సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభలో బుధవారం ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఎంపీ రేణుకా చౌదరిలు ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకున్నారు. ఈ క్రమంలో రేణుకను కాస్త తగ్గాలంటూ వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
విషయం ఏంటంటే... రేణుకా చౌదరి రాజ్యసభ సభ్యత్వం త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలో జరిగిన వీడ్కోలు ప్రసంగం సందర్భంగా రేణుక మాట్లాడుతూ... ‘అప్పట్లో నేను చాలా బరువుగా ఉండేదాన్ని. అప్పటి నుంచే ఆయనకు(వెంకయ్యను ఉద్దేశించి) నేను తెలుసు. చాలా మంది నా బరువు గురించి బాధపడుతుంటారు. కానీ సార్, మీరు చైర్మన్ పదవిలో ఉన్నారు. కాబట్టి.. మీ బరువును అందరి మీద రుద్దండి(సక్రమంగా అధికారాన్ని వినియోగించండి అన్న అర్థం వచ్చేలా) అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.
దీనికి వెంటనే స్పందించిన వెంకయ్య రేణుకకు కౌంటర్ ఇచ్చారు. ‘మీకు నాదో చిన్న సలహా. ముందు మీ బరువు తగ్గించుకోండి. ఆపై మీ పార్టీ బరువు పెరిగేలా కృషి చెయ్యండి’ అంటూ పేర్కొన్నారు. దానికి బదులుగా రేణుకా... ‘కాంగ్రెస్ పరిస్థితి బాగానే ఉంది’ అని అన్నారు. అయితే ఇద్దరి మధ్య జరిగిన ఈ వాదన సరదాగానే ఉండటంతో సభలో నవ్వులు వెల్లివిరిశాయి.
గత నెల ప్రధాని నరేంద్ర మోదీ రేణుక చౌదరి నవ్వును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇక వీడ్కోలు ఉపన్యాసంలో ఆమె.. పెద్దల సభతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆ అంశాన్ని కూడా గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment