విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి,
వైఎస్సార్ జిల్లా : పార్టనర్ షిప్ సమ్మిట్లలో ఇప్పటివరకు రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి డిమాండ్ చేశారు. రాయచోటిలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజాధనం వెచ్చించి జరిపిన పార్టనర్ షిప్ సమ్మిట్ ప్రచార ఆర్భాటమేనని వ్యాఖ్యానించారు. లక్షల కోట్లు పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు అంటున్నారు..ఢిల్లీలోని డీఐపీపీలో నమోదైన రికార్డుల ప్రకారం ఏపీకి లక్షల కోట్లు రూపాయల పెట్టుబడులు వచ్చినట్లు కనబడటం లేదని ప్రశ్నించారు. సమ్మిట్ల పేరుతో విదేశాలు చక్కర్లు కొట్టి ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. తప్పుడు లెక్కలు చూపి కేంద్రాన్ని, ఏపీ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని విమర్శించారు. దీని వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా వెనకబడి, దారుణమైన పరిస్తితి ఏర్పడిందని అన్నారు. ఊరు, పేరు లేని సంస్థలు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాయని చెబుతూ అబద్దాలు ఆడుతున్నారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేశాయని, ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుందని చెబుతూ ప్రజల్ని మభ్యపెడుతున్నారని విమర్శించారు. నేడు సమ్మిట్ కోసం వందల, వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకూ ఒక్క పరిశ్రమ రాలేదని, అన్ని పెట్టుబడులు వస్తే నిరుద్యోగ సమస్య ఉండేది కాదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి తప్పిదాల్ని ఎత్తిచూపితే, అది ఇతరులపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.14 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించి, రాయలసీమను నిట్టనిలువునా ముంచారని మండిపడ్డారు. హైకోర్టు అడిగితే సుప్రీంకోర్టు, రాజధాని అడిగితే పార్లమెంటు నిర్మించుకోండంటూ కేబినేట్ మంత్రులు అవహేళన చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. మీ మంత్రులు, ఎంపీలు దేశ సమగ్రతను మరిచి దక్షిణ భారత దేశం వేరే దేశంగా విడిపోవాలంటూ మాట్లాడటం దేశాన్ని కించపరిచే విధానం కాదా? అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment