కేసీఆర్‌ను తరిమి కొడితేనే బతుకు! | Uttamkumar Reddy fires on TRS Govt at Private educational institutions meet | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ను తరిమి కొడితేనే బతుకు!

Published Sun, Sep 30 2018 1:50 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Uttamkumar Reddy fires on TRS Govt at Private educational institutions meet - Sakshi

శనివారం రంగారెడ్డి జిల్లా ఔటర్‌రింగ్‌రోడ్డు సమీపంలో ప్రైవేట్‌ విద్యాసంస్థల జేఏసీ ఏర్పాటు చేసిన ఆత్మగౌరవ సభలో పాల్గొన్న అఖిలపక్ష నేతలు

సాక్షి, హైదరాబాద్‌: ‘తెలంగాణ ప్రజలు నమ్మి అధికారాన్ని కట్టబెడితే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నాలుగున్నరేళ్లకే చేతులెత్తేశాడు. పరిపాలన చేత కాకపోవడంతో నమ్మిన ప్రజలను నట్టేట ముంచాడు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కంకణం కట్టుకున్నాడు. కానీ తెలంగాణ బిడ్డలు ఆయన మాటలు నమ్మే స్థితిలో లేరు. కుటుంబమంతా రాష్ట్రం మీద పడి దోచుకుంది. ప్రశ్నించిన గొంతును అణచివేసింది. అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేయడంతో పాటు అన్ని వర్గాల ప్రజలను అణగదొక్కేశారు. ఇంతటి ఘనకార్యం చేసిన కేసీఆర్‌ కుటుంబానికి ఓటు వేస్తే ఈసారి బతకడమే కష్టంగా మారుతుంది’అని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వాఖ్యానించారు. శనివారం రంగారెడ్డి జిల్లా గౌరెల్లి సమీపంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో ప్రైవేటు విద్యా సంస్థల ఐక్య కార్యాచరణ సమితి ఏర్పాటు చేసిన అత్మగౌరవ సభకు ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు.

అఖిల పక్ష పార్టీ అధ్యక్షులు, ప్రతినిధులు హాజరైన ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టారు. ‘అభివృద్ధిలో కీలకమైన విద్యావ్యవస్థను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. ప్రభుత్వ వ్యవస్థను నాశనం చేసి ప్రైవేటు విద్యాసంస్థల మీద పడ్డాడు. కార్పొరేట్‌ సంస్థలకు తొత్తుగా మారి చిన్నపాటి ప్రైవేట్‌ సంస్థలను అణచివేశాడు. విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలని కోరుతూ మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్‌తో చర్చలకు వెళ్తే... కనీస మర్యాద లేకుండా అడ్డగోలుగా మాట్లాడాడు. నాలుగున్నరేళ్ల దుర్మార్గపు పాలన నుంచి ప్రజలు విముక్తులయ్యారు. ఇక మళ్లీ ఆ కుటుంబం వద్దు. వచ్చే 2 నెలల పాటు ప్రజలతో మమేకమై టీఆర్‌ఎస్‌ పాలన వైఫల్యాలను వివరించండి. ఎన్నికల వరకు అప్రమత్తంగా ఉంటేనే తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయి. లేకుంటే ప్రాణాలతో బతకడమే కష్టమవుతుంది.’అంటూ ఆవేశపూరితంగా మాట్లాడారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో దాదాపు 4 లక్షల మంది సిబ్బంది ఉన్నారని, ఒక్కొక్కరు సైనికుల్లా పనిచేసి చైతన్యపర్చాలని పిలుపునిచ్చారు. 

మేము అధికారంలోకి వస్తే... 
రాష్ట్రంలో కాంగ్రెస్‌ భాగస్వామ్య ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రైవేటు విద్యా వ్యవస్థను గాడిలో పెడతామని ఉత్తమ్‌ హామీ ఇచ్చారు. పోస్టుమెట్రిక్‌ విద్యార్థులకు ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అదే ఏడాదిలో రెండు విడతల్లో నిధులు విడుదల చేస్తామన్నారు. కార్పొరేట్‌ విద్యాసంస్థలను కట్టడి చేస్తామని, ఫీజులను నియంత్రించి నిర్దేశిస్తామన్నారు. నాన్‌ కార్పొరేట్‌ విద్యాసంస్థల విద్యుత్‌ బిల్లులు డొమెస్టిక్‌ కేటగిరీలోకి మారుస్తామని, భవనాల అద్దెను సైతం డొమెస్టిక్‌ విధానంలోకి మారుస్తామన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి ఆరోగ్య కార్డులు, ఏటా రూ.5 లక్షలతో కూడిన ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంలో మార్పులు చేస్తామన్నారు.  

కల్వకుంట్ల కంపును ఇక భరించొద్దు... 
రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబానికి ప్రజలు చరమగీతం పాడాలని ఏఐసీసీ కార్యదర్శి మధుయాస్కీ గౌడ్‌ పేర్కొన్నారు. నాలుగున్నరేళ్లుగా ఇబ్బంది పడ్డ ప్రజలకు ఇక ఉపశమనం దక్కిందని, ఇక ఆ కంపును భరించాల్సిన పని లేదన్నారు. రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డిలను అనవసర కేసుల్లో ఇరికిస్తున్నారన్నారు. పౌరహక్కుల నేత వరవరరావును, కోదండరామ్‌ అక్రమ అరెస్టులను రాష్ట్ర ప్రజలంతా చూశారన్నారు. కేసీఆర్‌కు తగిన బుద్ది చెప్పాలన్నారు. 

మెరుగైన విద్యకు మార్గం వేస్తాం.... 
టీఆర్‌ఎస్‌ పాలనలో విద్యావ్యవస్థ నాశనమైందని, దీన్ని తిరిగి పునర్‌నిర్మించాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ అన్నారు. అందుకు మహాకూటమికి మద్దతు పలకాలని, ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ 12 డిమాండ్లను పరిష్కరిస్తామన్నారు. తెలంగాణ సాధనలో మహా కూటమి కీలకంగా వ్యవహరించిందని, ఇప్పుడు టీఆర్‌ఎస్‌ నుంచి రక్షించేందుకు మరోమారు ఉద్యమిస్తోందన్నారు. 

నిజాంను మించిపోయిన కేసీఆర్‌... 
రాష్ట్రంలో తొలిసారి ఏర్పాటైన ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని అందరూ భావించారని, కానీ అందుకు భిన్నంగా నిజాంను మించిన నిరంకుశ పాలనకు కేసీఆర్‌ నాంది పలికారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఇలాంటి పాలనను ప్రజలు కోరుకోవడం లేదన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో తెలంగాణ ప్రజలు ముందస్తుగా విముక్తులయ్యారని, ఇక కేసీఆర్‌కు అవకాశం ఇవ్వద్దన్నారు. కరీంనగర్‌ జిల్లాలో కేసీఆర్‌ ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నారని, అక్కడి ప్రాథమిక పాఠశాలలో ఆరు పోస్టులుంటే ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని విద్యావలంటీర్లతో నెట్టుకొస్తున్నారన్నారు. సీఎం దత్తత తీసుకున్న ఊర్లో పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే రాష్ట్రంలో పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. 

తెలంగాణ ద్రోహులంతా కేసీఆర్‌కు దోస్తులయ్యారు
రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వాళ్లంతా కేసీఆర్‌కు దోస్తులయ్యారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆందోళన చేపట్టిన విద్యార్థులపై రాళ్లు రువ్వి, కర్రలతో దాడులు చేసిన వారంతా ఇప్పుడు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంత్రులయ్యారన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు మాత్రమే అవకాశం ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేసిన వాళ్లంతా అణచివేతకు గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగాలనుకుంటే రజాకార్లను తలపించేలా గడీల పాలన వచ్చిందని, దీన్ని ప్రజలు సహించడం లేదన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వానికి విన్నవించేలా ఉన్న ధర్నాచౌక్‌ను ఎత్తేశాడని, హైదరాబాద్‌కు అవతల ఔటర్‌ రింగురోడ్డు ఎగ్జిట్‌ల వద్ద ఇలా సమావేశాలు పెట్టుకోవాల్సి వచ్చిందన్నారు. మనల్ని ఎగ్జిట్‌ గేట్ల దగ్గర పడేసిన టీఆర్‌ఎస్‌ పార్టీని పూర్తిగా సాగనంపాలని పిలుపు నిచ్చారు. 

బడి పిల్లలకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌..
తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని గాలికొదిలేసిందని, దీంతో వేలాది విద్యా సంస్థలు మూతపడ్డాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయాలని పలుమార్లు ఆందోళన చేసినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. కార్పొరేట్‌ కాలేజీలను పూర్తిగా మూసివేయాలని, బడి పిల్లలకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ చైర్మన్‌ రమణారెడ్డి, కన్వీనర్‌ గౌరి సతీశ్, సీపీఎంఎల్‌ న్యూడెమోక్రసీ అధ్యక్షుడు గోవర్ధన్, యువ తెలంగాణ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాణిరుద్రమ తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement