నేడు విదర్భకు శరద్ పవార్
Published Fri, Sep 13 2013 12:18 AM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM
నాగపూర్: గత నెలలో విదర్భలో కురిసిన భారీ వర్షాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ శుక్రవారం నుంచి పర్యటించనున్నారు. వరద బాధితులకు భరోసా కల్పించే ప్రయత్నం చేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో జరిగిన నష్టానికి సంబంధించిన లెక్కలను తేల్చేందుకు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి గోపాల్ రెడ్డి నేతృత్వంలోని బృందం పర్యటిస్తోంది. అయితే పవార్ నాలుగు రోజులు పర్యటనలో భాగంగా ఈ నెల 14న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అత్యధిక వర్షపాతం వల్ల వచ్చిన వరదలు, దీనివల్ల కలిగిన నష్టాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులు పవార్‌కు లెక్కలు వినిపించనున్నారు. అనంతరం పవార్ వర్ధాలో పర్యటించి అక్కడ ఆస్తి, పంట నష్టాల గురించి తెలుసుకోనున్నారు. యావత్మల్‌లోనే రాత్రి బస చేసి 16న గోండియా, భండారా జిల్లాలకు వెళ్లి వరద ముంపునకు గురైన ప్రజల బాధలను అడిగి తెలుసుకోనున్నారు.
17న తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళతారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదిలాఉండగా వరదముంపునకు గురైన ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ సురభ్ రావ్, ఇతర అధికారులు, కేంద్ర బృందం సభ్యులతో కలిసి బుధవారం పర్యటించారు. అయా గ్రామాల సర్పంచ్‌లు, స్థానిక అధికారులతో మాట్లాడారు. జిల్లాపరిషత్ అధ్యక్షుడు సంధ్యా గోతమరేపంటనష్టం గురించి ఓ నివేదికను కేంద్ర బృందానికి సమర్పించారు. జిల్లాలోని హింగానా తాలూకాలో 123 హెక్టార్లలో, కనోలిబారా తాలూకాలోని 648 హెక్టార్లలో పంటనష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. భండారా, చంద్రపూర్, గడ్చిరోలి, అమరావతి, అకోలా, యావత్మల్ కేంద్ర బృందం పర్యటిస్తోంది. అలాగే పవార్ పర్యటనకు ముందు వర్ధాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జయంత్ భాటియా గురువారం పర్యటించారు.
Advertisement