
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తమ లోక్‌సభ ఎన్నికల కోసం మరో 12 మంది అభ్యర్థులను శుక్రవారం ప్రకటించింది. దీంతో ఆ పార్టీ ఇప్పటివరకు మొత్తం 305 లోక్‌సభ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించినట్లైంది. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన సినీ నటి ఊర్మిళ మతోంద్కర్‌ను ఉత్తర ముంబై స్థానం నుంచి ఆ పార్టీ బరిలోకి దింపింది. అక్కడి ప్రస్తుత ఎంపీ గోపాల్ శెట్టిని ఆమె ఎదుర్కోనున్నారు. శెట్టి 2014 ఎన్నికల్లో ఇదే స్థానంలో ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్‌ను ఓడించారు. 2004లో ఇదే సీటు నుంచి కాంగ్రెస్ బాలీవుడ్ నటుడు గోవిందను పోటీకి దింపింది. అప్పట్లో ఆయన బీజేపీ నేత, ప్రస్తుత ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్‌ను ఓడించి గెలుపొందారు. ముంబై వాయవ్య స్థానంలో నిరుపమ్‌ను, ముంబై ఉత్తర–మధ్య స్థానంలో ప్రియా దత్‌ను, ముంబై దక్షిణ స్థానంలో మిలింద్ దేవరాను, ముంబై దక్షిణ మధ్య స్థానంలో ఎకనాథ్ గైక్వాడ్‌ను కాంగ్రెస్ తమ అభ్యర్థులుగా ప్రకటించింది. 2014 ఎన్నికల్లో మహారాష్ట్ర మొత్తానికి 2 సీట్లే గెలిచిన కాంగ్రెస్ భవితవ్యం ఈ ఎన్నికల్లో ఎలా ఉంటుందో చూడాల్సిందే.
ససరాం నుంచి మీరాకుమార్
లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌ను బిహార్‌లోని ససరాం నుంచి కాంగ్రెస్ పోటీ చేయించనుంది. అదే రాష్ట్రంలోని సుపౌల్ స్థానంలో సిట్టింగ్ ఎంపీ రంజీత్ రంజన్‌కే మరోసారి అవకాశం ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజగంజ్ స్థానంలో తమ అభ్యర్థిని కాంగ్రెస్ మార్చింది. ఈ స్థానాన్ని తొలుత తనూశ్రీ త్రిపాఠికి కేటాయించగా, ఆమె తండ్రి అమర్మణి త్రిపాఠి జైల్లో ఉండగా ఆమెకు ఎలా టికెట్ ఇస్తారంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో మహారాజగంజ్‌లో తనూశ్రీకి బదులుగా సుప్రియా శ్రీనాథ్‌ను కాంగ్రెస్ బరిలోకి దింపింది.
Comments
Please login to add a commentAdd a comment