కర్ణాటక ఎన్నికల ప్రచారం జోరందుకున్న వేళ.. సాక్షాత్తూ బీజేపీ జాతీయ సారథి అమిత్‌షా.. ప్రతిపక్షాలకు ఒక అస్త్రాన్ని అందించారు. కర్ణాటకలో ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వాల్లో అత్యంత అవినీతి చేసిన సర్కారు యడ్యూరప్పదేనంటూ అమిత్‌షా పేర్కొని..ఆ వెంటనే నాలుక కర్చుకున్నారు. యడ్యూరప్ప కాదు సిద్దరామయ్య.. సిద్దరామయ్య అంటూ నొక్కిచెప్పారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై అవినీతి ఆరోపణలు చేసే క్రమంలో షా ఇలా గజిబిజికి గురై.. యెడ్డీని ఇరికించడంతో ఇప్పుడు ప్రత్యర్థులు ఇదే అస్త్రంగా వాడుకొని విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నాయి.
ఏనాడూ నిజాలు మాట్లాడని అమిత్ షా ఎట్టకేలకు నిజాన్ని మాట్లాడారు. థ్యాంక్యూ అమిత్ షా అంటూ కర్ణాటక సీఎం సిద్దరామయ్య ట్వీట్ చేశారు. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా అమిత్ షాపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కర్ణాటకలో ఎన్నికలు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎట్టకేలకు నిజం వెలుగులోకి వచ్చింది. ఇది మీ మనసులోని మాట కదా అమిత్ షా సర్.. జస్ట్ అడుగుతున్నా’ అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.
తమపై సిద్దరామయ్య చేసిన ఆరోపణలను తిప్పి కొట్టే క్రమంలో అమిత్ షా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ మధ్యే ఓ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి దేశంలో పెరిగిపోయిన అవినీతి గురించి మాట్లాడారు. ఇప్పటిదాకా తాను గమనించిన ప్రభుత్వాల్లో యాడ్యూరప్ప ప్రభుత్వమే అత్యంత అవినీతిమయమైందని ఆయన తెలిపారు’ అంటూ చెప్పుకొచ్చారు. దాంతో షా పక్కనే ఉన్న యెడ్డీ కంగుతున్నారు. పక్కన ఉన్న మరో నేత వెంటనే షా చెవిలో సిద్దరామయ్య అని చెప్పడంతో పొరపాటున గమనించి.. యాడ్యురప్ప కాదు.. సిద్ధరామయ్య అని సవరించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment