెస్‌ను వీడుతున్నట్టు ప్రకటించడం లాంఛనమే కానుంది. దీంతో మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీని వదిలివెళ్లడం ఖాయమైపోయింది.
రోజుకో ఎమ్మెల్యే చొప్పున లేఖలు విడుదల చేస్తుండడం, సమావేశాలు నిర్వహిస్తుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి కాంగ్రెస్‌లో నెలకొంది. నల్లగొండ జిల్లా నుంచి మరో ఇద్దరు కీలక నేతలు కూడా టీఆర్‌ఎస్‌లోకి వెళుతున్నారనే వార్తలు వస్తున్నాయి. వారు అధికార పార్టీ తీర్థం పుచ్చుకుంటే నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ తగిలినట్టే. ఇలాంటి పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాల్సి రావడం కాంగ్రెస్‌కు అగ్నిపరీక్షే. దీనికితోడు గత ఎన్నికల్లో కలిసి పోటీచేసిన టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లతో ఈసారి పొత్తు ఉండే అవకాశాల్లేవు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో కనీస స్థానాల్లో గెలుపొందే అవకాశం కూడా కాంగ్రెస్‌కు లేదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.
మానుకోటలోనూ ఎదురీతే..
మహబూబాబాద్ విషయానికి వస్తే డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుపొందగా, ఇటీవలే పినపాక ఎమ్మెల్యే కూడా అధికార పార్టీలోకి వస్తున్నట్టు ప్రకటించారు. మిగిలిన ములుగు, ఇల్లెందు, భద్రాచలం స్థానాల్లో ములుగు మినహా కాంగ్రెస్ పెద్దగా పోటీ ఇచ్చే అవకాశం కూడా లేదు. ఈ నేపథ్యంలో ఈ రెండు లోక్‌సభ స్థానాల్లో కూడా కాంగ్రెస్ గెలుపు సాధ్యం కాదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
గట్టిపోటీ ఇస్తుందని భావిస్తున్న భువనగిరి లోక్‌సభ పరిధిలో కూడా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ఈ లోక్‌సభ పరిధిలోని ఇబ్రహీంపట్నం, జనగామ, ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి స్థానాల్లో ఇప్పటికే టీఆర్‌ఎస్ గెలుపొందగా, నకిరేకల్ ఎమ్మెల్యే కూడా గులాబీ గూటికి చేరుతున్నట్టు ప్రకటించారు. ఒక్క మునుగోడు నుంచే కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నకిరేకల్ ఎమ్మెల్యేకు తోడు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మరో ఇద్దరు కీలక నేతలు కూడా టీఆర్‌ఎస్‌లో చేరతారనే వార్తల నేపథ్యంలో భువనగిరి లోక్‌సభ స్థానం కూడా గులాబీ ఖాతాలోకేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఖమ్మంలో కష్టమే!
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కలు చూసినా లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ హవాకు ఎలాంటి ఇబ్బందులుండవు. కేవలం మహబూబాబాద్, ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గాల్లో మాత్రమే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కన్నా కాంగ్రెస్ కూటమి ఎక్కువ ఓట్లు సాధించింది. ఈ రెండు స్థానాల్లోనూ పంచాయతీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ సత్తా చూపించి మెజార్టీ సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో అప్పటికే ఆ రెండు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ఆశలు ఆవిరయ్యాయి.
అయితే, ఖమ్మం లోక్‌సభ పరిధిలోని ఖమ్మం అసెంబ్లీ స్థానాన్ని టీఆర్‌ఎస్ గెలుచుకోగా, ఎన్నికల తర్వాత వైరా, సత్తుపల్లి ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరారు. అశ్వారావుపేట నుంచి టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇక్కడ కూడా టీఆర్‌ఎస్ ఆధిపత్యమే కనిపిస్తోంది. ఇక, పాలేరు నుంచి మంత్రి తుమ్మల ఉండడంతో ఆ నియోజకవర్గంలోనూ ఈసారి మెజార్టీ సాధించే వ్యూహాలకు టీఆర్‌ఎస్ పదును పెడుతోంది. ఒక్క మధిర, కొత్తగూడెం నియోజకవర్గాల్లోనే కాంగ్రెస్ కొంతమేర పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment