
రాజ్యసభలో ప్రసంగం
రాష్ట్రపతి పదవి కావాలని తాను ఎప్పుడూ కోరుకోలేదని వెంకయ్య నాయుడు చెప్పారు. పదవుల్లో లేకపోయినా ప్రజలతో సంబంధాలు కొనసాగిస్తూనే ఉంటానని తెలిపారు. సోమవారం రాజ్యసభలో తన వీడ్కోలు కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడారు.
చట్టసభలో అర్థవంతమైన చర్చలు, సంవాదాలు జరగాలని ప్రజలు ఆశిస్తారని గుర్తుచేశారు. అంతేతప్ప ఆందోళనలు, గొడవలు, అంతరాయాలను కోరుకోరని చెప్పారు. సభ గౌరవాన్ని కాపాడేందుకు సభ్యులంతా కృషి చేయాలని సూచించారు. సభలో ఉన్నప్పుడు మర్యాదగా నడుచుకోవాలన్నారు. ఉన్నత ప్రమాణాలను అనుసరించాలన్నారు. పదవీ విరమణ తర్వాత ఇంటికే పరిమితం కాబోనని, అన్నిచోట్లా తిరుగుతూ అందరితో భిన్న అంశాలపై మాట్లాడుతూనే ఉంటానని వెంకయ్య స్పష్టం చేశారు.
రాజ్యసభపై గొప్ప బాధ్యతలు ఉన్నాయని, ఈ విషయాన్ని సభ్యులంతా సదా గుర్తుంచుకోవాలని హితవు పలికారు. పార్లమెంట్ చక్కగా పని చేయాలన్నదే తన ఆకాంక్ష అని వివరించారు. రాజ్యసభ చైర్మన్‌గా సభ గౌరవాన్ని కాపాడేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నించానని, అందరికీ మాట్లాడేందుకు అవకాశం ఇచ్చానని వెల్లడించారు. బీజేపీకి రాజీనామా చేసినప్పుడు తన కళ్లలో నీళ్లు తిరిగాయని అన్నారు.