Yavatmal
-
ప్రసంగిస్తూనే సొమ్మసిల్లిన గడ్కరీ
యావత్మాల్(మహారాష్ట్ర): మహారాష్ట్రలోని యావత్మాల్ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగిస్తూనే వేదికపై కుప్పకూలారు. అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయిన ఆయన్ను పార్టీ కార్యకర్తలు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ‘ఎండ వేడిమికి తాళలేక పుసాద్ సభలో అనారోగ్యానికి గురయ్యాను.ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాను. వరుడ్‌లో జరిగే ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్నాను. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’అంటూ కొద్దిసేపటి తర్వాత ఆయన ‘ఎక్స్’లో పేర్కొన్నారు. నాగ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి గడ్కరీ పోటీ చేస్తున్నారు. మొదటి విడతలో అక్కడ పోలింగ్ పూర్తయింది. రెండో విడతలో భాగంగా ఈనెల 26న యావత్మాల్లో పోలింగ్ జరగనుంది. -
కరోనా పేషెంట్ల బట్టలు ఉతకం
సాక్షి, ముంబై: దేశంలో అత్యధిక కోవిడ్-19 కేసులు నమోదైన మహారాష్ట్రలో కరోనా పేషెంట్ల బట్టలు ఉతకడానికి ధోబీలు ససేమీరా అంటున్నారు. తమకూ ఆ వైరస్ సోకుతుందేమోననన్న భయంతో వెనకడుగు వేస్తున్నారు. సాధారణంగా ఆసుపత్రిలోని వివిధ వార్డుల్లో వినియోగించే వస్త్రాలను స్థానికంగా పనిచేసే ధోబీలతో ఉతికిస్తారు. అదే విధంగా మహారాష్ట్రలోని యవత్మల్ స్థానిక ఆసుపత్రిలో సోమవారం అన్ని వార్డులతో పాటు ఐసోలేషన్ వార్డులో వినియోగించిన బెడ్ షీట్లు, కర్టెన్లు, పేషెంట్ల వస్త్రాలను ఉతకమని ధోబీలకు అందించారు. కానీ వారు తాము ఆ పని చేయలేమంటూ చేతులెత్తేశారు. ఐసోలేషన్ వార్డులో ఉపయోగించిన బట్టలు ముట్టుకుంటే తమకు ఆ వైరస్ సోకుతుందేమోనని భయంగా ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అశోక్ చౌదరి అనే వ్యక్తి పేర్కొన్నాడు. కాగా కరోనా అనుమానితులను, వ్యాధిగ్రస్తులను ఐసోలేషన్ వార్డులకు తరలించి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే.(కరోనా: యూరప్, ఆసియాలో అత్యధిక మరణాలు) -
వైశాలి యెడే అనే నేను..
‘నేను రైతుల గొంతుకనవుతా. వ్యవసాయ సంక్షోభం మిగిల్చిన వితంతువుల వెతలను పార్లమెంట్లో చర్చకు పెడతా. నన్ను ఆదరించండి. గెలిపించండి..’ అంటూ 28 ఏళ్ల వైశాలి యెడే మహారాష్ట్రలోని యవత్మాల్ – వషిమ్ నియోజకవర్గమంతటా కలియదిరుగుతోంది. ఆమె ఓ వ్యవసాయ కుటుంబానికి చెందిన వితంతువు. కూలీ. అంగన్వాడీ కార్మికురాలు. వ్యవసాయ నష్టాలను తట్టుకోలేక 2011లో ఆమె భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రహర్ జన్‌శక్తి పక్ష అనే స్థానిక రాజకీయ పార్టీ తరఫున వైశాలి ఎన్నికల బరిలోకి దిగింది. అమరావతి జిల్లా అచల్పూర్ నియోజకవర్గానికి చెందిన 48 ఏళ్ల ఓం ప్రకాశ్ కడు అనే స్వతంత్ర ఎమ్మెల్యే ఈ పార్టీ స్థాపించారు. 2017లో ప్రహర్ పార్టీ దక్షిణ యవత్మాల్లోని పందర్కౌడ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ను మట్టికరిపించి 19 సీట్లకు 17 సీట్లు సంపాదించుకుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల రైతులు వైశాలి ప్రచారానికి విరాళాలు అందిస్తున్నట్టు ఓంప్రకాశ్ చెబుతున్నారు. రంగస్థలంపై.. 2009లో 18 ఏళ్ల వయసప్పుడు వైశాలి సుధాకర్ యెడేను పెళ్లాడింది. ఆయన మూడెకరాల భూమిలో పత్తి, సోయా పండించేవాడు. పంట చేతికి రాకపోవడం, అప్పుల్లో కూరుకుపోవడంతో ప్రాణాలు తీసుకున్నాడు. అప్పటికి వైశాలి వయసు 20. ఇద్దరు పిల్లల తల్లి. భర్త మరణానంతరం వైశాలి సామాజిక కార్యకలాపాల్లోకి అడుగుపెట్టింది. నాగపూర్ నాటక రచయిత, సీనియర్ జర్నలిస్టు శ్యామ్ పెత్కర్ వ్యవసాయ వితంతువులపై రూపొందించిన నాటకంలో తనలాంటి బాధితులతో కలసి నటించింది. గత జనవరిలో యవత్మాల్ సాహిత్య సదస్సును ప్రారంభించడం ద్వారా ఆమె మరింత గుర్తింపు పొందింది. వైశాలి ఉదయం కూలీకి పోతుంది. మధ్యాహ్నం రాజ్పూర్ గ్రామ అంగన్వాడీలో పని చేస్తుంది. సాయంత్రానికల్లా కుట్టు మిషన్ ఎక్కుతుంది. ఇంతా కష్టపడితే నెలకు ఆమెకు లభించే ఆదాయం రూ.7–8 వేలు. నేను గెలిస్తే.. 17.5 లక్షల మంది ఓటర్లు వున్న యవత్మాల్ – వషిమ్లో ఈ నెల 11న ఎన్నిక జరగబోతోంది. తనను గెలిపిస్తే, పంటలకు గిట్టుబాటు ధరలు, మహిళా వ్యవసాయ కూలీలకు న్యాయసమ్మతమైన వేతనాలు, వితంతు కుటుంబాల వెతలు సహా పేదల సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీలిస్తోంది. -
‘అవని’ని కాల్చి చంపేశారు
సాక్షి, ముంబై : మహారాష్ట్రలో సుమారు 13 మంది మృతికి కారణమైన ఆడ పులి అవని(T1) ని శుక్రవారం రాత్రి అంతమొందించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. యవత్మాల్ ప్రాంతంలో సంచరిస్తూ.. మనుషుల మాంసానికి రుచి మరిగిన అవని వల్ల ప్రమాదం పొంచి ఉన్నందున కనిపించిన వెంటనే కాల్చిపారేయలని సుప్రీం కోర్టు ఈ ఏడాది ప్రారంభంలో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా అవనిని ప్రాణాలతోనే పట్టుకోవాలంటూ చేంజ్. ఆర్గ్ అనే సంస్థ వేసిన పిటిషన్‌ను కూడా కొట్టివేసింది. కాగా గత రెండేళ్లుగా అధికారులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతూ తమ ప్రాణాలకు ప్రమాదంగా పరిణమించిన పులిని మట్టుబెట్టినందుకు యవత్మాల్ పరిసర ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సగానికి పైగా మన దేశంలోనే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పులుల మొత్తం జనాభాలో సగానికి పైగా భారత్‌లోనే ఉందని 2014 గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మన దేశంలోని వివిధ అరణ్యాల్లో సుమారు 2,226 పులులు ఉన్నట్లుగా గుర్తించారు. కాగా ప్రతీ ఏడాది దాదాపు 12 పులులు చనిపోతున్నాయని, ఇలా అయితే భవిష్యత్తులో పులుల ఉనికి ప్రమాదంలో పడే అవకాశం ఉందని జంతు హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
41 ఏళ్ల తర్వాత కన్నతల్లి చెంతకు!
ముంబై: భారత సంతతికి చెందిన నీలాక్షి ఎలిజబెత్ జోరెండాల్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. నాలుగు దశాబ్దాల (41 ఏళ్ల) తర్వాత తన కన్నతల్లిని కలుసుకోవడమే అందుకు కారణం. ఆ వివరాలు.. మహారాష్ట్రకు చెందిన యవాత్మల్ 1973లో తన భర్త చనిపోయే సమయానికి గర్భవతిగా ఉంది. వ్యవసాయ కూలీ అయిన యవాత్మల్ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అదే ఏడాది ఆమె ఓ పండంటి పాప నీలాక్షికి జన్మనిచ్చింది. ఆ పాపకు మూడేళ్ల వయసు ఉండగా తల్లి ఆమెను పుణే సమీపంలోని కెడ్గావ్‌లో ఉన్న పండిత రమాబాయి ముక్తి మిషన్ అనాథశ్రమంలో వదిలి వెళ్లింది. అదే సమయంలో స్వీడన్‌కు చెందిన ఓ జంట ఆ పాపను దత్తత తీసుకుంది. ఎలిజబెత్ తల్లి రెండో వివాహం చేసుకోగా ఆమెకు ఓ కొడుకు, కుమార్తె ఉన్నారు. 1976లో దత్తత పెరేంట్స్‌తో స్వీడన్ వెళ్లిన ఎలిజబెత్‌కు 1990లో కన్నతల్లి గురించి చెప్పారు. అదే ఏడాది 17 ఏళ్ల వయసులో తొలిసారిగా ఎలిజబెత్ పుణే వచ్చి తల్లి యవాత్మల్ గురించి వాకబు చెసింది. కానీ ప్రయోజనం లేదు. అలా గతేడాది వరకు ఐదు పర్యాయలు ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి పుణేకు చెందిన ఎన్జీఓ సాయంతో ఆమె తన తల్లిని కలుసుకున్నారని ఆరో ప్రయత్నంలో ఎలిజబెత్ సాధించారని సంస్థ సిబ్బంది అంజలీ పవార్ తెలిపారు. గత శనివారం ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో తన తల్లి యవాత్మల్ ను చూడగానే ఎలిజబెత్ కన్నీటి పర్యంతమయ్యారు. 41 ఏళ్ల తర్వాత తల్లి చెంతకు చేరానన్న ఆనందలో మొదట ఆమె నోటివెంట మాట రాలేదు. 27 ఏళ్ల తన నిరీక్షణకు తెరపడిందని ఆమె హర్షం వ్యక్తం చేశారు. తల్లి ఆరోగ్యానికి బాగు చేయించడానికి అయ్యే ఖర్చును తానే భరిస్తానని, తమ్ముడు, చెల్లిని కూడా సంరక్షిస్తానని చెప్పారు. తనకు సాయం చేసిన ఎన్జీవోకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
కలెక్టర్ అధికార వాహనం సీజ్
యవట్మాల్: రైతుకు నష్టపరిహారం చెల్లించనందుకు జిల్లా కలెక్టర్ అధికార వాహనాన్ని సీజ్ చేశారు. మహారాష్ట్రలో యవట్మాల్ జిల్లాలో సివిల్ కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల మేరకు ఆ జిల్లా కలెక్టర్ వాహనాన్ని సీజ్ చేశారు. వివరాలిలా ఉన్నాయి. 1999లో మహారాష్ట్ర జీవన్ ప్రాధికారణ్.. చాప్దో ప్రాజెక్టు కోసం రామ్‌నగర్‌కు చెందిన రైతు ఛగన్ రాథోడ్ తల్లి నుంచి 10 హెకార్ల భూమి సేకరించింది. ఇందుకుగాను అప్పట్లో ఆమెకు నష్టపరిహారం చెల్లించారు. అయితే నష్టపరిహారం మరింత పెంచాలని ఛగన్ రాథోడ్ కోర్టును ఆశ్రయించగా, మరో 13.30 లక్షలు అతనికి చెల్లించాల్సిందిగా 2010లో కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ మొత్తాన్ని ఎంజేపీ ఛగన్‌కు చెల్లించలేదు. దీంతో ఆయన మళ్లీ కోర్టును ఆశ్రయించాడు. వడ్డీతో సహా 29.84 లక్షల రూపాయలు రైతుకు చెల్లించాల్సిందిగా ఇటీవల ఎంజేపీని ఆదేశించింది. అయినా నష్టపరిహారం ఇవ్వకపోవడంతో కలెక్టర్ వాహనాన్ని సీజ్ చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రైతుకు నష్టపరిహారం చెల్లించే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని ఎంజేపీ ఈఈ దినేశ్ బోర్కర్ చెప్పారు. -
నేడు విదర్భకు శరద్ పవార్
నాగపూర్: గత నెలలో విదర్భలో కురిసిన భారీ వర్షాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ శుక్రవారం నుంచి పర్యటించనున్నారు. వరద బాధితులకు భరోసా కల్పించే ప్రయత్నం చేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో జరిగిన నష్టానికి సంబంధించిన లెక్కలను తేల్చేందుకు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి గోపాల్ రెడ్డి నేతృత్వంలోని బృందం పర్యటిస్తోంది. అయితే పవార్ నాలుగు రోజులు పర్యటనలో భాగంగా ఈ నెల 14న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అత్యధిక వర్షపాతం వల్ల వచ్చిన వరదలు, దీనివల్ల కలిగిన నష్టాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులు పవార్‌కు లెక్కలు వినిపించనున్నారు. అనంతరం పవార్ వర్ధాలో పర్యటించి అక్కడ ఆస్తి, పంట నష్టాల గురించి తెలుసుకోనున్నారు. యావత్మల్లోనే రాత్రి బస చేసి 16న గోండియా, భండారా జిల్లాలకు వెళ్లి వరద ముంపునకు గురైన ప్రజల బాధలను అడిగి తెలుసుకోనున్నారు. 17న తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళతారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదిలాఉండగా వరదముంపునకు గురైన ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ సురభ్ రావ్, ఇతర అధికారులు, కేంద్ర బృందం సభ్యులతో కలిసి బుధవారం పర్యటించారు. అయా గ్రామాల సర్పంచ్‌లు, స్థానిక అధికారులతో మాట్లాడారు. జిల్లాపరిషత్ అధ్యక్షుడు సంధ్యా గోతమరేపంటనష్టం గురించి ఓ నివేదికను కేంద్ర బృందానికి సమర్పించారు. జిల్లాలోని హింగానా తాలూకాలో 123 హెక్టార్లలో, కనోలిబారా తాలూకాలోని 648 హెక్టార్లలో పంటనష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. భండారా, చంద్రపూర్, గడ్చిరోలి, అమరావతి, అకోలా, యావత్మల్ కేంద్ర బృందం పర్యటిస్తోంది. అలాగే పవార్ పర్యటనకు ముందు వర్ధాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జయంత్ భాటియా గురువారం పర్యటించారు.