
సాక్షి, హైదరాబాద్: తన మొండి వైఖరితో సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను వేధిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఇప్పటివరకు జరిగిన ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి తాము అండగా ఉంటామని, ఆర్టీసీ కార్మికుల పక్షాన కాంగ్రెస్ నిలుస్తుందని చెప్పారు. మంగళవారం గాందీభవన్‌లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం మొండివైఖరితో సాగడం మంచిది కాదన్నారు.
వెంటనే సమ్మె పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం ఏఐసీసీ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్, శ్రీనివాసరావులు మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమన దిశలో పయనిస్తున్న తీరును పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ (పీపీపీ) ద్వారా రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు వివరించారు. ఈ సమావేశంలో దాసోజు శ్రావణ్, ఆర్.సి.కుంతియా, జానారెడ్డి, భట్టివిక్రమార్క, రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, సంపత్‌కుమార్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, పొడెం వీరయ్య, పార్టీ నేతలు వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రకృతి చికిత్సకు ఉత్తమ్
ఉత్తమ్ ప్రకృతి చికిత్స తీసుకునేందుకు బెంగళూరుకు వెళ్లారు. బుధవారం నుంచి 10 రోజుల పాటు జిందాల్ నేచుర్‌కేర్ సెంటర్‌లో బసచేసి చికిత్స పొందుతారు. గత డిసెంబర్ నుంచి వరుసగా వస్తున్న ఎన్నికలతో కలిగిన మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం ఆయన చికిత్సకు వెళ్తున్నారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment