ఢిల్లీలో భూపతిరెడ్డి, గణేశ్‌లకు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్. చిత్రంలో ఉత్తమ్
సాక్షి, న్యూఢిల్లీ, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఎండగట్టాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబపాలన, సాగు, తాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన విచ్చలవిడి అవినీతిని క్షేత్రస్థాయిలో విస్తృతంగా తీసుకెళ్లాలని ఉద్బోధించారు. ఎన్నికల మేనిఫెస్టో అమల్లో టీఆర్‌ఎస్ వైఫల్యాలను ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేలా నేతలంతా ఐక్యంగా కృషి చేయాలని ఆదే శించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాహుల్‌గాంధీ శుక్రవారం ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యులతో సుదీర్ఘ మంతనాలు జరిపారు.
దాదాపు 3 గంటలపాటు జరిగిన ఈ ‘వార్‌రూమ్’ భేటీలో అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహం, పొత్తులు, సీట్ల సర్దుబాటు, వివిధ కమిటీల నియామకం, పార్టీ మేనిఫెస్టో అంశాలపై చర్చించి పలు అంశాలపై నేత లకు కీలక సూచనలు చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, సీనియర్లు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ, మర్రి శశిధర్‌రెడ్డి, గీతారెడ్డి, రేవంత్‌రెడ్డి, పద్మావతిరెడ్డి, పొన్నం ప్రభాకర్, వి.హనుమంతరావు, సునీతాలక్ష్మారెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్, ఆకుల లలిత, భిక్షమయ్యగౌడ్ సహా మొత్తం 38 మంది పాల్గొన్నారు. రాహుల్ ఒక్కో నేతతో విడిగా 5 నిమిషాల చొప్పున చర్చించా రు. అనంతరం అందరితో ఉమ్మడిగా మాట్లాడారు.
నలుగురి చేతిలో తెలంగాణ బందీ...
ప్రస్తుత ఎన్నికలు పార్టీకి కీలకమైనందున గెలుపే లక్ష్యంగా పనిచేయాలని రాహుల్ నేతలకు సూచించారు. ఏ లక్ష్యాల కోసం తెలంగాణ ఏర్పాటు జరిగిందో ఆ దిశగా పాలన జరగలేదని పేర్కొన్నారు. ముఖ్యంగా పాలనంతా కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిందని, దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులనే కేసీఆర్ ప్రభుత్వం రీ డిజైనింగ్ పేరిట అంచనా వ్యయాలను పెంచి విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతోందని, కొన్ని ప్రాజెక్టుల అవినీతికి సంబంధించిన సమాచారం తన వద్ద ఉందన్నారు.
మిషన్ భగీరథలోనూ రూ. కోట్లలో అవినీతి జరిగినట్లు చాలామంది తన దృష్టికి తెచ్చారని, కొందరు నేతలు సంబంధిత పత్రాలు సమర్పించారని రాహుల్ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ అవినీతిని ప్రధాన ఎన్నికల నినాదంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. టీఆర్‌ఎస్ ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేకపోయిందని, ముఖ్యంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, కేజీ టు పీజీ విద్య, దళితులకు మూడెకరాల భూపంపిణీ వంటి అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు.
గెలిచే స్థానాలు వదలొద్దు...
ఈ ఎన్నికల్లో సిట్టింగ్‌లకు టికెట్లు వస్తాయని సమావేశంలో రాహుల్ స్పష్టం చేశారు. పార్టీలో మంచిపేరున్న ఎమ్మెల్యేలకు అదే నియోజకవర్గంలో టికెట్లు ఇస్తామన్నారు. పార్టీ ఎక్కడ బలహీనంగా ఉందో, ఆ స్థానాలను గుర్తించి మహాకూటమి సభ్యులకు కేటాయించాలని సూచించారు.
పార్టీ నేతలు, కేడర్ బలం గా ఉండి, గెలిచే అవకాశం ఉన్న స్థానాలను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోరాదని, మిగతా స్థానాల్లో పార్టీకి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ నేతలు ఐక్యంగా కొట్లాడితే పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. కర్మ సిద్ధాంతాన్ని రాహుల్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పుడు బేషుగ్గా పనిచేసిన వారికే పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం పదవులు దక్కుతాయని స్పష్టం చేశారు.
పొత్తులపై రాహుల్ వద్ద భిన్నస్వరాలు ...
అంతకుముందు రాహుల్‌తో విడివిడిగా జరిగిన భేటీలో కాంగ్రెస్ నేతలు టీడీపీతో పొత్తు అంశమై భిన్నస్వరాలు వినిపించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన నేతలు కొందరు పొత్తును సమర్థించగా మరికొందరు మాత్రం బద్ధ విరోధి, ఆంధ్రా పార్టీ అయిన టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళ్తోందని పేర్కొన్నారు. టీడీపీతో పొత్తు ఇబ్బందికర పరిణామమేనని, దీనివల్ల పెద్దగా ఒనగూరే ప్రయోజనమేమీ లేదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. మెజారిటీ స్థానాలు గెలిచే సత్తా కాంగ్రెస్‌కే ఉందని, అలాంటప్పుడు పొత్తుల అవసరం ఉండదని అభిప్రాయపడ్డారు. డి.కె. అరుణ సైతం దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
మహబూబ్‌నగర్ వంటి పెద్ద జిల్లాలో 30 ఏళ్లుగా టీడీపీతో కాంగ్రెస్ కొట్లాడిందని, ప్రస్తుత పొత్తుతో టీడీపీ ఓట్లు కాంగ్రెస్‌కు బదిలీ కావడం అంత సులభం కాదని రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ బలంగా ఉన్న స్థానాలను ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీకి వదిలేయరాదని, టీడీపీకి అనుకూలంగా ఉన్న స్థానాల్లోనే వారికి సీట్లు ఇవ్వాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగానే మునుగోడు అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధమవుతున్నట్టు రాహుల్‌కు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలపగా అందుకు ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. టికెట్ల కేటాయింపులో బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కొందరు కోరగా మరికొందరేమో పార్టీ నేతల మధ్య సమన్వయం చేయాలని సూచించారు.
కాంగ్రెస్‌లో చేరిన భూపతిరెడ్డి, బండ్ల గణేశ్
సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్సీ, నిజామాబాద్ టీఆర్‌ఎస్ నేత భూపతిరెడ్డి, సినీ నిర్మాత బండ్ల గణేశ్ కాంగ్రెస్‌లో చేరారు. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి ఆర్సీ కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల ఆధ్వర్యంలో పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారికి సూచించారు.
భూపతిరెడ్డి మాట్లాడుతూ గత నాలుగున్నరేళ్ల పాలనలో తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చడంలో టీఆర్‌ఎస్ పూర్తిగా విఫలమైందని, నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణ కల సాకారం కాలేదని విమర్శించారు. నాలుగున్నరేళ్ల కాలంలో తెలంగాణలో నిధులు దుర్వినియోగం అయ్యాయని, యువతకు ఉపాధి లేదని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ ద్వారానే తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయని, అందుకే కాంగ్రెస్‌లో చేరిరానని తెలిపారు.
నిజామాబాద్ నుంచి టీఆర్‌ఎస్ టికెట్ రాకపోవడం వల్లే పార్టీ మారానన్న వార్తల్లో నిజం లేదని, 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ టికెట్ ఇవ్వకపోయినా పార్టీ అభ్యర్థి విజయం కోసం కృషి చేశానని గుర్తు చేశారు. తనకు పదవులు లెక్కకాదని, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు పని చేస్తానని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకొస్తామని, పార్టీ ఆదేశిస్తే నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేస్తానని తెలిపారు. దేశం కోసం కాంగ్రెస్ ఎన్నో త్యాగాలు చేసిందని, పవన్ కల్యాణ్ తన గురువైనా చిన్న ప్పటి నుంచి కాంగ్రెస్ అభిమాని కావడంతోనే పార్టీలో చేరినట్లు గణేశ్ తెలిపారు. అధిష్టానం ఆదేశిస్తే జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తానని, ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని వివరించారు.
రచ్చకెక్కితే తీవ్ర పరిణామాలు
పార్టీ నేతలపై ఎవరూ రచ్చకెక్కి బహిరంగ విమర్శలు చేయరాదని, సమస్యలుంటే పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవాలని, పీసీసీ చీఫ్ లేదా పార్టీ ఇన్‌చార్జి దృష్టికి తీసుకెళ్లాలని రాహుల్ సూచించారు. ఒకవేళ పరిష్కారం కాని వివాదాలుంటే తన దృష్టికి తేవొచ్చన్నారు. మీడియా ముందు బహిరంగంగా మాట్లాడితే ఎంతటి వారైనా తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. తెలంగాణలో పార్టీ బలంగా ఉందని, ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు బలంగా ఉన్నాయని ఇప్పటికే తనకు సర్వే నివేదికలు అందాయని తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో 10 బహిరంగ సభల్లో పాల్గొనాల్సిందిగా రాహుల్‌ను నేతలు కోరారు. సోనియా గాంధీ సైతం ప్రచారానికి హాజరైతే తెలంగాణ ఇచ్చారనే సెంటిమెంట్ ప్రజల్లో కలుగుతుందని, తద్వారా పార్టీకి మేలు జరుగుతుందని వివరించారు. తమ అభ్యర్థనకు రాహుల్ అంగీకరించినట్లు భేటీ అనంతరం నేతలు తెలిపారు. హైదరాబాద్‌లో జరిగే భారీ బహిరంగ సభకు సోనియా హాజరవుతారని చెప్పినట్లుగా వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment