తాను ఏర్పాటుచేసిన విందుకు హాజరైన ఎస్పీ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్
సాక్షి, లక్నో : ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి ఊపిరి పీల్చుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఏర్పాటుచేసిన విందుకు అంతకు ముందు తీవ్ర ఉత్కంఠ రేపి మాయమైన ఏడుగురు ఎమ్మెల్యేలు హాజరుకావడంతో ఆమె పార్టీ రాజ్యసభ సీటును గెలుచుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు నిర్వహించిన కీలక సమావేశానికి గైర్హాజరైన అఖిలేశ్ యాదవ్ బాబాయ్ శివపాల్ యాదవ్ కూడా ఈ విందుకు వచ్చారు. అఖిలేశ్‌తో శివపాల్ యాదవ్ కనిపించడం దాదాపు ఏడాది తర్వాత ఇదే తొలిసారి. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని పది రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 8 స్థానాలు దక్కించుకుంటామని బీజేపీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
ఇక, ఎస్పీకి 1, బీఎస్పీకి 1 రాజ్యసభ సీట్లు ఉన్నాయి. అయితే, తన రాజ్యసభ సీటును గెలుచుకునేందుకు ఎస్పీకి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ పార్టీకి అసెంబ్లీలో 47 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. కానీ, బీఎస్పీకి మాత్రం 19 సీట్లే ఉన్నాయి. అయితే, రాజ్యసభ సీటు దక్కించుకునేందుకు కనీసం 37మంది ఎమ్మెల్యేలు అవసరం ఉంది. ఎస్పీ వద్ద అదనంగా 10 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో వారిని బీఎస్పీకి ఓటువేయాలని ఆదేశించారు. దాంతో బీఎస్పీకి 29మంది ఎమ్మెల్యేల మద్దతు దక్కుతోంది. అయితే, ఇంకా 8మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడుగురు, అజిత్ సింగ్ పార్టీ ఒకరు మాయావతికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. దీంతో మాయవతికి కూడా రాజ్యసభ సీటు దక్కినట్లు అవుతుంది.
అయితే, అనూహ్యంగా బుధవారం ఉదయం జరిగిన కీలక సమావేశంలో ఏడుగురు ఎస్పీ ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం, వారంతా అమిత్‌షాతో టచ్‌లో ఉన్నారని ప్రచారం జరగడంతో బీఎస్పీ, ఎస్పీలో ప్రకంపనలు పుట్టాయి. తమ రాజ్యసభ సీటు గల్లంతవుతుందేమో అని మాయావతి గుబులు చెందారు. అయితే, ఆ సమావేశం అయిపోయిన తర్వాత కొన్ని గంటలకు ఆ కనిపించకుండా పోయిన ఏడుగురు ఎస్పీ ఎమ్మెల్యేలు తిరిగి డిన్నర్‌కు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో ఎస్పీకి బీఎస్పీ సాయం చేసి బీజేపీని ఓడించిన నేపథ్యంలో ప్రస్తుత రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీకి ఎస్పీ సాయం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment