సాక్షి, కామారెడ్డి: ఎన్ని వందల కోట్లు ఖర్చైనా నిజాం షుగన్ ఫ్యాక్టరీని తెరిపించి తీరుతామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. కామారెడ్డిలో రాహుల్ గాంధీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రజా గర్జనలో పాల్గొన్న ఉత్తమ్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. నాలుగున్నరేళ్లలో అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబం దోచుకుని, దాచుకుంటుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీ కోసం ఎదురు చూస్తోందన్నారు. డిసెంబర్ 12న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని, అదేవిదంగా నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది సీట్లు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డి సభలో ఉత్తమ్ ప్రజలపై వరాల జల్లు కురిపించారు.
కామారెడ్డి ప్రజాగర్జనలో ఉత్తమ్ ప్రకటించిన హామీలు
- రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ
- గల్ఫ్ బాధితుల కోసం ఏడాదికి బడ్జెట్‌లో 500 కోట్లు కేటాయింపు
- ఉన్నత స్థాయి కమిటీ వేసి బీడీ కార్మికులకు పని కల్పించేందుకు కృషి
- అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే లక్ష ఉద్యోగాలు కల్పన
- నిరుద్యోగ భృతి మూడు వేలు, వృద్దులు, వితంతువులకు రెండు వేల పెన్షన్, వికలాంగులకు మూడు వేల పెన్షన్
- పేదలందరికీ ఏడు కిలోల రేషన్ బియ్యంతో పాటు 9 రకాల నిత్యావసర వస్తువులు
- దళితులకు, గిరిజనులకు ఉచితంగా రేషన్ బియ్యం, 9 రకాల నిత్యావసర వస్తువులు
- దళితులకు, గిరిజనులకు ఇళ్ల అవసరానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
- వరి, మొక్క జొన్నలకు మద్దతు ధర రెండు వేలు, పత్తికి ఏడు వేలు తక్కువ కాకుండా, పసుపు పంటకు పది వేలు తక్కువ కాకుండా మద్దతు ధర
Comments
Please login to add a commentAdd a comment