జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభిస్తున్న ఉమ్మారెడ్డి, తదితరులు (ఇన్‌సెట్‌లో) మాట్లాడుతున్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
సాక్షి, గుంటూరు: మద్యం వల్ల మహిళలు పడుతున్న ఇబ్బందుల్ని చూసిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వాటిని పూర్తిగా రూపుమాపాలనే ఉద్దేశంతో దశలవారీగా మద్యపాన నిషేధం అమలుకు సంకల్పించారని శాసన మండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. గుంటూరు రూరల్ మండలం పలకలూరులోని విజ్ఞాన్ నిరూల మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ‘దశల వారీగా మద్యపాన నిషేధం–ఆచరణాత్మక అమలు ప్రణాళిక’ అనే అంశంపై నిర్వహించిన రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం ఆదాయం కోసం ప్రజారోగ్యాన్ని పాడుచేస్తూ.. ప్రజలను మద్యానికి బానిసల్ని చేసిందన్నారు. రాష్ట్ర ఆదాయంలో నాలుగో వంతు మద్యం అమ్మకాల ద్వారానే వస్తోందన్నారు. మద్యపాన నిషేధం ద్వారా కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు వైఎస్సార్ సీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లాం మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక, కుటుంబ సమస్యలకు మద్యం మూల కారణమన్నారు. కేవలం చట్టాలు తీసుకు రావడం వల్ల మాత్రమే మద్య నిషేధం అమలు కాదన్నారు.
ఆరోగ్యానికి అత్యంత హానికరమైన చీప్ లిక్కర్‌పై తక్కువ పన్నులు ఉన్నాయని, తక్కువ హాని కలిగించే హై బ్రాండ్ మద్యంపై మాత్రం ఎక్కువ పన్నులు విధిస్తున్నారని తెలిపారు. ఎక్కువ హాని కలిగించే మత్తు పదార్థాలపై అత్యధిక ట్యాక్స్‌లు వేసి ప్రజలు వాటిని వాడకుండా చేయాలన్న ప్రాథమిక సూత్రాన్ని గత ప్రభుత్వాలు విస్మరించాయని చెప్పారు. వైఎస్సార్ సీపీ మహిళా నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్ హయాంలో మద్యపాన నిషేధం వల్ల రాష్ట్రంలో కుటుంబ తలసరి ఆదాయం రూ.600 నుంచి రూ.2,000 వరకూ పెరిగినట్టు నివేదికలు వెల్లడించాయని చెప్పారు. అనంతపురం జిల్లాలో చుక్కనీరు లేక ప్రజలు విలవిల్లాడుతుంటే.. అదే జిల్లాలో మద్యంపై రూ.244 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం పొందుతోందన్నారు. కనీసం ఆ మొత్తాన్ని ప్రజల తాగునీటి అవసరాలకు కూడా వినియోగించని అధ్వాన్న పాలన ఐదేళ్లలో కొనసాగిందన్నారు.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. మద్యపాన నిషేధం గతంలో అమలు చేయడం, ఆ తరువాత విఫలం చేయడం అప్పట్లో పెద్ద డ్రామా అని పేర్కొన్నారు. తమ పార్టీ కూడా దశలవారీగా మద్య నిషేధాన్ని మేనిఫెస్టోలో పెట్టిందని తెలిపారు. సదస్సుకు అధ్యక్షత వహించిన జన చైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ మద్యం వల్ల ఎదురయ్యే దుష్ఫలితాలను ప్రజలకు వివరించే దిశగా ప్రభుత్వాలు పనిచేయడం లేదన్నారు. ఎన్టీఆర్ హయాంలో 15 నెలలు మద్య నిషేధం అమలు కాగా, రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిశాయని అన్నారు. అలాంటి మద్య నిషేధాన్ని చంద్రబాబు ఎత్తివేయించారన్నారు. మద్య నిషేధం ఉన్నా గుజరాత్‌కు రూ.85 వేల కోట్ల ఆదాయం వస్తోందని, మన రాష్ట్రంలో ఎక్సైజ్ ఆదాయం పుష్కలంగా ఉన్నా.. మొత్తం ఆదాయం రూ.65 వేల కోట్లు మాత్రమేనని చెప్పారు. సదస్సులో విజ్ఞాన్ సంస్థల అధినేత లావు రత్తయ్య, మానసిక వైద్య నిపుణుడు ఇండ్ల రామసుబ్బారెడ్డి, జనచైతన్య వేదిక ఉపాధ్యక్షుడు విజయసారథి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment