
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా చంద్రబాబును హుందాగా ఆహ్వానిస్తే.. దానికి వేరే కథలు అల్లి మీడియాలో రాయించుకోవడం సరికాదని, చంద్రబాబు అసలు మారరని రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ అత్యున్నతమైన సంప్రదాయాన్ని పాటించి, స్థానిక, జాతీయ నేతలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఫోన్ ద్వారా ఆహ్వానించే సమయంలో తాను ఆయన పక్కనే ఉన్నానని చెప్పారు. చంద్రబాబుకు కూడా తనముందే ఫోన్ చేశారన్నారు. అయితే, చంద్రబాబు అనుభవం, సలహాలు అవసరం అనే మాటలు వైఎస్ జగన్ వాడలేదని సాయిరెడ్డి బుధవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. చంద్రబాబు తీరుపై ఆయన కిందివిధంగా ట్వీట్లు చేశారు.
‘ప్రమాణ స్వీకారానికి జగన్ గారు హుందాగా ఆహ్వానిస్తే దానికి వేరే స్టోరీ అల్లి మీడియాలో రాయించుకుంటావా? మీ సలహాలు అవసరం, మీరు అనుభవజ్ఞులు అని.. ఆయన అనని మాటలు పుట్టిస్తారా? మీ అనుభవం దోచుకోవడానికి మాత్రమే ఉపయోగించావని గ్రహించే యువనేతకు పట్టం కట్టారు ప్రజలు. నువ్వు మారవా బాబూ..’ అని ప్రశ్నించారు.
మరో ట్వీట్‌లో.. ‘జగన్ గారు అత్యున్నత సంప్రదాయాన్ని పాటించి స్థానిక/జాతీయ నేతలు, ఇతర రాష్ట్రాల సీఎంలను ఫోన్ ద్వారా ఆహ్వానించే సమయంలో నేను పక్కనే ఉన్నా. మీకూ నా ముందే ఫోన్ చేశారు. కానీ.. ఆయన మీ అనుభవం, సలహాలు అవసరం అనే మాటలే వాడలేదు. ఆయన అనని మాటల్ని అన్నట్టు ప్రచారం చేసుకునేంత నీచానికి చంద్రబాబు దిగారు’ అని విమర్శించారు.
ప్రజల ఆగ్రహం వల్ల ఓడిపోలేదట
‘ప్రజల ఆగ్రహం వల్ల ఓడిపోలేదట. సానుభూతి వల్లనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని తేల్చాడు రాజకీయ మ్యానిప్లేటర్ చంద్రబాబు. కిందపడ్డా నేనే గెలిచా అన్నట్టుంది ఆయన వాలకం. గెలిచిన పార్టీకి 50 శాతం ఓట్లు పడిన చరిత్ర ఉందా. దీన్ని సింపథీ అంటారా? మానసిక స్థితి ఇంకా దిగజారినట్టుంది.’
‘23 సీట్లకు పతనమైన తర్వాత అయినా పరివర్తన వస్తుందనుకుంటే ఇంకా మీకు రాలేదేంటి బాబూ. అనుకూల మీడియా ఉందని మీ కలలు, ఊహలన్నిటిని రాయించుకుని తృప్తి పడుతున్నారా? జూన్ 8 వరకు పదవీ కాలం ఉందని ఇంకా నమ్ముతున్నారా ఏంటి ఖర్మకాలి..’
‘దేనిలో అనుభవజ్ణుడివి చంద్రబాబూ? కుట్ర, కుతంత్రాలు, వెన్నుపోటు, నయవంచన, ప్రజాధనాన్ని లూటీ చేయడంలో తప్ప మీకు ఎందులో అనుభవం ఉంది బాబూ. చిత్తుగా ఓడిన తర్వాత కూడా అబద్ధాలతో ఆత్మవంచన చేసుకుంటున్నావు. మీ సలహా విన్న వారంతా ఏమయ్యారో తెలిసి కూడా మిమ్మల్ని అడుగుతారా బాబూ? మీ పిచ్చిగాని...’
దేవతలనూ వదల్లేదేమి చంద్రబాబూ...
‘విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్నీ చంద్రబాబు ప్రభుత్వం దివాలా తీయించింది. అమ్మవారి పేరన రూ.140 కోట్ల డిపాజిట్లు ఉండగా స్థల సేకరణ, విస్తరణ పనుల పేరుతో రూ.122 కోట్లు కొల్లగొట్టారు. ప్రస్తుతం రూ.18 కోట్లు మాత్రమే మిగిలాయి. దేవతలను కూడా వదిలిపెట్టలేదేమి చంద్రబాబూ!’ అని ఇంకొక ట్వీట్‌లో విజయసాయిరెడ్డి నిలదీశారు.