సాక్షి, విజయవాడ : చంద్రబాబు నాయుడుకు పవన్ కల్యాణ్ తొత్తులా వ్యవహరిస్తున్నారంటూ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పదే పదే విమర్శలు చేస్తే ప్రజలు ఆదరిస్తారనే భ్రమలో పవన్ కల్యాణ్ ఉన్నారని మండిపడ్డారు. ఇసుక రవాణాకు సంబంధించి పవన్ చేసిన వ్యాఖ్యలను వెల్లంపల్లి తిప్పికొట్టారు. గత కొన్ని రోజులుగా భారీ వరద పోటెత్తడంతో 50 రోజులుగా ప్రకాశం బ్యారేజీ గేట్లు తెరిచే ఉన్నాయి. బ్యారేజ్‌లోకి వరద పోటెత్తుతుండడంతో ఇసుక ఎక్కడి నుంచి తీయాలో చెప్పాలని పవన్‌ను ప్రశ్నించారు.
ఇసుకను నాణ్యమైన ధరకు అందించేందుకు సీఎం కృషి చేస్తున్నారని, పథకాలు అందించే తరుణంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కానీ ఇవేమి పట్టించుకోకుండా పవన్ కల్యాణ్ ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. ప్రజలు కష్టాలు తెలిసిన వ్యక్తి రాష్ట్రానికి మంచి చేయాలని చూస్తుంటే అదే పనిగా విమర్శించడం తగదని హెచ్చరించారు. పవన్ అధికారం లేకుండా ఉండలేడని, అందుకే 2009లో చిరంజీవి అధికారంలోకి రాలేదని అర్థంతరంగా పార్టీలో నుంచి బయటకు వచ్చారని పేర్కొన్నారు. అలాగే చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో ఉండగా ఆయన తోక పట్టుకొని తిరిగారని వెల్లడించారు. ఇప్పుడు ఆయన దృష్టి కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వంపై పడిందని, ఎలాగైనా మోదీతో కలవాలని ప్రయత్నిస్తున్నారన్నారు. పవన్ చేస్తున్న నీచ రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
జగన్ పాలనను ఓర్వలేకే విమర్వలు: మల్లాది విష్ణు
సీఎం జగన్ నాలుగు నెలల పాలనను ఓర్వలేకే పవన్ కల్యాణ్, బుద్దా వెంకన్న అక్కసు వెళ్లగక్కుతున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. ఇసుకు కొరత గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న పవన్ ఒకసారి ప్రకాశం బ్యారేజీ సందర్శించాలని సూచించారు. గత ఐదేళల్లో టీడీపీ హయాంలో విచ్చలవిడిగా ఇసుక దోపిడి జరిగితే ఒక్కసారి కూడా స్పందించని పవన్ ఇప్పుడు మాత్రం పనిగట్టుకొని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై ఒక్కసారి కూడా నోరు మెదపని పవన్ కల్యాణ్ ఈ అంశంపై కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment