
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లను తగ్గించి పంచాయతీ రాజ్ ఎన్నికలను నిర్వహించడాన్ని కాంగ్రెస్ పార్టీ అంగీకరించబోదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా బీసీ ఓటర్ల గణన చేపట్టి వారి జనాభా ఆధారంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 22 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయని స్వయంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారే అంగీకరించారని, అలాంటప్పుడు ఓటర్ల జాబితా సవరించకుండా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల తగ్గింపు ఆర్డినెన్సు ఉపసంహరణ, ఓటర్ల జాబితా సవరణ తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
సీఎంకు రాసిన లేఖలోని ముఖ్యాంశాలు..
‘సుప్రీంకోర్టు తీర్పు మేరకు బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి ఈ నెల 15న విడుదల చేసిన ఆర్డి నెన్స్‌ను కాంగ్రెస్ అంగీకరించడం లేదు. సర్పంచ్, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ రిజర్వేషన్లు తగ్గించవద్దంటూ బీసీ సామాజిక వర్గాలు ఉద్యమించిన విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాం. రాష్ట్రంలోని బీసీ జనా భా ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలి. హైకోర్టు కూడా బీసీల జనాభాను శాస్త్రీయంగా లెక్కించిన అనంతరం ప్రజల నుంచి అభ్యం తరాలను స్వీకరించిన తర్వాతే బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేయాలంది. ఈ ఏడాది జూన్ 6న హైకోర్టు ఇచ్చిన తీర్పును విస్మరించారు. బీసీ ఓటర్ల గణనకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీనికి తోడు 2018 అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగానే పంచాయతీ ఎన్నికలు జరుపుతామని ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే, దాదాపు 22 లక్షల మంది అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి గల్లంతయ్యాయని సీఈఓనే అంగీకరించారు.
ఓటర్ల జాబితా సవరణకు భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్ ప్రకారం 2019, ఫిబ్రవరి 22న ఓటర్ల తుది జాబితా ప్రచురించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త ఓటర్ల జాబితా రాకుండా పంచాయతీ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు. మీ నిర్ణయంతో లక్షలాది మంది తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఇది ప్రజా స్వామ్యాన్ని కాలరాయడమే. బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలి. హైకోర్టు చెప్పిన విధంగా బీసీల సామాజిక పరిస్థితుల అధ్యయనం, ఓటర్ల గణనను చేపట్టి బీసీల్లో ఏ,బీ,సీ,డీ వర్గీకరణ ప్రకారం పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలి. ప్రస్తుత ఓట ర్ల జాబితాను సవరించి అకారణంగా తొలగించిన వారి పేర్లను జాబితాలో చేర్చి వారి ప్రజాస్వామిక హక్కును కాపాడాలి’ అని ఉత్తమ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment