సాక్షి, అమరావతి: జాతీయ స్థాయిలో సంచలనం రేపిన రాష్ట్రంలోని మూడు ప్రధాన ఘటనల్లో కీలక పాత్రధారులైన ముగ్గురు కొద్ది రోజులుగా కన్పించకపోవడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. దీంతో ‘ఆపరేషన్ గరుడ’ అంటూ భవిష్య వాణి వినిపించిన సినీనటుడు శివాజీ, ఐటీ దాడులపాలైన సీఎం రమేష్, సీబీఐ హిట్ లిస్ట్‌లో ఉన్న సాన సతీష్‌ల కదలికలపై నిఘా మొదలైంది. ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరుగుతుందని ముందే చెప్పిన శివాజీని అదుపులోకి తీసుకుని విచారిస్తే గరుడ పురాణం వెనుక అసలు విషయాలు వెలుగు చూస్తాయనే వాదన బలపడుతోంది. ఈ నేపథ్యంలో ఆయన కొద్ది రోజుల క్రితం అమెరికాకు వెళ్లారు. ఆదివారం రాత్రి ఒక మీడియా ఛానల్‌కు అమెరికా నుంచి ఇంటర్వ్యూ ఇచ్చారు.
చంద్రబాబు కనుసన్నల్లోనే నిర్వహిస్తున్న ఆపరేషన్ గరుడలో కుట్రదారుడైన నటుడు శివాజీని అరెస్టు చేసి, విచారించాలంటూ విజయవాడకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, పి.గౌతంరెడ్డి తదితరులు సోమవారం విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావుకు ఫిర్యాదు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇతర నాయకులు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం సమాచారాన్ని శివాజీకి ముందస్తుగా ఎవరు అందించారో బయట పెట్టాలని వారు డిమాండ్ చేశారు.
అమెరికా నుంచి కడపకు..
టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌పై కడప, హైదరాబాద్‌లలో ఇటీవల పెద్ద ఎత్తున ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సోదాల అనంతరం ఆయన అమెరికాకు వెళ్లిపోయారు. ఆయన కన్పించకపోవడంతో రాష్ట్రంలో ఆసక్తికర చర్చసాతున్న తరుణంలో ఆదివారం రాత్రి ఆయన కడపకు చేరుకున్నారు. మంగళవారం సీఎం చంద్రబాబు నిర్వహించనున్న ధర్మపోరాట దీక్షలో పాల్గొనేందుకే సీఎం రమేష్ వచ్చారని చెబుతున్నారు. కాగా, సీబీఐ హిట్‌లిస్ట్‌లో ఉన్న సాన సతీశ్ ఎక్కడ ఉన్నారనేదానిపై చర్చ జరుగుతోంది. కాకినాడలోని సతీశ్ గెస్ట్‌హౌస్, ఆయన అనుచరుల ఇళ్లలో సీబీఐ అధికారులు ఆదివారం సోదాలు నిర్వహించారు. దీంతో సీబీఐ నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ సతీష్ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
Comments
Please login to add a commentAdd a comment