
రౌండ్‌టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న అంబటి రాంబాబు, పక్కన చలమయ్య, వేణుగోపాల్, హాజరైన ప్రజాసంఘాలు, పౌరహక్కుల సంఘాలు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు
సత్తెనపల్లి: శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆటవిక పరిపాలనను సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల నుంచి తరిమి కొట్టాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని కోడెల, ఆయన కుమారుడు, కుమార్తె చేస్తోన్న అవినీతి, అక్రమాలపై గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీడీపీ మినహా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, అన్ని ప్రజా, పౌర సంఘాల ప్రతినిధులు బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ నెల 15న సత్తెనపల్లి తాలూకా సెంటర్‌లో ‘క్విట్ కోడెల – సేవ్ సత్తెనపల్లి’ పేరుతో నిరసన నిర్వహించాలని నిర్ణయించారు.
కోడెల హయాంలో పనిచేసి పదవీ విరమణ చేసిన, ప్రస్తుతం పనిచేస్తున్న పోలీసు అధికారులందరిపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కోడెలపై ఇప్పుడు పెట్టిన రౌండ్‌టేబుల్ సమావేశం ఆయన ఎన్నికైన మూడు నెలలకే నిర్వహించాల్సిన పరిస్థితి ఉందన్నారు. గత పదేళ్ల కాలంలో నమోదు కాని కేసులు, కోడెల స్పీకర్ అయ్యాక మూడు నెలలకే ప్రత్యర్థులపై నమోదు చేయించారని తెలిపారు. లక్కరాజుగార్లపాడులో తనకు ఓటు వేయలేదని ఇళ్లు ధ్వంసం చేసి అక్రమ కేసులు నమోదు చేశారన్నారు. పార్కు ఏరియాలో అపార్టుమెంట్ నిర్మాణం చేపడుతుంటే అధికారుల ద్వారా పనులు ఆపించి ముడుపులు సెటిల్ చేయించుకున్నారని వివరించారు. దాదాపు 67 ఎకరాలు కబ్జా చేశారని పేర్కొన్నారు. సొంత పార్టీ నేతలను కూడా తీవ్ర వేధింపులకు గురి చేశారని తెలిపారు.
కోడెలకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కోడెలకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదన్నారు. ప్రజలను, వ్యవస్థలను భయపెట్టడం, కులాలను, వర్గాలను, ముఠాలను, ప్రాంతాలను, రెచ్చగొట్టి అధికారంలోకి రావాలనే ఉద్దేశం గల వ్యక్తి అని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో సత్తెనపల్లి పట్టణం, సత్తెనపల్లి రూరల్ టీడీపీ గెలుచుకోగా, ముప్పాళ్ళ, రాజుపాలెం, నకరికల్లు మండలాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకున్నా దౌర్జన్యంగా పీఠం దక్కించుకున్నారని గుర్తుచేశారు. కోడెలకు ఫ్యాక్షనిస్ట్ అని ముద్ర ఉండేదని, ఇప్పుడు తీవ్ర అవినీతి పరుడిగానూ పేరొచ్చిందని దుయ్యబట్టారు. సత్తెనపల్లి, నరసరావుపేట మున్సిపల్ కార్మికులతో గుంటూరులో తమ మాల్ నిర్మాణ పనులు చేయించిన నీచ సంస్కృతి ఆయన కుటుంబానిదని ఎద్దేవా చేశారు. ఐదేళ్ల కోడెల దుర్మార్గ పరిపాలనను తరిమి కొట్టాలనే ఆలోచన అన్ని రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు రావడం శుభ పరిణామమన్నారు. కోడెల అరాచకాలపై న్యాయ విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
ప్రతి చెవికీ కోడెల దౌర్జన్యం చేరాలి
కోడెల దౌర్జన్యాలు, అవినీతిని ప్రతి చెవికీ చేరవేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు గద్దె చలమయ్య పిలుపునిచ్చారు. ఇసుక, మట్టి, భూములు దోచుకోవడమే కాక, అధికారుల నుంచి ప్రతినెలా మామూళ్లు వసూలు చేస్తున్నారన్నారని మండిపడ్డారు. సీపీఐ ఏరియా కార్యదర్శి నరిశేటి వేణుగోపాల్ మాట్లాడుతూ నెలకు రూ. 1.50 లక్షలు స్పీకర్ కార్యాలయానికి అలవెన్సుల రూపంలో డ్రా చేసుకుంటున్నారని, కానీ అక్కడ పనిచేసే స్వీపర్‌కు జీతం, పేపర్ బిల్లులు, మంచినీరు, కరెంటు బిల్లులు చెల్లించని పరిస్థితి నెలకొందని దుయ్యబట్టారు. పీసీసీ కార్యదర్శి మాదంశెట్టి వేదాద్రి మాట్లాడుతూ ప్రశ్నించేవారిని ప్రస్తుత పాలకులు నిర్భందిస్తున్నారని, పేదల స్థలాలను బలవంతంగా లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన స్పీకర్.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను టీడీపీ కొనుగోలు చేసినా నోరు మెదపలేదని అంబేడ్కర్ ప్రజాసంఘం జిల్లా అధ్యక్షుడు దావులూరి కోటేశ్వరరావు మండిపడ్డారు. ప్రతి నెలా అన్నా క్యాంటిన్ ద్వారా రూ. 2.25 లక్షల కోడెల కుమార్తె సేఫ్ కంపెనీకి మిగులుతున్నాయన్నారు.
బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది..
సత్తెనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ ఆతుకూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మంచినీరు సక్రమంగా అందని సత్తెనపల్లికి రూ. 4 కోట్లతో గెస్ట్ హౌస్‌లు నిర్మించి కమీషన్‌లు దండుకున్నారన్నారు. దేవదాయ భూమిని అప్పనంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని భవనం నిర్మించుకున్నారని దుయ్యబట్టారు. కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు గంజిమాల రవిబాబు మాట్లాడుతూ దేవరంపాడులో 50 ఎకరాల దళితుల భూములను టీడీపీకి చెందిన జానకి రామయ్య అక్రమంగా కొనుగోలు చేశాడని, అప్పట్లో తాము ఉద్యమించి కేసులు పెడితే వాటిని తొలగించేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. న్యాయవాది కొమ్మిశెట్టి సాంబశివరావు మాట్లాడుతూ సత్తెనపల్లి నియోజకవర్గానికి పట్టిన దరిద్రం కోడెల కుమారుడు శివరామ్ అన్నారు. కోడెల తన కొడుకుని అచ్చోసి వదిలేశాడన్నారు. భీమవరం గ్రామానికి చెందిన టీడీపీ నేత బలుసుపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ కోడెల వంటి వారికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. వెయ్యి గేదెలకు నీరు దొరికే ప్రాంతంలో డంపింగ్‌యార్డు ఏర్పాటు చేస్తున్న దుర్మార్గుడన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు వంకాయలపాటి శివనాగరాణి, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ నాగుర్ మీరాన్, సీపీఎం మండల కార్యదర్శి పెండ్యాల మహేష్, సీపీఐ పట్టణ మాజీ కార్యదర్శి మూసాబోయిన శ్రీనివాసరావు, న్యాయవాది కళ్ళం వీరభాస్కర్‌రెడ్డి, దివ్వెల శ్రీనివాసరావు, తదితరులు మాట్లాడారు. వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment