సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్‌ఏ సంపత్‌కుమార్‌లను శాసనసభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానాన్ని రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీల్ దాఖలు చేసేందుకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు అనుమతినివ్వాలా?వద్దా? అన్న అంశంపై హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించనున్నది. సోమవారం ఉదయం 10.30 గంటలకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. మండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై హెడ్‌ఫోన్ విసిరి గాయపరిచారంటూ కోమటిరెడ్డి, సంపత్‌లను సభ నుంచి బహిష్కరిస్తూ ప్రొసీడింగ్స్ జారీ అయ్యాయి. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు ఖాళీ అయినట్లు నోటిఫికేషన్ కూడా విడుదలైంది.
ఈ ప్రొసీడింగ్స్‌ను, నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ వెంకటరెడ్డి, సంపత్‌లు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ శివశంకరరావు ప్రొసీడింగ్స్‌ను, నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ ఏప్రిల్ 17న తీర్పు ఇచ్చారు. జస్టిస్ శివశంకరరావు తీర్పును సవాల్ చేస్తూ 12 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి ఎదుట దాఖలైన వ్యాజ్యంలో ఈ ఎమ్మెల్యేలు ప్రతివాదులు కాదు.. అందువల్ల సంబంధం లేని వ్యక్తులు అప్పీల్ దాఖలు చేయాలంటే కోర్టు అనుమతినివ్వాలి. ఈ నేపథ్యంలో వారు అప్పీల్ దాఖలుకు కోర్టు అనుమతి కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం అప్పీల్ దాఖలుకు అనుమతినివ్వాలా? లేదా? అన్న దానిపై విచారణ ప్రారంభించింది.
ఎమ్మెల్యేల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్, కోమటిరెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి తీర్పుపై స్పీకర్ లేదా అసెంబ్లీ కార్యదర్శి అప్పీలు దాఖలు చేయాలనడం సరికాదని, నిబంధనల ప్రకారం థర్డ్ పార్టీ కూడా అప్పీల్ దాఖలు చేయవచ్చని వైద్యనాథన్ వివరించారు. కోమటిరెడ్డి, సంపత్‌లను బహిష్కరిస్తూ చేసిన తీర్మానంలో ఈ ఎమ్మెల్యేలు కూడా పాలుపంచుకున్నారని, సభా గౌరవాన్ని కాపాడేందుకు ఎవరైనా కోర్టుకు రావొచ్చన్నారు. ఈ వాదనలను తోసిపుచ్చిన సింఘ్వీ.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అప్పీల్‌కు విచారణార్హతే లేదన్నారు. సింగిల్ జడ్జి తీర్పుపై అభ్యంతరం ఉంటే అసెంబ్లీకి ఉండాలి కానీ, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఏం సంబంధం ఉందని అప్పీల్ దాఖలు చేశారని ప్రశ్నించారు. వాదనలు విన్న ధర్మాసనం మే 2న తీర్పును వాయిదా వేసింది.
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అప్పీల్‌పై 4న తీర్పు
Published Sat, Jun 2 2018 12:47 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment