all-party leaders
-
రోగాల నగరంగా మార్చారు
హైదరాబాద్: విశ్వనగరంగా హైదరాబాద్‌ను మారుస్తామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం అవగాహనలేమితో రోగాల నగరంగా మార్చిందని అఖిలపక్ష నేతలు ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు రోగాలతో విలవిలలాడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని ధ్వజమెత్తారు. సీజనల్ వ్యాధుల కారణంగా నగరంలోని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో శనివారం అఖిలపక్ష నేతలు ఆ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ పద్మజతో సమావేశమైన నేతలు రోగులకు అందిస్తున్న వైద్యం, సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వార్డు–2లోకి వెళ్లి రోగులను పరామర్శించారు. ‘ఫీవర్’కే ఫీవర్: కోదండరాం ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ధర్మాసుపత్రి గా పేరుగాంచిన ఫీవర్ ఆస్పత్రికే జ్వరం వచ్చినట్లుందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. విషజ్వరాల నేపథ్యంలో మంత్రులు, అధికారులు ఆస్పత్రుల సందర్శనలు, పరామర్శలతో సమస్యలు పరిష్కారం కావన్నారు. రోగుల తాకిడి దృష్ట్యా ఓపీ కౌంటర్లలో ఉన్న వైద్యులపై అధిక పని భారం పడుతోందన్నారు. దీంతో అదనపు ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేసి అందుకనుగుణంగా సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలన్నారు. చోద్యం చూస్తోంది: ఎల్.రమణ రాష్ట్రమంతా విషజ్వరాలతో అల్లాడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు నగరం నాలుగు దిక్కుల్లో వెయ్యి పడకల ఆస్పత్రులు నాలుగు ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు చేయలేదని ప్రశ్నించారు. రూ.కోట్లు ఖర్చు చేసి ప్రగతి భవన్ నిర్మించింది విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకేనన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సరైన కార్యాచరణ లేదు: చాడ వైద్యం పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వానికి సరైన కార్యాచరణ లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. రోగుల తాకిడి దృష్ట్యా ఫీవర్ ఆస్పత్రికి అదనపు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. విషజ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సాయిబాబా, సీపీఐ నేత అజీజ్ పాషా, డాక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్‌ను తరిమి కొడితేనే బతుకు!
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ ప్రజలు నమ్మి అధికారాన్ని కట్టబెడితే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాలుగున్నరేళ్లకే చేతులెత్తేశాడు. పరిపాలన చేత కాకపోవడంతో నమ్మిన ప్రజలను నట్టేట ముంచాడు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కంకణం కట్టుకున్నాడు. కానీ తెలంగాణ బిడ్డలు ఆయన మాటలు నమ్మే స్థితిలో లేరు. కుటుంబమంతా రాష్ట్రం మీద పడి దోచుకుంది. ప్రశ్నించిన గొంతును అణచివేసింది. అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేయడంతో పాటు అన్ని వర్గాల ప్రజలను అణగదొక్కేశారు. ఇంతటి ఘనకార్యం చేసిన కేసీఆర్ కుటుంబానికి ఓటు వేస్తే ఈసారి బతకడమే కష్టంగా మారుతుంది’అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వాఖ్యానించారు. శనివారం రంగారెడ్డి జిల్లా గౌరెల్లి సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ప్రైవేటు విద్యా సంస్థల ఐక్య కార్యాచరణ సమితి ఏర్పాటు చేసిన అత్మగౌరవ సభకు ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. అఖిల పక్ష పార్టీ అధ్యక్షులు, ప్రతినిధులు హాజరైన ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టారు. ‘అభివృద్ధిలో కీలకమైన విద్యావ్యవస్థను టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. ప్రభుత్వ వ్యవస్థను నాశనం చేసి ప్రైవేటు విద్యాసంస్థల మీద పడ్డాడు. కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా మారి చిన్నపాటి ప్రైవేట్ సంస్థలను అణచివేశాడు. విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలని కోరుతూ మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్‌తో చర్చలకు వెళ్తే... కనీస మర్యాద లేకుండా అడ్డగోలుగా మాట్లాడాడు. నాలుగున్నరేళ్ల దుర్మార్గపు పాలన నుంచి ప్రజలు విముక్తులయ్యారు. ఇక మళ్లీ ఆ కుటుంబం వద్దు. వచ్చే 2 నెలల పాటు ప్రజలతో మమేకమై టీఆర్ఎస్ పాలన వైఫల్యాలను వివరించండి. ఎన్నికల వరకు అప్రమత్తంగా ఉంటేనే తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయి. లేకుంటే ప్రాణాలతో బతకడమే కష్టమవుతుంది.’అంటూ ఆవేశపూరితంగా మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలల్లో దాదాపు 4 లక్షల మంది సిబ్బంది ఉన్నారని, ఒక్కొక్కరు సైనికుల్లా పనిచేసి చైతన్యపర్చాలని పిలుపునిచ్చారు. మేము అధికారంలోకి వస్తే... రాష్ట్రంలో కాంగ్రెస్ భాగస్వామ్య ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రైవేటు విద్యా వ్యవస్థను గాడిలో పెడతామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. పోస్టుమెట్రిక్ విద్యార్థులకు ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అదే ఏడాదిలో రెండు విడతల్లో నిధులు విడుదల చేస్తామన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలను కట్టడి చేస్తామని, ఫీజులను నియంత్రించి నిర్దేశిస్తామన్నారు. నాన్ కార్పొరేట్ విద్యాసంస్థల విద్యుత్ బిల్లులు డొమెస్టిక్ కేటగిరీలోకి మారుస్తామని, భవనాల అద్దెను సైతం డొమెస్టిక్ విధానంలోకి మారుస్తామన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి ఆరోగ్య కార్డులు, ఏటా రూ.5 లక్షలతో కూడిన ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో మార్పులు చేస్తామన్నారు. కల్వకుంట్ల కంపును ఇక భరించొద్దు... రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబానికి ప్రజలు చరమగీతం పాడాలని ఏఐసీసీ కార్యదర్శి మధుయాస్కీ గౌడ్ పేర్కొన్నారు. నాలుగున్నరేళ్లుగా ఇబ్బంది పడ్డ ప్రజలకు ఇక ఉపశమనం దక్కిందని, ఇక ఆ కంపును భరించాల్సిన పని లేదన్నారు. రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డిలను అనవసర కేసుల్లో ఇరికిస్తున్నారన్నారు. పౌరహక్కుల నేత వరవరరావును, కోదండరామ్ అక్రమ అరెస్టులను రాష్ట్ర ప్రజలంతా చూశారన్నారు. కేసీఆర్‌కు తగిన బుద్ది చెప్పాలన్నారు. మెరుగైన విద్యకు మార్గం వేస్తాం.... టీఆర్ఎస్ పాలనలో విద్యావ్యవస్థ నాశనమైందని, దీన్ని తిరిగి పునర్నిర్మించాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. అందుకు మహాకూటమికి మద్దతు పలకాలని, ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ 12 డిమాండ్లను పరిష్కరిస్తామన్నారు. తెలంగాణ సాధనలో మహా కూటమి కీలకంగా వ్యవహరించిందని, ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి రక్షించేందుకు మరోమారు ఉద్యమిస్తోందన్నారు. నిజాంను మించిపోయిన కేసీఆర్... రాష్ట్రంలో తొలిసారి ఏర్పాటైన ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని అందరూ భావించారని, కానీ అందుకు భిన్నంగా నిజాంను మించిన నిరంకుశ పాలనకు కేసీఆర్ నాంది పలికారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఇలాంటి పాలనను ప్రజలు కోరుకోవడం లేదన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో తెలంగాణ ప్రజలు ముందస్తుగా విముక్తులయ్యారని, ఇక కేసీఆర్‌కు అవకాశం ఇవ్వద్దన్నారు. కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నారని, అక్కడి ప్రాథమిక పాఠశాలలో ఆరు పోస్టులుంటే ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని విద్యావలంటీర్లతో నెట్టుకొస్తున్నారన్నారు. సీఎం దత్తత తీసుకున్న ఊర్లో పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే రాష్ట్రంలో పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ ద్రోహులంతా కేసీఆర్‌కు దోస్తులయ్యారు రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వాళ్లంతా కేసీఆర్‌కు దోస్తులయ్యారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆందోళన చేపట్టిన విద్యార్థులపై రాళ్లు రువ్వి, కర్రలతో దాడులు చేసిన వారంతా ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులయ్యారన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు మాత్రమే అవకాశం ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేసిన వాళ్లంతా అణచివేతకు గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగాలనుకుంటే రజాకార్లను తలపించేలా గడీల పాలన వచ్చిందని, దీన్ని ప్రజలు సహించడం లేదన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వానికి విన్నవించేలా ఉన్న ధర్నాచౌక్‌ను ఎత్తేశాడని, హైదరాబాద్‌కు అవతల ఔటర్ రింగురోడ్డు ఎగ్జిట్ల వద్ద ఇలా సమావేశాలు పెట్టుకోవాల్సి వచ్చిందన్నారు. మనల్ని ఎగ్జిట్ గేట్ల దగ్గర పడేసిన టీఆర్ఎస్ పార్టీని పూర్తిగా సాగనంపాలని పిలుపు నిచ్చారు. బడి పిల్లలకూ ఫీజు రీయింబర్స్మెంట్.. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని గాలికొదిలేసిందని, దీంతో వేలాది విద్యా సంస్థలు మూతపడ్డాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని పలుమార్లు ఆందోళన చేసినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. కార్పొరేట్ కాలేజీలను పూర్తిగా మూసివేయాలని, బడి పిల్లలకూ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ చైర్మన్ రమణారెడ్డి, కన్వీనర్ గౌరి సతీశ్, సీపీఎంఎల్ న్యూడెమోక్రసీ అధ్యక్షుడు గోవర్ధన్, యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణిరుద్రమ తదితరులు పాల్గొన్నారు. -
పరకాలకు అన్యాయం
♦ జిల్లా కేంద్రం ఏర్పాటుతోనే న్యాయం ♦ రౌండ్‌టేబుల్ సమావేశంలో ♦ అఖిలపక్ష నాయకులు, పట్టణ ప్రముఖుల అభిప్రాయం పరకాల: వరంగల్ రూరల్ జిల్లా కేంద్రంగా పరకాలను చేయడం తప్పా మరో మార్గం లేదని అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశంలో రాజకీ య నాయకులు, ప్రముఖులు, వ్యాపారస్తులు, విద్యార్థి, సంఘాల నాయకులు అభిప్రాయపడ్డాయి. పరకాలతో వ్యాపార వాణిజ్య సంబం ధాలు కలిగిన మండలాలను జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలపడం వల్ల ఇప్పటికే వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడిందని ఆందో ళన వ్యక్తం చేసిన వ్యాపారస్తులు జిల్లా కేంద్రం కోసం అఖిలపక్షం పిలుపునిచ్చే ఎలాంటి కార్యక్రమాలకైనా ముందుండి పోరాడుతామని స్ప ష్టం చేశారు. పరకాల పట్టణంలోని స్వర్ణగార్డెన్లో మంగళవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశానికి రాజకీయ పార్టీలు నాయకులు, వ్యాపారస్తులు, విద్యార్థి సంఘాల నాయకులు, ప్రముఖులు హాజరై జిల్లాల పునర్విభజన తర్వాత పరకాల స్థితిగతులపై చర్చించారు. పరకాల పాత తాలూకాలతో కలిపి రెవెన్యూ డివిజన్ చేయాలని కోరగా పాలకులు ఏకపక్షంగా రూపురేఖలు లేని వరంగల్ రూరల్ జిల్లాలో కలిపి తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. జిల్లాల పునర్విభజనలో పరకాల అత్యధికంగా నష్టపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కేం ద్రం చేయడం తప్పా మరో మార్గం లేదని, పరకాల ఉనికి కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉండాలని ముక్తకంఠంతో పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ, టీడీ పీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్, వైఎస్సార్ సీపీ, లోక్‌జనశక్తి పార్టీల నాయకులతోపాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగబండి విద్యాసాగర్, డాక్టర్ సిరంగి సంతోష్‌కుమార్, కుంకుమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ ఏరుకొండ సాంబమూర్తి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బండి ఆగయ్య, లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీణవంక రాజు, కిరాణ వర్తక సంఘం నాయకులు చంద్రశేఖర్, శివకృష్ణ, బట్టల వర్తక సంఘం అధ్యక్షుడు పిట్ట వీరస్వామి, వీరేశం, ఫర్టిలైజర్స్ సంఘం నాయకులు సూర్యదేవర సదానందం, ఎమ్మార్పీఎస్ నాయకులు దుప్పటి మొగిళి, వ్యాపారస్తులు ఎర్రం రామన్న, మినుపాల బాపురావు, పల్నాటి సతీష్, శంకరాచారి, దంచనాల ఈశ్వర్, విద్యార్థి సంఘాల నాయకులు కట్టగాని శ్రీకాంత్, ఇంగిళి వీరేష్‌రావు, కుసుమ అఖిల్, యూత్ నాయకులు కొయ్యడ శ్రీనివాస్, యాట నరేష్, నాగెల్లి రంజిత్ పాల్గొన్నారు. జిల్లా కేంద్రం కోసం మానవహారం పరకాల: పరకాలను జిల్లా కేంద్రం చేయాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో మంగళవారం మానవహారం నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్లో అరగంట సేపు చేపట్టిన మానవహారంలో కిలోమీటరు వరకు వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. జిల్లా కేంద్రం ఏర్పాటు చేయని పక్షంలో పోరాటాలను ఉధృతం చేస్తామని నాయకులు, వ్యాపారస్తులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపారస్తులు, విద్యార్థిసంఘాల నాయకులు పాల్గొన్నారు.