సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు 2021 వరకు పూర్తికాదని ఓవైపు కాంట్రాక్ట్ కంపెనీ ట్రాన్స్ ట్రాయ్ చెప్తుంటే.. వాస్తవాలను కప్పిపెడుతూ వచ్చే ఏడాదే నీళ్లిస్తామంటూ మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. పోలవరం కట్టాల్సిన బాధ్యత కేంద్రానిదే.. కానీ ఆ బాధ్యతను చంద్రబాబు తీసుకున్నారు. పోలవరం విషయంలో చంద్రబాబు చెప్తున్న దానికి, వాస్తవానికి చాలా తేడా ఉందన్నారు. కాంక్రీట్ పనులు, ఎర్త్ వర్క్ పనులన్నీ నత్తనడకన నడుస్తున్నాయని వెల్లడించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పోలవరంపై కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే ఏపీ ఎప్పుడో అభివృద్ధి చెందేదని.. ఇప్పటికైనా ప్రత్యేక హోదాను సాధించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు.
పునవర్విభజన చట్టంలోని ప్రతి అంశాన్ని అమలు చేయాలని, ఆ మేరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు వైఎస్ఆర్ సీపీ ఎంపీలు సిద్ధమని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, దుగ్గరాజపట్నం పోర్టు, విశాఖకు రైల్వే జోన్ సహా విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలను కేంద్రం అమలు చేయాలి. వాటితో పాటు ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లొసుగులపై నిలదీస్తామన్నారు. ఇద్దరు రాజ్యసభ సభ్యులపై ఛైర్మన్ అనర్హత వేటు వేశారు. 3 నెలల్లో అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని రాజ్యసభ ఛైర్మన్ చెప్పారని ఈ సందర్భంగా ఎంపీ మేకపాటి గుర్తుచేశారు. అలాగైతే ఏపీకి ఆ నిబంధన వర్తించదా..? ఏపీకి ఓ రూలు.. కేంద్రానికి మరో రూలా? అంటూ మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రశ్నించారు. లోక్ సభలో ఫిరాయించిన ఎంపీలపై చర్యలు తీసుకోవడం లేదని, బుట్టారేణుకపై స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు.
ఉపరాష్ట్రపతిని స్పీకర్లు ఆదర్శంగా తీసుకోవాలి
లాభాలు ఆర్జించే ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడం సరికాదని వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హితవు పలికారు. ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. 'డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లాభాల్లో నడుస్తోంది. గతంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌పై నిలదీస్తే అలాంటిదేమీ లేదన్నారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అంశాన్ని మరోసారి పార్లమెంట్‌లో లేవనెత్తుతాం. కేంద్రం తీసుకొస్తున్న ఎఫ్ఆర్‌డీఐ చట్టంతో డిపాజిటర్లకు నష్టం వాటిల్లుతుంది. ఎఫ్ఆర్డీఐ చట్టం తేవడం పూర్తిగా ప్రజా వ్యతిరేకం. ఈ చట్టంపై కేంద్రాన్ని నిలదీస్తాం. అనర్హత వ్యవహారంలో ఉపరాష్ట్రపతిని స్పీకర్లు ఆదర్శంగా తీసుకోవాలని, పార్టీ మారిన నేతలపై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని' విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.
ఏపీకి ఓ రూలు.. కేంద్రానికి మరో రూలా?
Comments
Please login to add a commentAdd a comment