జైపూర్ మండలం ఇందారంలో జరిగిన బాల్క సుమన్ ప్రచార సభలో ఆత్మహత్యాయత్నం చేసిన గట్టయ్య
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్)లో అసెంబ్లీ టికెట్ల వ్యవహారం రేపిన చిచ్చు ఇంకా చల్లారలేదు. అభ్యర్థులను ప్రకటించి వారం రోజులు కావస్తున్నా, చాలా నియోజకవర్గాల్లో అసమ్మతి కొనసాగుతోంది. టికెట్ ఆశించి భంగపడినవారు స్వతంత్రంగా బరిలోకి దిగుతామని ప్రకటిస్తున్నారు. అందుకు అనుగుణంగా రంగంలోకి కూడా దిగిపోతున్నారు. టికెట్ ఖరారైన అభ్యర్థుల కంటే వేగంగా ప్రచారం కూడా షురూ చేశారు. మరికొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆ అభ్యర్థులను మార్చాల్సిందేనని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు రంగంలోకి దిగారు. ఆయా నేతలతో చర్చలు జరిపి, పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు.
ఓదెలుకు సీఎం నుంచి పిలుపు
చెన్నూరు నియోజకవర్గ టికెట్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు కాకుండా పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు కేటాయించడంతో గులాబీ పార్టీలో వర్గపోరు మొదలైంది. ఓదెలు శాంతియుత కార్యక్రమాలతో నిరసనలకు దిగారు. మంగళవారం తనకు తానుగా గృహ నిర్బంధం విధించుకున్నారు. దీంతో వెంటనే వచ్చి సీఎం కేసీఆర్‌ను కలవాలని ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంవో) అధికారులు ఓదెలుకు ఫోన్ చేసి చెప్పారు. బుధవారం ఉదయమే ఆయన హైదరాబాద్‌కు బయలుదేరారు. అయితే జైపూర్ మండలం ఇందారంలో బాల్క సుమన్ ప్రచార ప్రారంభ కార్యక్రమంలో ఓదెలు అనుచరుడు రేగుంట గట్టయ్య పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో ఓదెలు వెంటనే వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. తాజా ఘటనతో చెన్నూరు రాజకీయం కొత్త మలుపు తిరిగింది. ఇక చాలా నియోజకవర్గాల్లోనూ అసంతృప్త జ్వాలలు ఎగసిపడుతూనే ఉన్నాయి.
- ఖానాపూర్ టికెట్‌ను తాజా మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు మళ్లీ ఇస్తున్నట్లు ప్రకటించడంతో అక్కడ అభ్యర్థిత్వం ఆశించిన రమేశ్‌రాథోడ్ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించి, ప్రచారం సైతం ప్రారంభించారు.
- స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్ తాజా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు ఇవ్వడంతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అసంతృప్తితో ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి తన కుమార్తె కావ్యకు అవకాశం ఇవ్వాలని కడియం కోరారు. అయితే, టీఆర్‌ఎస్ అధిష్టానం మళ్లీ రాజయ్యకే టికెట్ ఇవ్వడంతో ఇరు వర్గాల మధ్య మొదలైన వర్గపోరు ఏకంగా వ్యక్తిగత అంశాల వరకు వెళ్లింది. రాజయ్యకు సంబంధించిన ఆడియో సంభాషణ బహిర్గతం వెనుక ప్రత్యర్థి వర్గానికి చెందిన మండల స్థాయి ప్రజాప్రతినిధి ఉన్నాడని రాజయ్య వర్గం చెబుతోంది. ఈ నేపథ్యంలో రాజయ్య బుధవారం కడియం శ్రీహరి దగ్గరికి వెళ్లి పాదాభివందనం చేశారు. ఎన్నికల్లో గెలిచేలా ఆశీర్వదించాలని కోరారు. అయితే కడియం నుంచి సానుకూలత రాలేదని తెలిసింది.
- భూపాలపల్లి టికెట్ స్పీకర్ మధుసూదనాచారికి ఇవ్వడంతో అక్కడ అభ్యర్థిత్వం ఆశించిన గండ్ర సత్యనారాయణరావు అసంతృప్తితో ఉన్నారు. ఎలాగైనా పోటీలో ఉంటానని స్పష్టం చేసి ప్రచారం మొదలుపెట్టారు. కేటీఆర్, కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ తనకు టికెట్ ఇస్తానని స్పష్టంగా హామీ ఇచ్చాకే టీఆర్‌ఎస్‌లో చేరానని ప్రచారంలో చెబుతున్నారు.
- వేములవాడలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే చెన్నమేని రమేశ్‌బాబుకు మళ్లీ అవకాశం వచ్చింది. అయితే అక్కడ టికెట్ ఆశించిన కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ అసంతృప్తితో ఉన్నారు. రమేశ్‌బాబును మార్చి తుల ఉమకు టికెట్ ఇవ్వాలని వేములవాడ మున్సిపల్ చైర్మన్, ఇటీవల అవిశ్వాసంతో పదవి కోల్పోయిన వేములవాడ ఎంపీపీ తదితరులు డిమాండ్ చేస్తున్నారు.
