సాక్షి, మంగళగిరి : విజిటింగ్ ప్రొఫెసర్‌లా ఏడాదికి ఒకసారి గుంటూరుకు వచ్చే గల్లా జయదేవ్ ఈసారి పరాజయదేవ్‌గా పేరు మార్చుకోక తప్పదని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంటు అభ్యర్థి మోదుగుల వేణుగోపాలరెడ్డి అన్నారు. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే)తో కలిసి ఆయన నిన్న నియోజకవర్గానికి ఈశాన్యంలో ఉన్న తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం శ్రీకోదండ రామసమేత శ్రీమద్వీరాంజనేయస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ దుర్యోధన, దుశ్శాసనుల్లాంటి నారా లోకేష్, గల్లా జయదేవ్‌లకు కృష్ణార్జునుల్లాంటి మోదుగుల, ఆర్కే చేతిలో పరాభవం తప్పదని స్పష్టం చేశారు. లోకేష్‌లాగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకోవడానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాలేదని, అలాంటి సచ్ఛీలుడిని గెలిపించుకుంటే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు. వైఎస్సార్ ఆశయ సాధనలో భాగస్వాములమై పోటీ చేస్తున్న ఆర్కేతో తనకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్కే మాట్లాడుతూ లోకేష్‌కి మంగళగిరి నియోజకవర్గ సరిహద్దులు తెలుసా? మూడు సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నానని చెప్పుకుంటున్న లోకేష్ ఏ రోజైనా మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీల్లో తాగునీరు వస్తుందా అని ప్రజలను అడగడం కానీ, అధికారులతో సమీక్ష కానీ చేశారా అని ప్రశ్నించారు.
చేనేత కార్మికుల సమస్యలపై కానీ, లేక మరే సమస్య పైన అయినా ఈ మూడేళ్లలో ఒక్కసారైనా మంగళగిరి నియోజకవర్గ ప్రజలను పలకరించారా అని ఎద్దేవా చేశారు. మంగళగిరి అభివృద్ధికి ఎమ్మెల్యే ఆర్కే నిధులు అడగడం లేదని లోకేష్ వ్యాఖ్యానిస్తున్నారని, దానిపై మీ సమాధానమేంటని విలేకరులు ప్రశ్నించగా, ఆర్కే లోకేష్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళగిరి అభివృద్ధికి ఏఏ ప్రాజెక్టుకి ఎంత కావాలో విపులంగా జాబితా తయారుచేసి, రూ.7కోట్లు నిధులు కావాలని లోకేష్ బాబుని అడిగానో లేదో ఇంటికి వెళ్లి రాత్రికి కనుక్కోవాలన్నారు. రూ.7కోట్లు నిధులు కావాలని విజయవాడ సీఎం క్యాంపు ఆఫీసులో చంద్రబాబును కలిస్తే మీరు వైఎస్సార్ సీపీ తరఫున గెలిచారు, మేం నిధులు ఇవ్వం అని చెప్పడం తెలియదా? తెలియకపోతే లోకేష్ తెలుసుకుని మాట్లాడాలన్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలు కొబ్బరికాయలతో, టెంకాయలతో అభ్యర్థులకు దిష్టితీయగా, మహిళలు భారీ ఎత్తున తరలివచ్చి హారతులతో స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment