
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఉప ముఖ్యమంత్రులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ చేసిన ఆరోపణలను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఖండించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందు మతాన్ని కన్నా లక్ష్మీనారాయణ రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. ఎక్కడో చిన్న ఘటనలు జరిగితే వాటిని ప్రభుత్వానికి అంటగడుతున్నారని మండిపడ్డారు. కాగా నెల్లూరు జిల్లా రథం కాల్చివేసిన ఘటనపై చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. దేవాలయాలు ఎవరూ కూలదోసిన వారిపై చర్యలు తప్పవన్నారు. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని మంత్రి హెచ్చారించారు.
ఏపీ గవర్నర్‌ను కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
కాగా.. గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కరాల్లో వేల కోట్ల రూపాయలను దోచుకున్నప్పుడు, విజయవాడలో దేవాలయాలను కూల్చివేసినప్పుడు.. కన్నా ఏమైపోయారని మంత్రి ధ్వజమెత్తారు. బీజేపీని కన్నా తెలుగుదేశం జనతా పార్టీగా మార్చివేశారని.. దానికి అధ్యక్షుడిగా సుజనా చౌదరి పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, సుజనా చౌదరిల డైరెక్షన్‌లో ఆయన పని చేస్తున్నారని విమర్శించారు. అమరావతిలో సదావర్తి భూములను దోచుకుంటే ఆయన ఎందుకు ప్రశ్నించ లేదన్నారు. ఎన్నికల సమయంలో బీజేపీ తన మేనిఫెస్టోలో అమరావతి భూములను వెనక్కి తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించిందని, ఇప్పుడు ఆ మేనిఫెస్టో కన్నాకు కనిపించడం లేదా అని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment