
ఎన్నికలకు వ్యతిరేకంగా దంతెవాడలో సోమవారం మావోయిస్టులు వేసిన పోస్టర్
సాక్షి, కొత్తగూడెం: ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో మాత్రం ఉద్రిక్తత నెలకొంది. ఈ రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలు మావోయిస్టు ప్రభావితమైనవి కావడంతో ఆందోళన నెలకొంది. తాజాగా మావోయిస్టులు సోమవారం దంతెవాడ జిల్లాలో ఎన్నికలను బహిష్కరించాలంటూ పోస్టర్లు, కరపత్రాలు విడుదల చేశారు. దీంతో రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఎప్పుడేం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్, నారాయణపూర్, కాంకేర్ జిల్లాల పరిధిలోని కొన్ని వందల కిలోమీటర్ల పరిధిలో మావోయిస్టులు జనతన సర్కార్ పేరిట సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. దీంతో ఈ సరిహద్దు జిల్లాల్లో నిరంతరం యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. పైగా ఎనిమిది నెలలుగా మావోయిస్టులు, భద్రతా బలగాల మద్య నిత్యం పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల సరిహద్దుల్లోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఉన్న దంతెవాడ, సుక్మా, బీజాపూర్, కాంకేర్, నారాయణపూర్, బస్తర్ జిల్లాల్లో వచ్చే నెల 12న పోలింగ్ జరగనుంది. దేశంలోనే వామపక్ష తీవ్రవాదం అత్యధికంగా ఉన్న ప్రాంతం కావడంతో ఈ జిల్లాల్లోని 18 నియోజకవర్గాలకు మొదటి విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.
అరకు ఘటన నేపథ్యంలో నేతల్లో దడ..
గత సెప్టెంబర్ 23న విశాఖపట్నం జిల్లాలో (ఆంధ్రా–ఒడిశా సరిహద్దు) డుంబ్రిగూడ పోలీసుస్టేషన్ పరిధిలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు హతమార్చిన విషయం విదితమే. కాగా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో రోజుల తేడాతో ఎన్నికలు జరుగుతుండడంతో మరింత టెన్షన్ నెలకొంది. స్వేచ్ఛగా ప్రచారానికి వెళ్లేందుకు రెండు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులకు అవకాశం లేకుండా పోయింది. సాధారణ రోజుల్లోనే ఈ ప్రాంతాల్లో పరిస్థితి గంభీరంగా ఉంటుంది. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 నియోజకవర్గాలు ఉండగా, తెలంగాణకు సరిహద్దుల్లో ఉన్న జిల్లాల్లోని 18 నియోజకవర్గాల్లో మాత్రమే మొదటి దశలో ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పోలింగ్ నిర్వహిస్తోంది.
ఈ నియోజకవర్గాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ప్రతిక్షణం ప్రమాదకర పరిస్థితే అనేలా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో పరిస్థితి అలా ఉంటే సరిహద్దుకు ఇటువైపు ఉన్న తెలంగాణలోనూ యుద్ధ వాతావరణమే ఉంది. భద్రాచలం నియోజకవర్గంలో మొత్తం 160 పోలింగ్ బూత్‌లు ఉండగా, అందులో 51 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక, కొత్తగూడెం, ఇల్లెందు నియోజకవర్గాల్లో మొత్తం 995 పోలింగ్ బూత్‌లు ఉండగా, వీటిలో 104 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. మరో 179 పోలింగ్ బూత్‌లు అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో, 344 పోలింగ్ బూత్‌లు సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నాయి. దీంతో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. భద్రాచలం, పినపాక, ఇల్లెందు నియోజకవర్గాల్లో, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ములుగు, పెద్దపల్లి జిల్లాలోని మంథని నియోజకవర్గాల్లోని బూత్‌లు అత్యధికం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉండటంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం చేయాల్సిన రాజకీయ పార్టీల నేతల్లో దడ నెలకొంది.
మోహరించిన మరిన్ని బలగాలు
మావోయిస్టుల అంశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం వెనక్కు తగ్గకుండా మరిన్ని బలగాలను మోహరించింది. దీంతో గత కొన్ని నెలలుగా మావోయిస్టులకు, బలగాలకు మధ్య ఎడతెరిపి లేని పోరు నడుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల సరిహద్దుల్లోని ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న మర్రిగూడెం, గొల్లపల్లి, కిష్టారం, పామేడు పోలీసుస్టేషన్ల పరిధిలో సీఆర్‌పీఎఫ్ క్యాంపులను ఏర్పాటు చేసింది. తెలంగాణలోని చెలిమెల, కలివేరు, గౌరారం, ఛత్తీస్‌గఢ్‌లోని తోగ్గూడెం(బీజాపూర్), పైడిగూడెం, వెలకనగూడెం, పాలోడి, పొట్కపల్లి (సుక్మా)ల్లో క్యాంపులను ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం వెనుకడుగు వేయకుండా మావోయిస్టులపై పోరుకు బలగాలను కదిలిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment