ఆర్జీవీ.. రాం గోపాల్ వర్మ. సంచలనాలను, వివాదాలకు, అన్నింటికి మించి బోల్డ్‌కు కేరాఫ్. ఈ మధ్యకాలంలో వర్మ సినిమాల ఆడడం మాట ఏమోగానీ.. కెరీర్ తొలినాళ్లలో ఆయన ప్రదర్శించిన విలక్షణతను మరే దర్శకుడు కనబర్చలేదన్నది ఒప్పుకోవాల్సిన విషయం. అప్పటిదాకా మూస ధోరణితో సాగిపోతున్న కమర్షియల్ సినిమాకు సత్య అనే గ్యాంగ్‌స్టర్ అనే డ్రామాను అందించి బాలీవుడ్‌లో ఓ కొత్త ఒరవడిని సృష్టించడమే కాదు.. ఆ రియలిస్టిక్ సబ్జెక్టుతోనూ సంచలన విజయం అందుకున్నారాయన.
🎥 రియల్ ఇన్సిడెంట్స్‌ను బేస్ చేసుకుని వర్మ చేసిన తొలి గొప్ప ప్రయత్నంగా సత్యను అభివర్ణిస్తుంటారు చాలామంది సినీ క్రిటిక్స్. అప్పటికే పదిదాకా సినిమాలు తీసిన అనుభవం.. మంచి సక్సెస్ రేటు అందుకున్న ఘనత కూడా ఉంది. అయితే.. బాలీవుడ్‌కు పెద్దగా పరిచయం ఉండని కొత్త ముఖాలతోనే సినిమా తీయాలనుకున్న వర్మ.. జేడీ చక్రవర్తిని గా తీసుకున్నారు. ఉర్మిళ హీరోయిన్ కాగా.. మనోజ్ బాజ్‌పాయితో పాటు సౌరభ్ శుక్లా లాంటి మెథడ్ యాక్టర్లు ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. అలాగే సీఐడీ ఫేమ్ ఆదిత్యా శ్రీవాస్తవ, తెలుగు నటుడు బెనర్జీకి మంచి గుర్తింపు దక్కింది.
🎥 ఓ కంప్లీట్ యాక్షన్ సినిమా తీయాలనుకున్న వర్మ.. కొందరు రియల్ క్రిమినల్స్‌ను కలుసుకున్నాక తన ఆలోచన మార్చేసుకున్నారట. అలా వాస్తవ జీవితాల నుంచి పుట్టిందే సత్య కథ. అలాగని సత్య కథ అల్లింది వర్మ కాదు. అందులో కల్లుమామ పాత్రధారి సౌరభ్ శుక్లా, అనురాగ్ కశ్యప్‌లు రైటర్లు. అంతకు మించి.. పల్లెటూరి నుంచి ఉద్యోగం కోసం ముంబైకి వచ్చి.. అక్కడి నుంచి అండర్ వరల్డ్ ప్రపంచంలోకి అడుగుపెట్టి తన జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకునే సత్యది.
🎥 కోటి కలలతో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టే సత్యకు భీకూతో స్నేహం, విద్యతో ప్రేమ బంధం.. మాఫియా మేఘాలు అలుముకుని చివరకు విషాద ముగింపు తీసుకోవడం.. ఇలా చాలా రియల్‌స్టిక్‌గా వర్మ చూపించిన విధానాన్ని ఆడియొన్స్ ఆదరించారు.
🎥 వాస్తవానికి.. కొత్త వాళ్లతో సినిమా వర్మ అనౌన్స్ చేయగానే చాలామంది ఆశ్చర్యపోయారట. అందుకు తగ్గట్లే.. సినిమా షూటింగ్ మొదలైన మూడు రోజులకే కొన్ని కారణాల వలన ఆగిపోయిందట. నిజానికి ఈ సినిమాలో సాంగ్స్ లేకుండా ప్లాన్ చేశారు. కానీ డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిడి కారణంగా వర్మ, విశాల్ భరద్వాజ్, సందీప్ చౌతలతో(బ్యాక్‌గ్రౌండ్ స్కోర్) మ్యూజిక్ కంపోజ్ చేయించాడు.
Video Credits: Mango Music
🎥 రెండున్నర కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం.. 1998 జులై 3వ తేదీన విడుదల అయ్యింది. ఐదు రెట్ల కలెక్షన్ల వసూలుతో భాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడంతో పాటు.. 1998లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల జాబితాలో నిలిచింది కూడా.
🎥 వర్మలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన సత్య.. ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు ఓ జాతీయ అవార్డును సైతం దక్కించుకుంది. మనోజ్ బాజ్‌పాయికి నేషనల్ అవార్డు దక్కింది.
🎥 మొత్తంగా వర్మ కెరీర్‌లో ఓ ప్రత్యేకమైన సినిమాగా.. కల్ట్ హోదాను దక్కించుకుని భారతీయ చలన చిత్ర రంగంలో గొప్ప చిత్రాల జాబితాలో ఒకటిగా నిలిచింది.
🎥 2008 ఆస్కార్ అవార్డు అందుకున్న స్లమ్‌డాగ్ మిలీయనీర్ చిత్రానికి సత్య ఒక స్ఫూర్తి. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు డానీ బోయల్ స్వయంగా చెప్పాడు.
సత్య సినిమా షూటింగ్ మూడో రోజు విన్న ఒక వార్త బాధాకరంగా అనిపించింది. టీ సిరీస్ గుల్షన్ కుమార్‌ను కాల్చి చంపారనే వార్త. ఆ తర్వాత అండర్‌వరల్డ్‌పై సినిమా తీయొద్దంటూ మా మీద ఒత్తిడి పెరిగింది. ఆ పరిణామం ఒకవైపు ఇబ్బందికరంగా, మరోవైపు బాధగా అనిపించింది. కానీ, వర్మ అనుకున్నది ఓ పట్టాన వదిలే రకం కాదు. తనకు రైట్ అనిపిస్తే చేసేస్తాడంతే. అదే సమయంలో.. తాను అనుకున్నది అండర్‌వరల్డ్‌ను గొప్పగా చూపించడం కాదని వర్మ తేల్చేశాడు. ఇంకేం.. అలా మాఫియా ప్రపంచంలో ఉండే భావోద్వేగాల్ని ప్రధానంగా చేసుకుని కథ తెరకెక్కింది.. మంచి విజయం అందుకుంది: జేడీ చక్రవర్తి ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో..
Comments
Please login to add a commentAdd a comment