‘అవినీతికి మారుపేర్లుగా నిప్పు నాయుడు, పప్పు నాయుడు’ | Vijayasai Reddy Slams CM Chandrababu Naidu On Corruption | Sakshi
Sakshi News home page

‘అవినీతికి మారుపేర్లుగా నిప్పు నాయుడు, పప్పు నాయుడు’

Published Thu, May 3 2018 8:43 PM | Last Updated on Thu, Aug 9 2018 2:42 PM

Vijayasai Reddy Slams CM Chandrababu Naidu On Corruption - Sakshi

సంఘీభావ యాత్రలో మాట్లాడుతున్న విజయసాయిరెడ్డి

సాక్షి, విశాఖపట్నం: గత నాలుగేళ్ల పాలనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌లు 3 లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, అన్ని వర్గాలను టీడీపీ సర్కార్ మోసం చేసిందంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. నిప్పు నాయుడు-పప్పు నాయుడు ఇద్దరూ అవినీతికి మారుపేరుగా నిలిచారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావంగా.. విశాఖ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి జిల్లాలో రెండో రోజు పాదయాత్ర చేశారు. విశాఖపట్నం జిల్లా మల్కాపూరంలో మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపట్నానికి సంబంధించి పలు అంశాలను పార్లమెంట్లో లెవనెత్తి వాటిని పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేశానన్నారు. ఇక్కడ కాలుష్యం వెదజల్లుతున్నటువంటి కొన్ని సంస్థలున్నాయని, తాము పరిశ్రమల అభివృద్ధికి వ్యతిరేకం కాదన్నారు. కానీ అభివృద్ధితో పాటు కాలుష్యాన్ని నివారించే చర్యలు తీసుకోవాలన్నదే వైఎస్ జగన్ ఉద్దేశమని తెలిపారు.

పారిశ్రామిక వాడలోని ప్రజల స్థితిగతులు అంతంత మాత్రమే. వాయు, జల, శబ్ధ కాలుష్యాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఉద్యోగావకాశాల కోసం ఏ పరిశ్రమ ఇక్కడ స్థాపించినా.. 75 శాతం స్థానికులకే ఉద్యోగం అని చెప్పారు. పాటించి చూపించిన వ్యక్తి మహానేత వైఎస్సార్. స్థానిక ఎమ్మెల్యే అవినీతితో సొమ్మును ఆర్జించాలి, ధనవంతుడు ఎలా కావాలన్నదానిపై దృష్టి సారించారు. పరిస్థితులు మారాలంటే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావాలి. సంఘీభావ యాత్రలో ఓ విషయం స్పష్టమైంది. కొండ వాలు ప్రాంతంలో రోడ్లు ఇరుకిరుకిరుకుగా ఉన్నాయి. కొండ చరియలు విరిగిపడే అవకాశాలున్నాయి. ఈ నియోజకవర్గాన్ని గత నాలుగేళ్లుగా ఎమ్మెల్యే పట్టించుకోలేదు. 

ఒక్క ఇళ్లయినా కట్టిచ్చారా?
గత నాలుగేళ్లుగా అధికారంలో ఉన్న చంద్రబాబు ఒక్క ఇళ్లు కూడా కట్టించిన పాపాన పోలేదు. కేవలం పచ్చ తమ్ముళ్లకే ఆయన లబ్ధి చేకూర్చారు. ఏపీలో విశాఖలోనే అధిక కుంభకోణాలు జరిగాయి. అప్పట్లో ఎకరా 850 రూపాయలకు ప్రభుత్వానికి ఇచ్చారు. ఈరోజు హిందుస్తాన్ షిప్‌యార్డును ప్రైవేట్ సంస్థకు చంద్రబాబు కట్టబెట్టగా, ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. కానీ గతంలో షిప్‌యార్డ్ నష్టాల్లో కూరుకుపోయిందని గ్రహించిన వైఎస్సార్ దాన్ని రక్షణశాఖకు అప్పగించి లక్షల మంది ఉద్యోగాలు కాపాడారు. వైఎస్సార్ అందించిన జనరంజకమైన పాలన మళ్లీ రావాలంటే జననేత వైఎస్‌ జగన్‌ను సీఎం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రాష్ట్రంలో రాక్షసపాలన.. అవినీతి పాలన.. 
ఏపీలో గత నాలుగేళ్లుగా 3 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్‌లు అన్ని విభాగాల్లోనూ అవినీతికి పాల్పడ్డారు. నిప్పు నాయుడు-పప్పు నాయుడు ఇద్దరూ అవినీతికి మారుపేరుగా నిలిచారు. పరమక్రూరుడైన జర్మనీ నియంత హిట్లర్ పుట్టినరోజే (ఏప్రిల్ 20న) చంద్రబాబు పుట్టారు. రెండో ప్రపంచ యుద్ధంతో పాటు లక్షల మంది మృతికి కారమైన హిట్లర్‌లా.. నేడు చంద్రబాబు వ్యవరిస్తున్నారు. హిట్లర్ మంత్రి వర్గంలో జోసెఫ్ గోబెల్స్ అనే వ్యక్తి పనిచేసేవారు. అబద్దాలను నిజాలుగా ప్రచారం చేయడమే ఆయన బాధ్యత. ఆ హిట్లర్-గోబెల్స్ ఇద్దరూ ప్రస్తుతం చంద్రబాబులో పరకాయ ప్రవేశం చేశారని అనుమానం కలుగుతోంది. తన సామాజిక వర్గానికి తప్ప, ఎవరికీ ప్రయోజం చేకూర్చని వ్యక్తి చంద్రబాబు అంటూ విజయసాయిరెడ్డి విమర్శించారు.

ఎన్నికల కోసం దొంగసొమ్ము దాచిన చంద్రబాబు
ఇక్కడ ఏపీలో డబ్బులు లేకుండా పోయాయని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఎందుకు డబ్బుల్లేవ్ అంటే.. దానిక్కూడా వైఎస్సార్‌సీపీనే కారణమంటూ అనవసర ఆరోపణలు చంద్రబాబు చేస్తున్నారు. నిజం ఏంటంటే.. కేంద్రం నుంచి డబ్బులు రాగానే.. కేవలం తన పార్టీకి, తన వ్యక్తిగత లబ్ధి చేకూర్చే అంశాలకు ఖర్చు చేయడం వల్లే ఏటీఎంలు, బ్యాంకులల్లో డబ్బులు లేకుండా పోయాయి. ఆర్బీఐ వద్ద కూడా 500, 2000 రూపాయల నోట్లు లేవు. అవి ఎక్కడకి పోయాయంటే కేవలం చంద్రబాబు వ్యక్తిగత ఖజానాలోకి పోయాయి. రాబోయే ఎన్నికల తాను దాచిన దొంగసొమ్మును చంద్రబాబు ఖర్చుపెట్టనున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.

బీసీలకు చంద్రబాబు హయాంలో అన్యాయయే
ఒక్కో ఓటుకు 5 వేల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్వయంగా చంద్రబాబే చెప్పిన విషయాన్ని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. జ్యోతిబాపూలే జయంతి రోజు చంద్రబాబు వ్యాఖ్యలు మాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. బీసీలంటే తనకెంతో ప్రేమ అని చంద్రబాబు కబుర్లు చెబుతారు. అయితే బీసీ క్లాస్ వాళ్లు ఎప్పుడూ బాగుపడలేదు. ఎందుకంటే.. ఏపీ సీఎం దృష్టిలో బీసీ క్లాస్ అంటే.. బ్యాక్‌వర్డ్ క్లాస్ కాదని, బాబుగారి క్లాస్ మాత్రమేనని చెప్పారు. బీసీ కార్పొరేషన్‌కు ప్రతి ఏడాది 10 వేల కోట్లు ఇస్తానన్నారు. ఈ నాలుగేళ్లలో బీసీ కమిషన్, కార్పొనేషన్లకు ఎంత ఇచ్చారని చంద్రబాబును ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమం రాగానే ఏదో కంటి తుడుపు చర్యగా కొంత కేటాయించారు. వైఎస్సార్ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మెస్ ఛార్జీలు, ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చేవారు. ఓసీ విద్యార్థులకు సైతం ఫీజు రీయింబర్స్ సదుపాయం కల్పించిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుంది. కానీ చంద్రబాబు ఏం చేశారంటే కేవలం నారాయణ సంస్థలకు తోడ్పాడు అందించడం తప్ప, ఇంకేం చేయలేదు.

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే..
'వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాట్లు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని వైఎస్ జగన్ ఇదివరకే హామీ ఇచ్చారు. దళిత గిరిజనులకు ఇళ్ల పట్టాలు ఇస్తాం. నవంబర్ 6వ తేదీన ప్రజాసంకల్పయాత్ర పేరుతో జూలైలో ప్రకటించిన నవరత్నాలుపై ప్రజల అభిప్రాయలు, సలహాలు, సూచనలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టారు. ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. యూపీఏ ఇవ్వకపోతే తామిస్తామంటూ బీజేపీ ప్రకటించింది. కానీ నాలుగేళ్లు గడిచినా ఎన్డీఏ సర్కార్ ఇప్పటికీ హోదా ఇవ్వకుండా ఏపీ ప్రజలను మోసం చేస్తోందంటూ' వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement