సాక్షి, విశాఖపట్నం: ఎవరూ ఊహించని విధంగా ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై చర్యలు ఉంటాయని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. కంపెనీలో భద్రతాపరంగా చర్యలు తీసుకోవడంలో యాజమాన్యం వైఫల్యమే ఈ ఘటనకు కారణమని పేర్కొన్నారు. గ‌్యాస్ లీకేజీ బాధిత గ్రామాల్లో శాశ్వత వైఎస్సార్ క్లినిక్‌లను ఏర్పాటు చేసి, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. బుధవారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు కుట్రలను నమ్మవద్దని కోరారు. ప్రభావిత గ్రామాల్లో అయిదుగురు మంత్రులు, ఎంపీలు బస చేసినా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులు యథాస్థితికి వచ్చేవరకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. స్వార్థపూరిత రాజకీయాలకు విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ తీయొద్దని హితవు పలికారు. చంద్రబాబు అబద్దాల ప్రచారం మానుకోవాలని సూచించారు.
తప్పుడు కథనాలతో తప్పుదోవ పట్టించొద్దు: కన్నబాబు
మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. ఇలాంటి సమయంలోనైనా ఈనాడు విలువలు పాటించాలన్నారు. బాబును సంతోష పరిచే ఎజెండాలో భాగంగా ఈనాడు తప్పుడు కథనాలు ఇస్తుందని ధ్వజమెత్తారు. భయానక వాతావరణం ఉందని చిత్రీకరించి తప్పుడు వార్తలతో ప్రజలని తప్పుదోవ పట్టించద్దని కోరారు. చంద్రబాబు హయాంలో విశాఖపై సవతి ప్రేమ చూపించారు.. కానీ ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. అమరావతి కోసం విశాఖను నిలువెల్లా మోసం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు విద్యుత్ బిల్లులు పెంచారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ లీకేజ్‌పై ఇకనైనా రాజకీయం మానేయండని సూచించారు. ఈ ఘటనలో ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుందన్నారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులంతా కోలుకున్నారని తెలిపారు.స్టైరిన్ తరలింపు ప్రక్రియ వేగంగా జరుగుతోందని పేర్కొన్నారు. ఒక టన్ను స్టైరిన్ కూడా ఉండడానికి వీల్లేదని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment