సాక్షి, హైదరాబాద్ : కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నందున.. చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నా సీఎం కేసీఆర్‌ని, టీఆర్‌ఎస్ పార్టీని నమ్మి అభ్యర్థులను గెలిపించాలని ఆపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కోరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నియోజక వర్గంలో అసంతృప్తి ఉన్నమాట వాస్తవమేనన్నారు. ఎన్నికల వేళ ఇవన్నీ సాధారణమని, అన్నింటినీ సర్దుబాటు చేసుకుంటున్నామన్నారు. ఒక్క వారం రోజుల్లో అన్నీ సర్దుకుంటాయని తెలిపారు. అందరం కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తామని చెప్పారు. అభ్యర్థులను మార్చే అవకాశం లేదని కేసీఆర్ చెప్పారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. క్రమ శిక్షణ కలిగిన కార్యకర్తగా, నాయకునిగా ఉంటానని, ప్రజల ఆవేశాన్ని, బాధని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
జిల్లాలో ఎక్కడికి పిలిచినా ప్రచారానికి వెళతానన్నారు. పార్టీకి నష్టం కలిగించే ఏ పని చేయనని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షులు సీఎం కేసీఆర్ తనకు ఎంతో గౌరవం ఇచ్చారని చెప్పారు. తాను ఆశించిన దానికంటే ఎక్కువ బాధ్యత కేసీఆర్ ఇచ్చారని అన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక దళితులపై దాడులు పెరిగాయని ఆరోపించారు. బీజేపీకి దళితుల గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. తెలంగాణలో దళితులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ ముందస్తు ఎన్నికలు మా పార్టీ నిర్ణయం. ప్రతిపక్షాలకు ఎందుకు కడుపునొప్పి. రాజకీయ పార్టీల నాయకత్వం లేనప్పుడు సీఎం పదవి రాదు. అంబేద్కర్ ఇచ్చిన అవకాశం వల‍్ల మాయావతి లాంటి వారు సీఎం అయ్యారని’’ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment