ఎన్డీయే నమ్మక ద్రోహం చేసింది | 'We revolted as Centre betrayed AP': CM | Sakshi
Sakshi News home page

ఎన్డీయే నమ్మక ద్రోహం చేసింది

Published Fri, Jul 6 2018 2:27 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

'We revolted as Centre betrayed AP': CM - Sakshi

సాక్షి, అమరావతి: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నమ్మకద్రోహం చేసిందని, ఏపీకి అన్నీ ఇచ్చేశామని సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిందని.. ప్రత్యేక హోదా అవసరంలేదని, రెవెన్యూ లోటు కూడా ఇచ్చేశామని తప్పుడు మాటలు మాట్లాడే పరిస్థితికి వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రంపై ధ్వజమెత్తారు.

ఎన్టీఆర్‌ గృహ నిర్మాణం పథకం కింద సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని విజయవాడ మునిసిపల్‌ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం ప్రారంభించి అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. మనం కూడా ఈ దేశంలో పౌరులం.. పన్నులు కడుతున్నాం.. అయినా మనల్ని ఆదుకోవడానికి కేంద్రం ముందుకు రావడంలేదన్నారు. రైల్వేజోన్, రాజధాని నిధులు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, పోర్టు నిర్మాణం ఏదీ చెయ్యడంలేదన్నారు. రాష్ట్రం కోసం బీజేపీతో పొత్తుపెట్టుకుంటే నిలువునా ముంచేశారని.. అందుకే ధర్మపోరాటం చేస్తున్నామన్నారు.

మన రికార్డు మనమే బ్రేక్‌ చేశాం
సొంత ఇంటిలో ఉంటే ఆనందం, భద్రత ఉంటుందని.. బాడుగ ఇంటిలో ఉంటే ఎప్పుడూ అద్దె అడుగుతారని భయంగా ఉంటుందని చంద్రబాబు అన్నారు. గత ఏడాది అక్టోబరు 2న లక్ష ఇళ్లకు గృహప్రవేశం చేశామని.. అదే రికార్డు అనుకుంటే ఇప్పుడు మన రికార్డును మనమే బ్రేక్‌ చేస్తూ ఈరోజు మూడు లక్షల ఇళ్లకు గృహ ప్రవేశం చేశామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మాటలు చెప్పారు కానీ ఇళ్లు కట్టలేదని విమర్శించారు. 14లక్షల 40వేల ఇళ్లు కడతామని చెప్పి కట్టకుండా రూ.4,150కోట్లు తినేశారని ఆరోపించారు.

కాగా, గతంలో లబ్ధిపొందిన వారికి తిరిగి ఇళ్లు మంజూరు చేయడం సాధ్యంకాదని సభలో ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. మరో 5లక్షల ఇళ్లను అదనంగా కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై కావలిలో చెప్పులు విసిరారని.. అలాంటివి చెయ్యొద్దన్నారు. తాను పోరాడుతుంటే జగన్, పవన్‌కల్యాణ్‌లు తనకు సహకరించకపోగా కేంద్రానికి సహకరిస్తున్నారని వ్యాఖ్యానించారు.

రాబోయే రోజుల్లో విజయవాడలో 60 వేల మందికి ఇంటి స్థలాలను.. మహిళలకు పసుపు, కుంకుమ కార్యక్రమం కింద ఇవ్వాలని.. ఇసుక రీచ్‌లను నిర్వహించమని కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశానన్నారు. అనంతరం సభా వేదిక నుంచి సీఎం విశాఖ కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇరువురు మహిళల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇల్లు కట్టించినందుకు నన్ను మరిచిపోవద్దని మహిళలిద్దరినీ సీఎం కోరారు.  కాగా, ఉండవల్లి తన నివాసంలోని గ్రీవెన్స్‌ హాల్‌లో రహదారులు, భవనాల శాఖపై గురువారం సమీక్ష నిర్వహించిన సీఎం మాట్లాడుతూ.. వచ్చే జనవరి నాటికి విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్‌ నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు.  


ముందస్తు ఎన్నికల యోచనలో కేంద్రం: సీఎం
కేంద్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. జమిలి ఎన్నికలకు వెళ్లాలనే యోచన కూడా చేస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ వర్గాలకు సూచించారు. ఇకపై ప్రతిరోజూ పార్టీకి అత్యంత ప్రధానమే అని చెప్పారు. గురువారం ఉండవల్లిలోని తన నివాసంలో గుంటూరు జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించే అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది.

త్వరలో మంత్రివర్గ విస్తరణ!
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంశంపై సీఎం చంద్రబాబు ఈ సమావేశంలో ప్రస్తావించారు.   మైనారిటీలకు కేబినెట్‌లో స్థానం కల్పించనందున ఆ వర్గం వారికి విస్తరణలో అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా కొందరు సూచించారు. మైనారిటీల సదస్సు కూడా నిర్వహించాలని నిర్ణయించారు. అంతకుముందే మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు తెలిసింది. మరోవైపు ఇద్దరు ముగ్గురు మంత్రులకు ఉద్వాసన తప్పదని భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement