
బార్ అండ్ నైట్‌క్లబ్‌ను ప్రారంభిస్తోన్న బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్, పక్కన గణేశుడి ప్రతిమ బహుకరణ.
లక్నో: ఆయన సర్వసంగ పరిత్యాగి. దేశంలోనే ప్రముఖ సాధువు చేత బార్‌ను ఓపెనింగ్ చేయించిన వ్యవహారం ఉత్తరప్రదేశ్ బీజేపీలో తీవ్ర కలకలం రేపుతున్నది. అత్యాచార ఘటనలతో ఇటీవల వార్తల్లో నిలిచిన ఉన్నావ్ స్థానం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న ఆ సాధువు మరెవరోకాదు.. సాక్షి మహారాజే! మతపరమైన అంశాల్లో పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఈ బీజేపీ ఎంపీ.. అనూహ్యరీతిలో సొంత పార్టీ నాయకులపైనే పోలీసులకు ఫిర్యాదుచేశారు.
అసలేం జరిగింది?: ఉత్తరప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్రనాథ్ పాండే మేనల్లుడు.. లక్నోలోని అలీగంజ్ ఏరియాలో ఓ బార్ అండ్ నైట్ క్లబ్‌ను నిర్మించాడు. ఆదివారం సాయంత్రం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉన్నావ్ ఎంపీ సాక్షి మహారాజ్‌ను ఆహ్వానించాడు. మర్యాదకొద్దీ వెళ్లిన ఆ సాధువు.. రిబ్బన్ కత్తిరించి, నిర్వాహకులు బహుకరించిన గణేశుడి ప్రతిమతో వెనుదిరిగాడు. సంబంధిత ఫొటోలు వైరల్ కావడంతో ‘సాధువు అయి ఉండి బార్‌ను ప్రారంభించడమేమిట’నే విమర్శలు వెల్లువెత్తాయి. మరుసటిరోజు(సోమవారం) స్థానిక పేపర్లలోనూ ఆ వార్త ప్రచురితమైంది.
అది బార్ అని తెలియక వెళ్లాను..: ఈ వ్యవహారంపై ఎంపీ సాక్షి మహారాజ్‌ను మీడియా వివరణ కోరగా ఆయన భిన్నంగా స్పందించారు. ‘‘అది బార్ అన్న సంగతి నాకు తెలియదు. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్రనాథ్ పాండే సూచన మేరకే ఆ కార్యక్రమానికి వెళ్లాను. అయినా సాధువునైన నాచేత ఆయన(పాడే) ఇలాంటి పని చేయింస్తాడని నేను ఊహించలేదు. తప్పుడు సమాచారంతో నన్ను మోసం చేశాడు. నా గౌరవానికి భంగం కలిగించిన ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశాను’’ అని ఎంపీ వివరించారు. ఇప్పటికే దళిత ఎంపీల తిరుగుబాట్లు, సీఎం యోగి పనితీరుపై సోంత పార్టీలోనే అసంతృప్తి తెత్తిన నేపథ్యంలో తాజాగా సాక్షి మహారాజ్ ఉదంతం యూపీ బీజేపీని కుదిపేస్తున్నది. బార్ ఓపెనింగ్ వివాదంపై పార్టీ అధిష్టానం స్పందించాల్సిఉంది.