
సమావేశంలో మాట్లాడుతున్న సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, పక్కన ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, శంబంగి, అలజంగి తదితరులు
సాక్షి, విజయనగరం: ప్రతీ పేద విద్యార్థి ఓ శాస్త్రవేత్తగా, ఓ ఇంజినీరుగా, ఓ మేధావిగా ఉన్నతస్థానంలో చూడాలన్న ఉత్తమ సంకల్పంతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ బడుల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్లమాధ్యమంలో బోధనకు శ్రీకారం చుట్టారని జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టలేకపోయానన్న ఓర్వలేనితనంతో బురద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. విజయనగరంలోని ప్రదీప్‌నగర్‌లో మంగళవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో సాలూరు, గజపతినగరం, బొబ్బిలి, పార్వతీపురం ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, అలజంగి జోగారావు మాట్లాడారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ల వాఖ్యలపై ధ్వజమెత్తారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడికి మతి భ్రమించి మాట్లాడుతున్నారని, ఇసుక మాఫియాను నియంత్రించేందుకు వెళ్లి తహసీల్దార్ వనజాక్షిపై ధౌర్జన్యం చేసిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని ఆ పార్టీ క్యాడెర్‌కు చెప్పడం రౌడీయిజాన్ని ప్రోత్సహించడమే అవుతుందన్నారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ 5 కోట్ల మంది ఆంధ్రుల మన్ననలను అందుకుంటున్న సీఎంపై లేనిపోని వ్యాఖ్యలు చేయడం విచారకరమన్నారు. పచ్చమీడియాను అడ్డంపెట్టుకుని భాషకు, కులానికి లింక్‌పెట్టి మారణహోమాలు, విధ్వంసాలు సృష్టించేలా ప్రజలను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. ఉత్తర భారత దేశంలో ఉన్న వారంతా హిందీ లో మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు పొందుతుండగా... కేవలం తెలుగుపైనే ఆధారపడి చదువుతున్న ఆంధ్ర విద్యార్థులు ఇంగ్లిష్ భాషలో చదువుకుంటే తప్పేమిటో చెప్పాలన్నారు.
క్రిస్టియన్ దేశమైన లండన్‌లో చదువుకున్న రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ క్రిస్టియన్‌గా మారిపోయారా అంటూ ప్రశ్నించారు. తన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారని, తన భార్య పిల్లలు క్రైస్తవ మతంలో ఉంటూ చర్చికి వెలుతుంటారని పదే పదే చెబుతున్న పవన్‌కళ్యాణ్ మత వ్యాప్తిని ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నారనడం ఎంత వరకు సమంజసమన్నారు. పదవీ దాహంతో హిందువులు, క్రిస్టియన్‌ల మధ్య వివాదాలు రేపే వాఖ్యలు మానుకోవాలన్నారు. మనం లౌకిక భారతదేశంలో ఉన్నామన్న విషయాన్ని గ్రహించాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రొంగలి పోతన్న, వైఎస్సార్ సీపీ నాయకులు ఎంఎల్‌ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment