పాలమూరు వర్సిటీ విద్యార్థి సంఘం నేత విజ్ఞేశ్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేని ఫెస్టోలోని అంశాలతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల లాగులు తడుస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఘాటుగా విమర్శించారు. కాం గ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోను అమలు చేసేందుకు దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్ సరిపోదన్న తండ్రీకొడుకులు ఇప్పుడు అదే మేనిఫెస్టోను కాపీ కొట్టేందుకు సిగ్గులేదా? అని ధ్వజమెత్తారు. తాము ప్రకటించిన నిరుద్యోగభృతికి రూ.16 పెంచి ప్రకటించడానికి సిగ్గూ, శరమూ ఉండాలని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
నాలుగేళ్లు అధికారంలో ఉండి నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో పాలమూరు యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత విజ్ఞేశ్ నాయక్ సహా మరికొన్ని వర్సిటీల నేతలు ఉత్తమ్ సమక్షంలో కాం గ్రెస్‌లో చేరారు. డిసెంబర్ 12న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని, ఆ తర్వాత కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితం అవుతారని ఉత్తమ్ అన్నారు.
ప్రైవేటు యూనివర్సిటీలను రానివ్వం..
తెలంగాణ ఏర్పడే నాటికి ప్రభుత్వంలో ఎన్ని ఖాళీలున్నాయో, ఈనాటికీ అన్నే ఖాళీలున్నాయని ఉత్తమ్ అన్నారు. ఒక్క పోస్టునూ భర్తీ చేయని ఈ సీఎంను సన్నాసి అనాలా, దద్దమ్మ అనాలా? అని ప్రశ్నిం చారు. మహాకూటమి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే లక్ష ఉద్యోగాలిస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. ఇందులో 20 వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు.
ప్రైవేటు యూనివర్శిటీలను రాష్ట్రంలోకి రానివ్వబోమని, ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, తెలం గాణ యూనివర్సిటీలను బలోపేతం చేస్తామన్నారు. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నీంటినీ భర్తీ చేస్తామన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఖాజీపేటకు రైల్వేకోచ్, బయ్యారం స్టీలు ప్లాంటు, ఐటీఐఆర్ రావడం ఖాయమన్నారు. వీహెచ్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణను మోసం చేశాయని, బీజేపీ, టీఆర్‌ఎస్‌లను గద్దె దించడం చారిత్రక అవసరమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment