
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలంగాణలో మావోయిస్టులకు చోటు లేదనటం సరికాదని, అణిచివేత ఉన్నచోట తిరుగుబాటు ఏర్పడుతుందని కాంగ్రెస్ స్టార్ కాంపైనర్ విజయశాంతి వ్యాఖ్యానించారు. గురువారం ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారామె. వరంగల్ బిడ్డలు శృతి, సాగర్‌ల రాక్షసత్వ హత్యలకు ఇప్పటికీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం వద్ద సమాధానం లేదని అన్నారు. చంపటం తప్పేనని, అయితే ప్రభుత్వాలకు ఆ విషయంలో మినహాయింపు లేదని స్పష్టం చేశారు. సమస్యను సామాజిక, ఆర్థిక కోణంలో కాకుండా శాంతి భద్రతల అంశంగా పరిగణించినంత వరకు పరిస్థితులు ఇలాగే ఉంటాయనేది చరిత్ర చెబుతున్న సత్యంగా పేర్కొన్నారు.
చర్చలే సరైన శాశ్వత పరిష్కారమని, ఆ దిశగా ప్రయత్నించటం నిజంగా ప్రజాహితమన్నారు. మెదక్ పార్లమెంట్‌లోని సిద్దిపేట మినహా వేరే ఏ అసెంబ్లీ సీటు కూటమిలో ఇస్తే పార్లమెంట్ సీటు గల్లంతు అవుతుందని అన్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు తప్ప కూటమి అభ్యర్థులు గెలిచే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఏ పరిస్థితిలోనూ కూటమికి ఇస్తే అంగీకరించే పరిస్థితి లేదని ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment