Urmila Matoandkar
-
ఆర్జీవీలోని విలక్షణతకు ఈ చిత్రం నిదర్శనం
ఆర్జీవీ.. రాం గోపాల్ వర్మ. సంచలనాలను, వివాదాలకు, అన్నింటికి మించి బోల్డ్‌కు కేరాఫ్. ఈ మధ్యకాలంలో వర్మ సినిమాల ఆడడం మాట ఏమోగానీ.. కెరీర్ తొలినాళ్లలో ఆయన ప్రదర్శించిన విలక్షణతను మరే దర్శకుడు కనబర్చలేదన్నది ఒప్పుకోవాల్సిన విషయం. అప్పటిదాకా మూస ధోరణితో సాగిపోతున్న కమర్షియల్ సినిమాకు సత్య అనే గ్యాంగ్‌స్టర్ అనే డ్రామాను అందించి బాలీవుడ్లో ఓ కొత్త ఒరవడిని సృష్టించడమే కాదు.. ఆ రియలిస్టిక్ సబ్జెక్టుతోనూ సంచలన విజయం అందుకున్నారాయన. 🎥 రియల్ ఇన్సిడెంట్స్ను బేస్ చేసుకుని వర్మ చేసిన తొలి గొప్ప ప్రయత్నంగా సత్యను అభివర్ణిస్తుంటారు చాలామంది సినీ క్రిటిక్స్. అప్పటికే పదిదాకా సినిమాలు తీసిన అనుభవం.. మంచి సక్సెస్ రేటు అందుకున్న ఘనత కూడా ఉంది. అయితే.. బాలీవుడ్‌కు పెద్దగా పరిచయం ఉండని కొత్త ముఖాలతోనే సినిమా తీయాలనుకున్న వర్మ.. జేడీ చక్రవర్తిని గా తీసుకున్నారు. ఉర్మిళ హీరోయిన్ కాగా.. మనోజ్ బాజ్‌పాయితో పాటు సౌరభ్ శుక్లా లాంటి మెథడ్ యాక్టర్లు ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. అలాగే సీఐడీ ఫేమ్ ఆదిత్యా శ్రీవాస్తవ, తెలుగు నటుడు బెనర్జీకి మంచి గుర్తింపు దక్కింది. 🎥 ఓ కంప్లీట్ యాక్షన్ సినిమా తీయాలనుకున్న వర్మ.. కొందరు రియల్ క్రిమినల్స్‌ను కలుసుకున్నాక తన ఆలోచన మార్చేసుకున్నారట. అలా వాస్తవ జీవితాల నుంచి పుట్టిందే సత్య కథ. అలాగని సత్య కథ అల్లింది వర్మ కాదు. అందులో కల్లుమామ పాత్రధారి సౌరభ్ శుక్లా, అనురాగ్ కశ్యప్‌లు రైటర్లు. అంతకు మించి.. పల్లెటూరి నుంచి ఉద్యోగం కోసం ముంబైకి వచ్చి.. అక్కడి నుంచి అండర్ వరల్డ్ ప్రపంచంలోకి అడుగుపెట్టి తన జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకునే సత్యది. 🎥 కోటి కలలతో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టే సత్యకు భీకూతో స్నేహం, విద్యతో ప్రేమ బంధం.. మాఫియా మేఘాలు అలుముకుని చివరకు విషాద ముగింపు తీసుకోవడం.. ఇలా చాలా రియల్స్టిక్గా వర్మ చూపించిన విధానాన్ని ఆడియొన్స్ ఆదరించారు. 🎥 వాస్తవానికి.. కొత్త వాళ్లతో సినిమా వర్మ అనౌన్స్ చేయగానే చాలామంది ఆశ్చర్యపోయారట. అందుకు తగ్గట్లే.. సినిమా షూటింగ్ మొదలైన మూడు రోజులకే కొన్ని కారణాల వలన ఆగిపోయిందట. నిజానికి ఈ సినిమాలో సాంగ్స్ లేకుండా ప్లాన్ చేశారు. కానీ డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిడి కారణంగా వర్మ, విశాల్ భరద్వాజ్, సందీప్ చౌతలతో(బ్యాక్‌గ్రౌండ్ స్కోర్) మ్యూజిక్ కంపోజ్ చేయించాడు. Video Credits: Mango Music 🎥 రెండున్నర కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం.. 1998 జులై 3వ తేదీన విడుదల అయ్యింది. ఐదు రెట్ల కలెక్షన్ల వసూలుతో భాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడంతో పాటు.. 1998లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల జాబితాలో నిలిచింది కూడా. 🎥 వర్మలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన సత్య.. ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు ఓ జాతీయ అవార్డును సైతం దక్కించుకుంది. మనోజ్ బాజ్పాయికి నేషనల్ అవార్డు దక్కింది. 🎥 మొత్తంగా వర్మ కెరీర్లో ఓ ప్రత్యేకమైన సినిమాగా.. కల్ట్ హోదాను దక్కించుకుని భారతీయ చలన చిత్ర రంగంలో గొప్ప చిత్రాల జాబితాలో ఒకటిగా నిలిచింది. 🎥 2008 ఆస్కార్ అవార్డు అందుకున్న స్లమ్‌డాగ్ మిలీయనీర్ చిత్రానికి సత్య ఒక స్ఫూర్తి. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు డానీ బోయల్ స్వయంగా చెప్పాడు. సత్య సినిమా షూటింగ్ మూడో రోజు విన్న ఒక వార్త బాధాకరంగా అనిపించింది. టీ సిరీస్ గుల్షన్ కుమార్‌ను కాల్చి చంపారనే వార్త. ఆ తర్వాత అండర్‌వరల్డ్‌పై సినిమా తీయొద్దంటూ మా మీద ఒత్తిడి పెరిగింది. ఆ పరిణామం ఒకవైపు ఇబ్బందికరంగా, మరోవైపు బాధగా అనిపించింది. కానీ, వర్మ అనుకున్నది ఓ పట్టాన వదిలే రకం కాదు. తనకు రైట్ అనిపిస్తే చేసేస్తాడంతే. అదే సమయంలో.. తాను అనుకున్నది అండర్‌వరల్డ్‌ను గొప్పగా చూపించడం కాదని వర్మ తేల్చేశాడు. ఇంకేం.. అలా మాఫియా ప్రపంచంలో ఉండే భావోద్వేగాల్ని ప్రధానంగా చేసుకుని కథ తెరకెక్కింది.. మంచి విజయం అందుకుంది: జేడీ చక్రవర్తి ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో.. -
ఊర్మిళపై కంగన ఘాటు వ్యాఖ్యలు.. ఆర్జీవీ ట్వీట్
ముంబై: డ్రామాలాడుతుందంటూ తనను విమర్శించిన నటి ఊర్మిళ మటోండ్కర్‌పై కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఊర్మిళను సాఫ్ట్ పోర్న్ స్టార్‌గా అభివర్ణించారు. ఓ నటిగా కంటే ఈవిధంగానే ఆమెకు గుర్తింపు వచ్చిందంటూ వివాదానికి తెరతీశారు. కాగా ముంబైపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కంగన.. తొలుత తన స్వస్థలం హిమాచల్‌ప్రదేశ్ మాదకద్రవ్యాలకు మూలం అన్న సంగతి తెలుసుకోవాలంటూ ఊర్మిళ హితవు పలికిన సంగతి తెలిసిందే. పెద్దగా నోరేసుకొని మాట్లాడినంత మాత్రాన కంగన మాట్లాడేవన్నీ నిజాలు అయిపోవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగరికత తెలిసిన అమ్మాయి ఎవరూ ఇలా మాట్లాడరంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది.( చదవండి: గట్టిగా అరిస్తే అన్నీనిజాలు అయిపోతాయా ?) ఇక ఈ విషయంపై స్పందించిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. ఊర్మిళకు మద్దతుగా నిలిచారు. మాటల్లో తాను ఎవరితో పోటీపడలేనని, అయితే ఊర్మిళ విలక్షణమైన నటిగా తనను తాను నిరూపించుకున్నారన్నారు. రంగీలా, సత్య, కౌన్, భూత్, ఏక్ హసీనా థీ తదితర సినిమాల్లో సంక్లిష్ట పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారంటూ ట్విటర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. (చదవండి: ‘ఐటెమ్ సాంగ్ ఛాన్స్ రావాలంటే అలా చేయాలసిందే’) కాగా ఆర్జీవీ దర్శకత్వంలో తెరకెక్కిన రంగీలా సినిమాతో ఊర్మిళ స్టార్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలు చిత్రాల్లో రామ్‌గోపాల్ వర్మ హీరోయిన్గా ఆమెకు అవకాశం ఇచ్చారు. అంతేగాక తన పుస్తకం ‘గన్స్ అండ్ థైస్’లో ఊర్మిళ అందాన్ని వర్ణిస్తూ ఆమె ఓ అద్భుతమని పేర్కొన్నారు. ఇక ఊర్మిళపై కంగన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో.. ఊర్మిళ నన్ను వ్యభిచారి అన్నపుడు మీరంతా ఎక్కడికి వెళ్లారు. ఫెమినిజం అంటే ఇదేనా అంటూ మరోసారి విరుచుకుపడ్డారు. -
నార్త్ ముంబై నుంచి ఊర్మిళ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తమ లోక్‌సభ ఎన్నికల కోసం మరో 12 మంది అభ్యర్థులను శుక్రవారం ప్రకటించింది. దీంతో ఆ పార్టీ ఇప్పటివరకు మొత్తం 305 లోక్‌సభ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించినట్లైంది. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన సినీ నటి ఊర్మిళ మతోంద్కర్‌ను ఉత్తర ముంబై స్థానం నుంచి ఆ పార్టీ బరిలోకి దింపింది. అక్కడి ప్రస్తుత ఎంపీ గోపాల్ శెట్టిని ఆమె ఎదుర్కోనున్నారు. శెట్టి 2014 ఎన్నికల్లో ఇదే స్థానంలో ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్‌ను ఓడించారు. 2004లో ఇదే సీటు నుంచి కాంగ్రెస్ బాలీవుడ్ నటుడు గోవిందను పోటీకి దింపింది. అప్పట్లో ఆయన బీజేపీ నేత, ప్రస్తుత ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్‌ను ఓడించి గెలుపొందారు. ముంబై వాయవ్య స్థానంలో నిరుపమ్‌ను, ముంబై ఉత్తర–మధ్య స్థానంలో ప్రియా దత్‌ను, ముంబై దక్షిణ స్థానంలో మిలింద్ దేవరాను, ముంబై దక్షిణ మధ్య స్థానంలో ఎకనాథ్ గైక్వాడ్‌ను కాంగ్రెస్ తమ అభ్యర్థులుగా ప్రకటించింది. 2014 ఎన్నికల్లో మహారాష్ట్ర మొత్తానికి 2 సీట్లే గెలిచిన కాంగ్రెస్ భవితవ్యం ఈ ఎన్నికల్లో ఎలా ఉంటుందో చూడాల్సిందే. ససరాం నుంచి మీరాకుమార్ లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌ను బిహార్‌లోని ససరాం నుంచి కాంగ్రెస్ పోటీ చేయించనుంది. అదే రాష్ట్రంలోని సుపౌల్ స్థానంలో సిట్టింగ్ ఎంపీ రంజీత్ రంజన్‌కే మరోసారి అవకాశం ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజగంజ్ స్థానంలో తమ అభ్యర్థిని కాంగ్రెస్ మార్చింది. ఈ స్థానాన్ని తొలుత తనూశ్రీ త్రిపాఠికి కేటాయించగా, ఆమె తండ్రి అమర్మణి త్రిపాఠి జైల్లో ఉండగా ఆమెకు ఎలా టికెట్ ఇస్తారంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో మహారాజగంజ్‌లో తనూశ్రీకి బదులుగా సుప్రియా శ్రీనాథ్‌ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. -
నటి ఊర్మిళ పోటీపై వీడిన సస్పెన్స్
సాక్షి, ముంబై : అందరూ ఊహించినట్టుగానే బాలీవుడ్నటి ఊర్మిళ మటోండ్కర్ (45) లోక్‌సభ ఎన్నికల బరిలోనిలిచారు. ముంబై నార్త్ లోక్‌సభ అభ్యర్థిగా ఊర్మిళను బరిలో నిలపాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ మేరకు సీఈసీ జనరల్ సెక్రటరీ ఇన్చార్జి ముకుల్ వాస్నిక్ అధికారిక ప్రకటన జారీ చేశారు. పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ పార్టీ అభ్యర్థిగా ఊర్మిళ అభ్యర్థిత్వాన్ని ఆమోదించిందని వెల్లడించారు. తద్వారా కాంగ్రెస్‌కు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ స్థానంలో మరోసారి బాలీవుడ్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఈ బుధవారం పార్టీలో చేరిన ఊర్మిళ అపుడే మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రధాని వ్యక్తిగతంగా మంచి వ్యక్తేనని..కానీ ప్రధానిగా ఆయన అనుసరిస్తున్న విధానాలే మంచివి కావని అన్నారు. ప్రజాస్వామ్యదేశంలో ప్రజలు ఏం తినాలో, ఏం మాట్లాడాలో నిర్ణయించుకునే హక్కును మోదీ కాలరాశారని విమర్శించిన సంగతి తెలిసిందే. కాగా బాల నటిగా మరాఠీ చిత్రంతో సినిమా రంగంలోకి ప్రవేశించిన ఊర్మిళ మటోండ్కర్ హీరోయిన్గా పలు బాలీవుడ్ చిత్రాలతో పాటు మరాఠీ, దక్షిణాది చిత్రాల్లోనూ నటించారు. పార్టీలో చేరిన రెండు రోజుల్లోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఒక విశేషమైతే బీజేపీకి కంచుకోటలాంటి ముంబై నార్త్ నియోజవర్గంలో బరిలోకి దిగడం మరో విశేషం. -
నా పుస్తకం ఊర్మిళకు అంకితం: వర్మ
హైదరాబాద్: తన ఆత్మకథ 'గన్స్ అండ్ థైస్: ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ ట్యాగ్‌లైన్' పుస్తకాన్ని పలువురికి అంకితం చేస్తున్నట్టు దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలిపారు. అయాన్ రాండ్, బ్రూస్ లీ, ఊర్మిళా మండోద్కర్, అమితాబ్ బచ్చన్, పోర్న్ స్టార్ టోరి బ్లాక్, మరికొందరు గ్యాంగస్టర్లకు అంకితం ఇస్తున్నట్టు ట్విటర్ ద్వారా వెల్లడించారు. తాను జీవితంలో పైకి రావడానికి ప్రత్యేక్షంగా, పరోక్షంగా వీరంతా తోడ్పడ్డారని తెలిపారు. రూపా పబ్లికేషన్స్ ప్రచురించిన ఈ పుస్తకాన్ని డిసెంబర్ లో మార్కెట్ లోకి విడుదల చేయన్నారు. పుస్తకం కవర్ పేజీని ఇటీవలే ఆయన ట్విటర్ లో పోస్ట్ చేశారు. తాను అమితాబ్ బచ్చన్ ను ఇడియట్ అన్న విషయం, తన సినీ జీవితంలో తనకు అండర్ వరల్డ్ తో, మహిళలతో ఉన్న సంబంధాల గురించి ఈ పుస్తకంలో పొందుపరిచినట్టు వర్మ వెల్లడించారు. దీంతో ఆయన అభిమానులు ఈ పుస్తకం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.