‘నేను రైతుల గొంతుకనవుతా. వ్యవసాయ సంక్షోభం మిగిల్చిన వితంతువుల వెతలను పార్లమెంట్‌లో చర్చకు పెడతా. నన్ను ఆదరించండి. గెలిపించండి..’ అంటూ 28 ఏళ్ల వైశాలి యెడే మహారాష్ట్రలోని యవత్మాల్ – వషిమ్ నియోజకవర్గమంతటా కలియదిరుగుతోంది. ఆమె ఓ వ్యవసాయ కుటుంబానికి చెందిన వితంతువు. కూలీ. అంగన్‌వాడీ కార్మికురాలు. వ్యవసాయ నష్టాలను తట్టుకోలేక 2011లో ఆమె భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రహర్ జన్‌శక్తి పక్ష అనే స్థానిక రాజకీయ పార్టీ తరఫున వైశాలి ఎన్నికల బరిలోకి దిగింది. అమరావతి జిల్లా అచల్‌పూర్ నియోజకవర్గానికి చెందిన 48 ఏళ్ల ఓం ప్రకాశ్ కడు అనే స్వతంత్ర ఎమ్మెల్యే ఈ పార్టీ స్థాపించారు. 2017లో ప్రహర్ పార్టీ దక్షిణ యవత్మాల్‌లోని పందర్‌కౌడ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ను మట్టికరిపించి 19 సీట్లకు 17 సీట్లు సంపాదించుకుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల రైతులు వైశాలి ప్రచారానికి విరాళాలు అందిస్తున్నట్టు ఓంప్రకాశ్ చెబుతున్నారు.
రంగస్థలంపై.. 2009లో 18 ఏళ్ల వయసప్పుడు వైశాలి సుధాకర్ యెడేను పెళ్లాడింది. ఆయన మూడెకరాల భూమిలో పత్తి, సోయా పండించేవాడు. పంట చేతికి రాకపోవడం, అప్పుల్లో కూరుకుపోవడంతో ప్రాణాలు తీసుకున్నాడు. అప్పటికి వైశాలి వయసు 20. ఇద్దరు పిల్లల తల్లి. భర్త మరణానంతరం వైశాలి సామాజిక కార్యకలాపాల్లోకి అడుగుపెట్టింది. నాగపూర్ నాటక రచయిత, సీనియర్ జర్నలిస్టు శ్యామ్ పెత్కర్ వ్యవసాయ వితంతువులపై రూపొందించిన నాటకంలో తనలాంటి బాధితులతో కలసి నటించింది. గత జనవరిలో యవత్మాల్ సాహిత్య సదస్సును ప్రారంభించడం ద్వారా ఆమె మరింత గుర్తింపు పొందింది. వైశాలి ఉదయం కూలీకి పోతుంది. మధ్యాహ్నం రాజ్‌పూర్ గ్రామ అంగన్‌వాడీలో పని చేస్తుంది. సాయంత్రానికల్లా కుట్టు మిషన్ ఎక్కుతుంది. ఇంతా కష్టపడితే నెలకు ఆమెకు లభించే ఆదాయం రూ.7–8 వేలు.
నేను గెలిస్తే.. 17.5 లక్షల మంది ఓటర్లు వున్న యవత్మాల్ – వషిమ్‌లో ఈ నెల 11న ఎన్నిక జరగబోతోంది. తనను గెలిపిస్తే, పంటలకు గిట్టుబాటు ధరలు, మహిళా వ్యవసాయ కూలీలకు న్యాయసమ్మతమైన వేతనాలు, వితంతు కుటుంబాల వెతలు సహా పేదల సమస్యలను పార్లమెంట్‌లో లేవనెత్తుతానని హామీలిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment