
సాక్షి, న్యూఢిల్లీ : 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని అఖండ విజయం సాధించిన బీజేపీ రెండోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ రేపు (మే 30, గురువారం) కొలువుదీరనుంది. ప్రధానిగా మోదీతోపాటు మరికొంతమంది కీలక నేతలుగా గురువారం రాత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ, జాతీయ ప్రముఖ నాయకులతోపాటు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు ఈ వేడుకకు ఆహ్వనాలు అందుకున్నారు. అంతేకాదు బిమ్‌స్టెక్ (బంగ్లాదేశ్, భారతదేశం, మయన్మార్, శ్రీలంక, థాయ్‌లాండ్, నేపాల్, భూటాన్) సభ్య దేశాల నాయకులు కూడా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 7 గంటలకు ఆరంభమవుతుంది.
విదేశీ అతిధులు
బంగ్లాదేశ్ అధ్యక్షుడు, అబ్దుల్ హమీద్
శ్రీలంక అధ్యక్షుడు, మైత్రిపాల సిరిసేన
కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షుడు సూరోన్‌బె జీన్‌బెకేవ్
మయన్మార్ అధ్యక్షుడు యూ విన్ మింట్
మారిషస్ ప్రధాన మంత్రి ప్రవీంద్ కుమార్ జుగ్నౌత్
నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి
భూటాన్ ప్రధాన మంత్రి డాక్టర్ డాక్టర్ లోటే శెరింగ్
థాయ్‌లాండ్ ప్రత్యేక రాయబారి గ్రిసాద బూన్‌రాక్
అయితే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా మూడుదేశాల పర్యటనలో ఉన్న కారణంగా ఆమె ఈ కార్యక్రమాన్ని మిస్ అవుతున్నారు. 2014లో మొదటిసారి మోదీ ప్రమాణస్వీకారం చేసినప్పుడు 5వేల మంది అతిథులు హజరు కాగా ఈసారి దేశ విదేశాల నేతలతో పాటు 8వేల మంది అతిథులు రానున్నారని తెలుస్తోంది.
దేశీయ అతిధులు: యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతోపాటు, ఇతర కాంగ్రెస్ నేతలు, ప్రతిపక్షనేతలు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ ముఖ‍్యమంత్రి పదవిని చేపట్టబోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా (ఉదయం ప్రమాణం స్వీకారం అనంతరం ఏపీ సీఎం హోదాలో) ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్నారు.
వేదిక : ఫోర్‌కోర్ట్: దర్బార్ హాల్‌కు బదులుగా వరుసగా నాలుగవసారి కూడా రాష్ట్రపతి భవన్‌లోని ఫోర్‌కోర్ట్‌లో ఈ వేడుకను నిర్వహించనున్నారు.
అతిథుల కోసం ఈ సారి ప్రత్యేక వంటలను సిద్ధం చేస్తున్నారట. భారతీయ సంప్రదాయ వంటలతో పాటు పాశ్చత్య వంటకాలను కూడా వడ్డించనున్నట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు చెబుతున్నాయి.
స్నాక్స్ : శాకాహారం. సమోసాలు, రాజ్‌భోగ్, లెమన్ టార్ట్స్, టీ.
విందు: మాంసాహారంతో పాటు శాకాహారం భోజనం. ముఖ్యంగా దాల్ రైసినా ప్రధాన ఆకర్షణ కానుందట. ఈ ప్రత్యేక వంటకాలు తయారు చేయడానికి 48 గంటలు పడుతుందట. ఈ నేపథ్యలోనే ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.
కాగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ) భారీ మెజార్టీతో విజయం సాధించింది. 542 స్థానాలకుగాను పార్టీ 352 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. మోదీ క్యాబినెట్‌లో ఈసారి ఎవరెవరికి బెర్త్ దక్కుతుందనేది చర్చనీయాంశంగా మారింది. ముఖ‍్యంగా కీలకమైన ఆర్థికమంత్రి పదవి ఎవరికి దక్కుతుందనేది హాట్ టాపిక్. ఊహించినట్టుగా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్య కారణాల రీత్యా తనకు మినహాయింపు నివ్వాల్సిందిగా ప్రధానికి లేఖ రాయడంతో ఈ వేడి మరింత పెరిగింది.