సాక్షి, విజయవాడ: టీడీపీ నాయకులు తమ రాజకీయ భవిష్యత్ కోసం అమరావతి ప్రాంత రైతులను పావులుగా వాడుకుంటున్నారని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. అమరావతి రాజధానికి అనువైన ప్రాంతం కానప్పటికీ తాము పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా టీడీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న వాసిరెడ్డి పద్మ టీడీపీ తీరును ఎండగట్టారు. మూడు నాలుగు బిల్డింగ్‌లు కట్టి టీడీపీ నాయకులు ప్రచారాలతో ఊదరగొట్టారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అమరావతి ప్రాంత రైతులకు అన్ని విధాల న్యాయం చేస్తారని స్పష్టం చేశారు.
జీఎన్ రావు కమిటీ అన్ని జిల్లాలు పర్యటించి ప్రజాభిప్రాయాలను సేకరించిన తర్వాతే ప్రభుత్వానికి నివేదిక అందించిందని వాసిరెడ్డి పద్మ వివరించారు. గత టీడీపీ ప్రభుత్వం రాజధాని విషయంలో శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. చంద్రబాబు మాదిరి కాకుండా నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం చర్చించాకే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తుది నిర్ణయంతీసుకుంటారన్నారు. అంతేకాకుండా సీఎం జగన్ అన్ని విధానాలను చట్టబద్దంగానే అమలు చేస్తారని స్పష్టం చేశారు. తమకు న్యాయం చేస్తారనే నమ్మకంతోనే రాజధాని రైతులు వైఎస్ జగన్‌కు అధికార పట్టం కట్టారన్నారు.
ఆరు నెలల పాలనలో సీఎం జగన్ ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలను తీసుకున్నారని పేర్కొన్నారు. దిశ చట్టం, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, అమ్మఒడి, ఇళ్లపట్టాలు మహిళ పేరుతో ఇవ్వడం, వెయ్యి దాటిన ఆరోగ్య ఖర్చును ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవడం వంటి ఎన్నో బృహత్కరమైన పథకాలను ప్రారంభించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. రాష్ట్రానికి నష్టం కలిగించే విధానాలను సీఎం ఎట్టిపరిస్థితుల్లో తీసుకోరని స్పష్టం చేశారు. రాజధాని పేరుతో రాష్ట్రానికి నష్టం చేకూర్చుందిన టీడీపీ నాయకులే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని హైదరాబాద్ నుంచి హుటాహుటిన పారిపోయి ఇక్కడికి వచ్చిన నాయకుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో రాజధాని పేరుతో గ్రాఫిక్స్ చూపించారని, అరచేతిలో వైకుంఠం అన్న చందంగా పాలన సాగించారని విమర్శించారు. రాజకీయ పార్టీ అన్న తర్వాత ఒకే పాలసీ ఉండాలని, టీడీపీ మాదిరి రోజుకో పాలసీ ఉండకూడదని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment