
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే రాజకీయ అవినీతి తగ్గిందని కరీంనగర్ లోక్‌సభ సభ్యుడు బి.వినోద్‌కుమార్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై, టీఆర్‌ఎస్‌పై బీజేపీ నేత రాంమాధవ్ చేసిన విమర్శలను ఆయన ఖండించారు. వినోద్‌కుమార్ తెలంగాణ భవన్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడారు.‘కేసీఆర్ సర్కారుపై బీజేపీ నేత రాంమాధవ్ చేసిన ఆరోపణలు ఖండిస్తున్నాం. దేశంలో ఎక్కువ అవినీతి రాష్ట్రం తెలంగాణ అని విమర్శించడం సరికాదు. 73 శాతం సంక్షేమ పథకాలు ప్రజలకు చేరలేదన్న ఆయన వ్యాఖ్యలు శోచనీయమని చెప్పారు.
గతంలో ఇండియా షైనింగ్ అంటూ వాజ్‌పేయి, నరేంద్రమోదీ ముందస్తు ఎన్నికలకు వెళ్లలేదా? ప్రధానమంత్రి మోదీ కూడా రేస్‌కోర్స్ రోడ్డులోని ప్రధాని నివాసంలోనే అందరినీ కలుస్తారు. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కార్యాలయం 24 గంటలు పనిచేస్తోంది. రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో రాజకీయ అవినీతి చాలావరకు తగ్గింది. కాంగ్రెస్, బీజేపీ దేశంలోని ప్రాంతీయ పార్టీలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయి. కేంద్ర మంత్రులు మేనకాగాంధీ, హర్షవర్ధన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, చౌదరి బీరేంద్రసింగ్ తెలంగాణ ప్రగతిని అభినందించారు.
రాంమాధవ్ విమర్శలు పునరావృతం కావద్దు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బ్రహ్మాండంగా విజయం సాధిస్తుంది. దేశంలో అవినీతికి తావులేకుండా పరిపాలన సాగిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్. కాంగ్రెస్, బీజేపీల ద్వంద్వ వైఖరి ప్రజలు గమనిస్తున్నారు. ఇది ప్రాంతీయ పార్టీల కాలం. రానున్న రోజుల్లో జాతీయ పార్టీలకు కష్టాలు తప్పవు. కాంగ్రెస్, బీజేపీ డ్రామాలను, తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మరు. కాంగ్రెస్ బోఫోర్స్ అయితే బీజేపీ రాఫెల్స్ అంటూ లవ్ ఈచ్ అదర్‌లా తయారయ్యాయి’అని వినోద్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment