లక్నో: త్వరలో ఉత్తరప్రదేశ్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ నాయకులును ఓడించడానికి కృషి చేస్తామని.. అందుకు అవసరమైతే బీజేపీకి కూడా ఓటు వేస్తామంటూ బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి సంచలన ప్రకటన చేశారు. గతేడాది సార్వత్రి ఎన్నికల సమయంలో మిత్రులుగా ఉన్న వీరు తర్వత బద్ధ శత్రువులుగా మారారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఉంది. ఈ క్రమంలోనే మాయావతి బీజేపీకి ఓటు వేయడానికి కూడా సిద్ధమని ప్రకటించారు. ఇక 1995 జూన్ 2 కేసును విత్‌డ్రా చేసుకోవడం తన జీవితంలో పెద్ద తప్పిదంగా వర్ణించారు. ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిని ఓడించడానికి సర్వ శక్తులూ ఒడ్డుతాం. అవసరమైతే బీజేపీకి ఓటు వేయడానికి కూడా సిద్ధం. లేదంటే మరో పార్టీకి. దీన్ని కచ్చితంగా ఆచరణాత్మకంగా చేసి చూపిస్తాం’ అంటూ మాయావతి సంచలన ప్రకటన చేశారు. (చదవండి: ప్రియాంకపై మాయావతి ఫైర్)
1995 జూన్ 2 కేసును తాము వెనక్కి తీసుకుని చాలా పెద్ద తప్పు చేశామని, వారితో చేతులు కలపకపోతే బాగుండేదని మాయావతి పేర్కొన్నారు. ఎస్పీతో కలిసి లోక్‌సభ ఎన్నికల్లో దిగాలని డిసైడ్ అయినప్పటి నుంచి తమ పార్టీ కార్యకర్తలు విజయం కోసం తీవ్రంగా శ్రమించారని తెలిపారు. ఇలా చేతులు కలిపిన మొదటి రోజు నుంచే 1995 లో సమాజ్‌వాదీపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని నేతలు తమపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారని ఆమె వెల్లడించారు. ఆ కేసును వెనక్కి తీసుకొని తాము పెద్ద తప్పే చేశామని మాయావతి వ్యాఖ్యానించారు. (చదవండి: బీఎస్పీకి ఆరుగురు ఎమ్మెల్యేలు గుడ్‌బై! )
ఇక యూపీలోని 10 రాజ్యసభ స్థానాలకు నవంబర్ 9న ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో మాయావతి ఈ సచంలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అసెంబ్లీలో తన బలం దృష్ట్యా బీఎస్పీ తన అభ్యర్థిగా రామ్‌జీ గౌతమ్‌ను రంగంలోకి దింపింది. ఆయన పేరును 10 మంది బీఎస్పీ ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. ఈ మేరకు నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అయితే తమ సంతకాలను ఫోర్జరీ చేశారని, రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి తాము మద్దతు ఇవ్వబోమని ఆరుగురు ఎమ్మెల్యేలు బుధవారం తేల్చిచెప్పారు. పార్టీ అధినేత మాయావతిపై తమకు ఎలాంటి అసంతృప్తి లేదని వారు స్పష్టం చేశారు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే రిటర్నింగ్ అధికారిని కలిసిన కొద్దిసేపటికే వారంతా సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌ను కలుసుకునేందుకు ఆయన పార్టీ కార్యాలయానికి నేరుగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మాయావతి పై ప్రకటన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment