
చెన్నై,టీ.నగర్: పార్టీ ఆదేశిస్తే చెన్నై మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తానని డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, నటుడు ఉదయనిధి స్టాలిన్ వెల్లడించారు. ఉదయనిధి స్టాలిన్ నటిస్తున్న చిత్రం సైకో. మిష్కిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డబుల్ మీనింగ్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో అరుళ్‌మొళి మాణిక్కం నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ విలేకరులతో మాట్లాడుతూ.. సైకో చిత్రనిర్మాణ సమయంలో పగటిపూట పార్లమెంటు ఎన్నికల ప్రచారం, రాత్రి చిత్రం షూటింగ్స్ జరిగాయన్నారు. పెరియార్ గురించి వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో రజనీ క్షమాపణ చెప్పేది లేదని వెల్లడించినట్లు విలేకరులు ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ..అది ఆయన అభిప్రాయమని, దీన్ని డీఎంకే అధ్యక్షుడు ఖండించినట్లు తెలిపారు. చెన్నై మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తారా? అని ప్రశ్నించగా పార్టీ అదేశిస్తే చేస్తానన్నారు.