- రామగుండం సెగ్మెంట్‌లో టీఆర్‌ఎస్ గ్రూపుల వ్యవహారం అంతు లేకుండా సాగుతోంది. ప్రతి ఎన్నికల్లో ఉన్నట్లుగానే ఇప్పుడూ అదే పరిస్థితి నెలకొంది. తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అభ్యర్థి అయితే పార్టీ ఓడిపోతుందని, తనకే అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్ మరో నేత కోరుకంటి చందర్ కోరుతున్నారు. కచ్చితంగా పోటీలో ఉంటానని చెబుతూ ప్రచారంలోకి దిగారు.
- మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో వేనేపల్లి వెంకటేశ్వర్‌రావు అసంతృప్తితో సొంత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పోటీలో ఉంటానని ప్రకటించారు.
- చేవెళ్ల టికెట్ పంచాయతీ ఏకంగా రాజీనామాలకు దారి తీసింది. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన కె.ఎస్.రత్నం ఈసారీ టికెట్ ఆశించారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన తాజా మాజీ ఎమ్మెల్యే కాలె యాదయ్యను టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ప్రకటించడంతో రత్నం బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
- ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. టీడీపీ నుంచి వచ్చిన తాజా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి సొంత కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇదే నియోజకవర్గంలో మరో నేత ఈసీ శేఖర్‌గౌడ్ మంచిరెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.
- షాద్‌నగర్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌కు మళ్లీ అవకాశం ఇవ్వడాన్ని నిరసిస్తూ సీనియర్ నేత అందె బాబయ్య, వీర్లపెల్లి శంకర్‌లు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ అసమ్మతి నేతలను కూడగడుతున్నారు. అసంతృప్త నేతలతో మాట్లాడేందుకు మంత్రి సి.లక్ష్మారెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డిలు ప్రయత్నించినా వారు రాలేదు.
- సత్తుపల్లి నియోజకవర్గం అభ్యర్థిగా పిడమర్తి రవి పేరును టీఆర్‌ఎస్ ప్రకటించింది. గత ఎన్నికల్లోనూ ఇక్కడ పిడమర్తి రవి పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన మట్టా దయానంద్ ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. టికెట్ ఆశించి భంగపడిన ఆయన తాను బరిలో దిగుతానని ప్రకటించారు.
కేటీఆర్ బుజ్జగింపులు...
మక్తల్ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి టికెట్ లభించింది. అయితే, ఆరుగురు అసంతృప్తి నేతలు తమలో ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా పార్టీ గెలుపు కోసం పని చేస్తామని చెప్పారు. వారంతా రామ్మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా మండలవారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసంతృప్త నేతలతో మంత్రి కేటీఆర్ బుధవారం చర్చలు జరిపారు. అభ్యర్థిని మార్చాలని అసంతృప్త నేతలు కోరగా, పార్టీ అభ్యర్థి కోసం కలిసి పని చేయాలని కేటీఆర్ వారికి సూచించారు. కల్వకుర్తిలో టికెట్ ఆశించి భంగపడిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, గోలి శ్రీనివాస్‌రెడ్డి, విజితారెడ్డి, బాలాజీసింగ్‌లతో కేటీఆర్ చర్చలు జరిపారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి జైపాల్‌యాదవ్ విజయానికి కలిసికట్టుగా పని చేయాలని సూచించారు.
హరీశ్‌రావు మంతనాలు
ఉమ్మడి మెదక్ జిల్లాతోపాటు ఇతర జిల్లాల్లోని పలు నియోజకవర్గాల అసంతృప్త నేతలతో మంత్రి హరీశ్‌రావు చర్చలు జరిపారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా పార్టీ ప్రకటించిన వారి గెలుపు కోసం సమష్టిగా పని చేయాలని ఆదేశించారు. అంథోల్ అభ్యర్థి క్రాంతికిరణ్ గెలుపు కోసం పని చేయాలని స్థానిక నేతలకు సూచించారు. నర్సాపూర్ అభ్యర్థి మదన్‌రెడ్డి, ఆయన వ్యతిరేక వర్గీయులతో హరీశ్ చర్చలు జరిపారు. నారాయణఖేడ్ అభ్యర్థిగా ప్రకటించిన భూపాల్‌రెడ్డిని వ్యతిరేకిస్తున్న వారికి సర్దిచెప్పారు. అభ్యర్థిని మార్చడం సాధ్యంకాదని పార్టీ గెలుపు కోసం పని చేయాలని సూచించారు. సంగారెడ్డి అభ్యర్థి చింతా ప్రభాకర్‌ను అభ్యర్థిగా ప్రకటించడంతో అసంతప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణకు సర్ది చెప్పారు. అలంపూర్ అభ్యర్థిగా అబ్రహంను ప్రకటించడంతో టికెట్ ఆశించిన మాజీ ఎంపీ మందా జగన్నాథం అసంతృప్తితో ఉన్నారు. ఇద్దరితో హరీశ్‌రావు మాట్లాడి, అబ్రహాం గెలుపు కోసం పని చేయాలని జగన్నాథంకు సూచించారు. గద్వాలలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కృష్ణమోహన్‌రెడ్డి, టికెట్ ఆశించిన గట్టు తిమ్మప్ప, చంద్రశేఖర్‌రెడ్డిలతోనూ హరీశ్ మట్లాడారు. అందరూ కలిసి కష్ణమోహన్‌రెడ్డిని గెలిపించాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment