
సాక్షి, తాడేపల్లి : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ధ్వజమెత్తారు. దేవినేని రాజకీయ జీవితం ఎప్పుడో ముగిసిపోయిందని, ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై దేవినేని ఉమ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. ‘ఇసుక దందా చేస్తున్నారన్న ఆరోపణలను నిరూపించగలరా? ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. లేదంటే దేవినేని రాజకీయాలనుంచి తప్పుకుంటారా? అంటూ సవాల్ విసిరారు. గతంలో ఇసుక మాఫియాపైనే దేవినేని బతికారన్నారు. కృష్ణా జిల్లాలో దేవినేని అండతో డీగ్యాంగ్ విచ్చలవిడిగా దోచుకుందని ఆరోపించారు. గతంలో మైలవరం నియోజకవర్గంలో జరిగిన దోపీడీపై విచారణ జరిపిస్తామన్నారు.
రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా ఎక్కడా జరగడం లేదని స్పష్టం చేశారు. ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో 90 ఆవులు చనిపోయాయని, దానిని కూడా రాజకీయానికి వాడుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. గతంలో 28 గోవులు చనిపోయినప్పుడు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం గోశాల ఘటనపై విచారణ జరిపి.. మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment