
మంథని: పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అవినీతిపరులు.. ఉద్యమద్రోహులను పెంచి పోషించారని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో పార్టీ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. తెలంగాణ వస్తే 4 కోట్ల మంది ప్రజలు అభివృద్ధి చెందుతారనుకుంటే కేవలం కేసీఆర్ కుటుంబమే లబ్ధి పొందిందన్నారు. కేసీఆర్ దొర బుద్ధి చూపి అందరినీ మోసం చేశారని ఆరోపించా రు. సీఎంగా రోజుకు 12 నుంచి 18 గంటలు పనిచేయాల్సిన కేసీఆర్ ఫాంహౌస్‌లోనే ఎక్కువకాలం కూర్చున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రజలను బాంచన్ కాళ్లుమొక్కుతా అనిపించాలని చూస్తున్నారని అన్నారు.
ఆత్మగౌరవం ఉన్న తెలంగాణ బిడ్డలు దొరను బయటకు పంపుతారు కానీ అలా చేయరన్నారు. అక్కడ మోదీ... ఇక్కడ కేడీ ఇద్దరూ చీకటి ఒప్పందం చేసుకుని ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ను ఎవరో శాసిస్తారని ప్రచారం చేస్తున్నారని, ఆ ధైర్యం ఎవరికీ లేదన్నారు. రాహుల్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ యువతకు పెద్దపీట వేస్తుందన్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుం కుమార్, మాజీ మంత్రి డి.శ్రీధర్‌బాబు, వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment